సాక్షి,ఎమ్మిగనూరు: శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్న రిటైర్డ్ హెచ్‌ఎంను మృత్యువు కబళించింది. పదవీ విరమణ పొందిన 15 రోజుల్లోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్‌లో నివాసముంటున్న రిటైర్డ్ హెచ్‌ఎం ప్రసాద్ (60), అరుణ దంపతులకు ముగ్గురు సంతానం. వీరి కుమారుడు కృష్ణసాగర్ మైసూర్‌లో రైల్వే ఉద్యోగిగా పని చేస్తుండగా, కుమార్తె మానస విజయవాడలో డాక్టర్‌గా పని చేస్తున్నారు. మరో కుమార్తె మేఘనకు వివాహమైంది. ప్రసాద్ కడివెళ్ల గ్రామంలోని ఎంపీపీ మెయిన్ స్కూల్‌లో హెచ్‌ఎంగా పనిచేస్తూ గత నెల 31వ తేదీన రిటైర్డ్ అయ్యారు.
పదవీ విమరణ బిల్లులతో పాటు నాడు–నేడు బిల్లులు అందజేసేందుకు మంగళవారం ఉదయం బైక్‌పై కర్నూలుకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి ఎమ్మిగనూరుకు బయలుదేరాడు. అదే సమయంలో కోడుమూరుకు చెందిన భాస్కర్ ఎమ్మిగనూరులో తమ బంధువులు చేసిన దేవరకు హాజరై సాయంత్రం బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎర్రకోట – రాళ్లదొడ్డి గ్రామాల మధ్య ఏడు మోరీల బ్రిడ్జి దగ్గర రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో రిటైర్డ్ హెచ్‌ఎం ప్రసాద్, భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని 108లో ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు.
తలకు తీవ్ర గాయమైన ప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న భార్య అరుణ, బంధువులు, ఉపాధ్యాయులు ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త మృతదేహం వద్ద అరుణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ చెల్లెలు అరుణ భర్త. మెరుగైన చికిత్స నిమిత్తం భాస్కర్‌ను కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ హెడ్‌కానిస్టేబుల్ చంద్ర విలేకరులకు తెలిపారు.
చదవండి: వీడియో వైరల్: వేలు చూపిస్తూ వార్నింగ్, అంతలోనే తుపాకీతో..
Comments
Please login to add a commentAdd a comment