
సాక్షి, అమరావతి: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు చేపట్టేందుకు, రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తక్షణమే పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల అమలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆక్సిజన్, పరికరాలు అందుబాటులో ఉంచడం, హోం ఐసొలేషన్ కిట్లు సరఫరా, ఫీవర్ సర్వే, అత్యవసర మందులు తదితర అంశాలను సమర్ధంగా పర్యవేక్షించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారులతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఐఏఎస్ అధికారులు, వారి బాధ్యతలు
► ఎం.టి.కృష్ణబాబు: కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన ఆహారం సరఫరా, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు
► ఎం.రవిచంద్ర: జిల్లాస్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, కోవిడ్ కేర్ సెంటర్లలో శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, కోవిడ్ కేసుల రోజువారీ సమాచారం, ప్రజల్లో చైతన్యం కలిగించడం, సహాయ చర్యల్లో జాయింట్ కలెక్టర్లు, ఎన్‌జీవోలు, యునిసెఫ్‌తో సమన్వయం
► ఎ.బాబు: రాష్ట్ర, జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లు సమర్ధంగా పనిచేసేలా చూడటం, హెల్ప్ డెస్క్, సీసీ టీవీ వ్యవస్థల పర్యవేక్షణ
► వి.వినయ్‌చంద్: ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు, ల్యాబ్ మేనేజ్‌మెంట్, మొబైల్ మెడికల్ యూనిట్లు, అంబులెన్స్‌ల పర్యవేక్షణ
► మురళీధర్ రెడ్డి: కోవిడ్ మందులు, పరికరాల కొనుగోలు, ఆక్సిజన్ లైన్లు, పీఎస్‌ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లు సక్రమంగా పనిచేసేలా చూడటం, శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచడం
► జె.సుబ్రహ్మణ్యం: కోవిడ్ కేసుల వివరాల సేకరణ, విశ్లేషణ, నివేదికలు రూపొందించడం, గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో పాజిటివ్ కేసులు పెరగకుండా రోజూ కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సమర్ధవంతమైన చర్యలు చేపట్టడం
► ఐఏఎస్‌లు జి.సృజన, షాన్‌మోహన్, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి: మెడికల్ ఆక్సిజన్ సరఫ రా,పరిశ్రమల యూనిట్లు, రైల్వేతో సమన్వ యం, ఎల్‌ఎంఓ కేటాయింపు, ఉత్పత్తి బాధ్యత
► వి.వినోద్‌కుమార్: క్లినికల్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రొటోకాల్, వెంటిలేటర్ల సరఫరా, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచడం
► రవి శంకర్: అత్యవసర మందులు అందుబాటులో ఉంచడం, మందుల ధరల నియంత్రణ
► జి.ఎస్. నవీన్‌కుమార్: ఫీవర్ సర్వే పర్యవేక్షణ, హోం ఐసొలేషన్ కిట్‌ల పంపిణీ, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం
Comments
Please login to add a commentAdd a comment