నూకరాజు(తాతాలు) మృతదేహాన్ని ఆటోలోకి ఎక్కిస్తున్న సిబ్బంది
తెర్లాం: కరోనా మహమ్మారి మానవత్వాన్ని తుంచే స్తోంది. మనుషులను కఠిన పాషాణులుగా మార్చేస్తోంది. ఏ కారణంగా మృతి చెందినా... ఆయనకు కరోనా ఉందేమోనన్న భయంతో దగ్గరకు వెళ్లేందుకు కూడా వెనుకంజ వేసేలా చేస్తోంది. ఇలాంటి సంఘటనే తె ర్లాంలో శుక్రవారం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి కరోనా ఉందేమోనన్న భయంతో అంత్యక్రియలు జరిపించేందుకు కూడా బంధువులు ముందుకు రాలేదు. తుదకు ఎస్‌ఐ జోక్యం చేసుకుని ఆటోలో మృతదేహాన్ని తరలించి, తానే స్వయంగా దగ్గరుండి ఖననం చేయించారు. వివరాలిలాఉన్నాయి. తెర్లాం గ్రామానికి చెందిన వడ్డాది నూకరాజు(తాతా లు) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. విషయం బంధువులకు తెలియజేసినప్పటికీ అంత్యక్రియలు జరిపించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. కన్నకుమారుడు దివ్యాంగుడు కావడంతో నిస్సహాయంగా ఉండిపోయాడు.
శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు కూడా ఎవరూ సహకరించలేదు. కరోనా పాజిటివ్ ఉందేమోనన్న భయంతో ఎవ్వరూ దగ్గరకు చేరలేదు. ఈ విషయాన్ని ఆయన సామాజిక వర్గానికే చెందిన కందుల శ్రీనివాసరావు ఎస్సై నవీన్ పడాల్‌కు ఫోన్‌లో తెలియజేశారు. ఆయన వెంటనే మృతుని ఇంటికి వచ్చి మరణించిన నూకరాజుకు కరోనా వైరస్ లేదని, అంత్య క్రియ లు జరిపించేందుకు ముందుకు రావాలని బంధువులకు నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. ఇక చేసేది లేక ఎస్‌ఐ మానవత్వంతో ఆలోచించి తానే ఆ మృతదేహా న్ని ఖననం చేసేందుకు పూనుకున్నారు. గ్రా మానికి దగ్గరలో ఉన్న చెరువులో జేసీబీతో గొయ్యిని తీయించారు. మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి ఖననం చేశారు.
అనారోగ్యంతోనే మృతి చెందాడు
తెర్లాంకు చెందిన వడ్డాది నూకరాజు(తాతాలు) అనారోగ్యంతోనే మృతి చెందాడు. అతనికి కరోనా లక్షణాలు లేవు. వృద్ధాప్యంలో ఉండడంతో కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మృతునికి కరోనా లేదు. కేవలం పుకార్లతోనే మృతునికి అంత్యక్రియలు జరిపించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని తెలిసింది. ఇది చాలా బాధాకరం.
– డాక్టర్ రెడ్డి రవికుమార్, వైద్యాధికారి, తెర్లాం పీహెచ్‌సీ
Comments
Please login to add a commentAdd a comment