గంజాయిని దహనం చేస్తున్న విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ తదితరులు
సాక్షి, అనకాపల్లి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు(శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, అనకాపల్లి) జిల్లాల్లో స్వాధీనం చేసుకున్న లక్షా 93 వేల కిలోల గంజాయి, 131 కిలోల హాష్ ఆయిల్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామ శివారులో శనివారం గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ డీఐజీ హరికృష్ణ , అనకాపల్లి ఎస్పీ గౌతమి సాలి, అల్లూరి ఎస్పీ సతీష్‌కుమార్‌లు నిప్పుపెట్టి ధ్వంసం చేశారు. దీని విలువ రూ.240 కోట్లకు పైగా ఉంటుందని పోలీసుల అంచనా. ఈ కేసుల్లో 3,500 మందిని అరెస్ట్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.300 కోట్ల విలువైన గంజాయిని, ఇప్పుడు రూ.240 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశారు. విశాఖ రేంజ్ పరిధిలో ఇప్పటి వరకు ఏడు సార్లు ఇలా గంజాయి ధ్వంసం జరిగింది. ఆంధ్ర ఒడిశా బోర్డర్(ఏఓబీ) కేంద్రంగా గంజాయి వివిధ రాష్ట్రాల ప్రధాన నగరాలకు తరలివెళుతోంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఏజెన్సీకి సందర్శన పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి.. అక్కడ నుంచి డ్రై గంజాయి, లిక్విడ్ గంజాయి ప్యాకెట్లను వివిధ మార్గాల ద్వారా తరలిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరుతో గతంలో 7,552 ఎకరాల్లో, ఈ ఏడాది 650 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు.
పేరేచర్ల ప్రాంతంలో ధ్వంసం: సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన గంజాయిని గుంటూరు రేంజ్ పోలీసులు శనివారం దహనం చేశారు. గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టే దిశగా ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఇటీవల రేంజ్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించిన 10,340 కిలోల గంజాయిని పేరేచర్లలోని కైలాసగిరి వద్ద ఉన్న పోలీస్ ఫైర్ రేంజ్ వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ, గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్, ప్రకాశం ఎస్పీ మలికాగార్గ్, పల్నాడు ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment