Fertilizers: రైతన్నకు ఊరట.. బస్తాపై 300- 700 తగ్గింపు! | Releaf to farmers in kharif time | Sakshi
Sakshi News home page

Fertilizers: రైతన్నకు ఊరట.. బస్తాపై 300- 700 తగ్గింపు!

Published Wed, Jun 2 2021 4:32 AM | Last Updated on Wed, Jun 2 2021 1:15 PM

Releaf to farmers in kharif time - Sakshi

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు ఇదో శుభవార్త. అంతర్జాతీయంగా పెరిగిన ముడి సరుకు ధరల కారణంగా కంపెనీలు భారీగా పెంచిన ఎరువుల ధరలు మళ్లీ దిగి వచ్చాయి. రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పెంచడంతో రైతులకు ఊరట లభించింది. తగ్గిన ధరలు మే 20వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. డీలర్లంతా తగ్గించిన ధరలకే ఎరువుల్ని విక్రయించాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఫాస్పరస్, అమ్మోనియా, పొటాష్, నైట్రోజన్‌ ధరలు 60 నుంచి 70 శాతం వరకు పెరగడంతో డీఏపీ, కొన్నిరకాల మిశ్రమ (కాంప్లెక్స్‌) ఎరువుల ధరలను కంపెనీలు దాదాపు రెట్టింపు చేశాయి. గతేడాది రబీ సీజన్‌ ముగిసే నాటికి రూ.1,200 ఉన్న డీఏపీ బస్తా ధరను ఏప్రిల్‌ నెలలో రూ.2,400కు పెంచాయి.

డీఏపీతో పాటు కొన్నిరకాల కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను కూడా రూ.100 నుంచి రూ.500 వరకు పెంచాయి. ఖరీఫ్‌లో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగం ఆధారంగా రాష్ట్రంలోని రైతులపై రూ.2,500 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా వేశారు. కరోనా కష్టకాలంలో రైతులకు అండగా నిలవాల్సింది పోయి ధరలు పెంచితే ఎలా అంటూ రైతు సంఘాలు గగ్గోలు పెట్టాయి. సబ్సిడీని పెంచి రైతుపై భారం పడకుండా చూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తి మేరకు డీఏపీపై ఇచ్చే రూ.500 సబ్సిడీని రూ.1200కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు నెలలపాటు ఎగబాకిన ధరలు మళ్లీ దిగి వచ్చాయి.

రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు
రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌–2020లో 18.39 లక్షల టన్నుల ఎరువులను రైతులు వినియోగించారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 21.70 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేయగా.. కేంద్ర ప్రభుత్వం 20.20 లక్షల టన్నులను రాష్ట్రానికి కేటాయించింది. 6.66 లక్షల టన్నుల పాత ఎరువులతో పాటు ఇటీవల 2.58 లక్షల టన్నులను కలిపి 9.24 లక్షల టన్నుల ఎరువులను జిల్లాలకు కేటాయించారు. గడచిన నెల రోజుల్లో 1.33 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 7.91 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూరియా 3.14 లక్షల టన్నులు, డీఏపీ 46 వేల టన్నుల, ఎంవోపీ 64 వేల టన్నులు, ఎస్‌ఎస్‌పీ 72 వేల టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువు 3.01 లక్షల టన్నుల మేర నిల్వలున్నాయి.

తగ్గిన ధరలకే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు
కేంద్రం సబ్సిడీ పెంచడంతో డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు తగ్గాయి. ఖరీఫ్‌ సీజన్‌లో ఎక్కువగా వినియోగించే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు బస్తాకు రూ.700 వరకు తగ్గాయి. ఈ ధరలు గతనెల 20 నుంచి అమల్లోకి వచ్చాయి. డీలర్లు ఎవరైనా గతంలో పెంచిన ధరలకు ఎరువుల్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  
 – హెచ్‌.అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయ శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement