
మలిదశ వృద్ధి ప్రయాణానికి రిలయన్స్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. 2016లో జియో 4జీ టెలికం సేవలను ప్రారంభించడం ద్వారా భారత్‌ను డేటా పరంగా సంపన్న దేశంగా మార్చినట్టు కంపెనీ వార్షిక నివేదికలో అంబానీ పేర్కొన్నారు. జియో ద్వారా దాదాపు దేశంలోని ప్రతి ఇంటికీ అధిక వేగంతో కూడిన 4జీ డేటాను అందుబాటు ధరలకు అందిస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అంతర్జాతీయ అనిశ్చితులున్నా ప్రపంచంలో భారత్ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. వేగంగా వృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగ అవసరాలను తీర్చే స్థాయిలో రిలయన్స్ రిటైల్ ఉంది. 100 బిలియన్ డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) విలువ కలిగిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో బడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నార’ని చెప్పారు.
ఇదీ చదవండి: ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్ అంబానీ!
గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్
‘2035 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదలే(నెట్ జీరో) లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు వీలుగా జామ్‌నగర్‌లో దీరూభాయి అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల తయారీకి సంబంధించి రిలయన్స్ సమగ్ర కేంద్రంగా ఉంటుంది. వయకామ్ 18, స్టార్ ఇండియా వ్యాపారాల విలీనంతో జాయింట్ వెంచర్ టెలివిజన్, డిజిటల్ స్ట్రీమింగ్‌లో అగ్రగామిగా అవతరిస్తున్నాం’ అని ముఖేశ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment