గ్రీన్‌ ఎనర్జీలో రిలయన్స్‌ భారీ పెట్టుబడులు | Reliance is investing heavily in green energy | Sakshi

గ్రీన్‌ ఎనర్జీలో రిలయన్స్‌ భారీ పెట్టుబడులు

Feb 18 2024 5:27 AM | Updated on Feb 18 2024 5:27 AM

Reliance is investing heavily in green energy - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యావరణహిత ఇంధనం (గ్రీన్‌ ఎనర్జీ) ఉత్పత్తికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తుండటంతో దిగ్గజ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా రిలయన్స్‌ గ్రూప్‌ సుమారు రూ.1,920 కోట్ల పెట్టుబడితో 15 చోట్ల కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా తొలి దశలో 8 యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

వ్యవసాయ వ్యర్థా­లు.. వరిగడ్డి, వేరుశెనగ పొట్టు, జొన్న కంకులు, ఖాళీ కొబ్బరి బొండాలు, చెరకు పిప్పి, ముని­సిపాలిటీల నుంచి రోజూ వచ్చే వ్యర్థాల నుంచి కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ 15 యూనిట్ల ద్వారా పూర్తిగా పర్యావరణహితమైన గ్యాస్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా సేంద్రియ ఎరువులను కూడా తయారుచేయొచ్చు. ఇప్పటివరకు ఈ వ్యర్థాలను తరలించే అవకా­శం లేకపోవడంతో రైతులు పొలాల్లోనే వాటిని తగులబెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం వెలువడుతోంది.. నేల­సా­రం కూడా తగ్గిపోతోంది.

ఇప్పుడు ఇలా కాకుండా నేరుగా రైతుల నుంచే రిలయన్స్‌ ఈ వ్యర్థాలను కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ప్రతి యూనిట్‌కు కనీసం ఐదు కలెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. వ్యర్థాల కొను­గోలు చేయడం ద్వారా కనీసం 70 వేల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా. ప్రతి రైతుకు అదనంగా రూ.6,250 చొప్పున ఏటా రైతులకు రూ.45 కోట్ల వరకు అదనపు ఆదా­యం లభించనుంది. అంతేకాకుండా ఈ సీబీజీ యూనిట్లకు అనుబంధంగా మరో రూ.1,000 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని రిలయన్స్‌ అధికారులు వెల్లడించారు.

తగ్గనున్న కర్బన ఉద్గారాలు, దిగుమతులు..
దేశవ్యాప్తంగా రిలయన్స్‌ ఏర్పాటు చేస్తున్న 100 సీబీజీ యూనిట్లకు ఏటా 5.5 మిలియన్‌ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు అవస­రమ­వు­తా­య­ని అంచనా. తద్వారా 2.2 మిలియన్‌ ట­న్ను­ల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. ఈ యూ­ని­ట్ల ద్వారా సీబీజీనే కాకుండా 2.5 మిలియన్‌ ట­న్ను­ల సేంద్రియ ఎరువులు కూడా ఉత్ప­త్త­వుతాయి. అంతేకాకుండా ఏటా ఏడు మిలియన్‌ టన్నుల ఎల్‌ఎన్‌జీ దిగుమతులు తగ్గడం ద్వారా విదేశీమారక నిల్వలు పెరగనున్నాయి.  

వాటికి ప్రత్యామ్నాయంగా సీబీజీ..
రానున్న కాలంలో ఎల్‌ఎన్‌జీ (లిక్విడ్‌ నేచురల్‌ గ్యాస్‌), సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌)లకు ప్రత్యామ్నాయంగా సీబీజీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిలయన్స్, అదానీ వంటి సంస్థలు ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. రిలయ­న్స్‌ అనుబంధ కంపెనీ.. రిలయన్స్‌ బయో­ఎనర్జీ లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో 100 సీబీజీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ 100 యూనిట్లలో 15 యూనిట్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. సుమారు రూ.130 కోట్లతో 20 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో యూనిట్‌ ఉంటుంది. తొలి దశలో భాగంగా కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద 2, విజయవాడ పరిటాల వద్ద, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒకటి చొప్పున ఏర్పాటు చేయనుంది. తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభమైన ఈ 8 యూనిట్లు వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి రానున్నాయి.

రెండో దశలో మరో ఏడు యూనిట్లను 2026 సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసు­కురావాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం ఈ 15 యూనిట్ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఒక్కో యూనిట్‌ ద్వారా ఏటా 7,000 టన్నుల సీబీజీ, 34,300 టన్నుల సేంద్రియ ఎరువులు ఉత్పత్తి కానున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement