సాక్షి, అమరావతి: అప్పులతో రాష్ట్రం మరో శ్రీలంకలాగ అయిపోతోందని కొండంత రాగాలు తీస్తున్న ఎల్లో బ్యాచ్‌కు షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ నేతలు, ఎల్లో మీడియా నిత్యం చేస్తున్న ప్రచారాలన్నీ పచ్చి అబద్ధాలని ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టమైంది. 2022–23 ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి దేశంలోని ఏ రాష్ట్రానికి ఎన్ని అప్పులున్నాయి, ఎంత మేర అప్పులు పెరుగుతున్నాయి, ప్రభుత్వ గ్యారెంటీ అప్పుల ఎన్ని? అనే వివరాలతో కూడిన నివేదికను ఆర్బీఐ బుధవారం విడుదల చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు వాస్తవాలను చెప్పినప్పటికీ కూడా టీడీపీ, ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిపోయిందంటూ పదే పదే దుష్‌ప్రచారం చేయడం తెలిసిందే. ఇప్పుడు స్వయంగా ఆర్బీఐనే రాష్ట్రాల అప్పుల వివరాలు వెల్లడించడంతో వాస్తవాలు ప్రజలు తెలుసుకుని, ఎల్లో బ్యాచ్‌ది తప్పుడు ప్రచారం అని అర్థం చేసుకునే అవకాశం కలిగింది.
ప్రభుత్వ గ్యారెంటీ అప్పులపైనా తప్పుడు రాతలే..
ప్రభుత్వ గ్యారెంటీ ద్వారా వివిధ సంస్థలు తీసుకున్న అప్పులపై కూడా విపక్ష నేతలు దుష్ప్రచారం చేయడమే కాకుండా, ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచురిస్తోంది. అప్పులను దాచేస్తున్నారంటూ వింత పోకడలు పోతున్నారు.
ప్రభుత్వాల అప్పులు దాచడానికి అవకాశం ఉండదనే కనీస జ్ఞానం లేకుండా ఎల్లో మీడియా వార్తలు రాస్తోందని నిపుణులు మండిపడుతున్నారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల ద్వారా వివిధ సంస్థలు తీసుకున్న అప్పులు రూ.1,17,503 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. అలాగే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం గ్యారెంటీ ద్వారా వివిధ సంస్థలు చేసిన అప్పులు రూ.1,35,282 కోట్లుగా ఆ నివేదిక పేర్కొంది.
చెప్పేవన్నీ అబద్ధాలే..
రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లు అని ఓసారి, 11 లక్షల కోట్లు అని మరోసారి రోజుకో మాట మారుస్తూ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టమైంది. 2022–23 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4,42,442 కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఇకనైనా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా వాస్తవాలను తెలుసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
‘అప్పు’డే ఎక్కువ
రాష్ట్రాల అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఇక అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా.. ఆ తరువాత వరుస స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అప్పులు ఎక్కువ చేస్తోదంటూ టీడీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్బీఐ నివేదిక ద్వారా స్పష్టమైంది. అంతేకాదు.. చంద్రబాబు హయాంలో అప్పుల వృద్ధి ఎక్కువ ఉందని స్పష్టమైంది.
2018–19లో చంద్రబాబు హయాంలో అప్పుల వృద్ధి 15.3 శాతంగా ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఆ తరువాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అది క్రమంగా తగ్గుతూ వస్తోందని, అప్పుల వృద్ధి 2020–21లో 14.7 శాతం, 2021–22లో 11.5 శాతం, 2022–23లో 12.4 శాతం ఉందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. 2018–19లో చంద్రబాబు ప్రభుత్వంలో అప్పుల వృద్ధి కన్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పులు వృద్ధి తక్కువగా ఉందంటే అప్పులు తక్కువగా చేస్తున్నట్లేనని స్పష్టం అవుతోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment