![Rs 344 crore reward for Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2021/01/7/MONEY-BAG.jpg.webp?itok=jJg1wga2)
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నాలుగు పౌర సంస్కరణల్లో మూడింటిని ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు పూర్తి చేశాయి. వన్ నేషన్–వన్ రేషన్ కార్డ్ సంస్కరణతో పాటు సులభతర వాణిజ్యం సంస్కరణలు, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలను ఈ రెండు రాష్ట్రాలు పూర్తి చేశాయి. దీంతో మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ.344 కోట్లు లభించగా, మధ్యప్రదేశ్‌కు మూలధన ప్రాజెక్టుల కోసం రూ.660 కోట్లు అందుకునే అర్హత లభించింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ఈ పథకాన్ని 2020 అక్టోబర్ 12న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సంస్కరణలను పూర్తి చేసి ఈ రాష్ట్రాలకు జారీ చేసిన రూ.14,694 కోట్ల మూలధన వ్యయానికి ఈ మొత్తం రూ.1,004 కోట్లు అదనపు ఆర్థిక సాయం లభించనుంది.
27 రాష్ట్రాల్లో రూ.9,880 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం..
కోవిడ్–19 సంక్షోభం కారణంగా తలెత్తిన పన్ను ఆదాయంలో కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మూలధన వ్యయాన్ని పెంచేందుకు ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఎక్స్‌పెండిచర్’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు 27 రాష్ట్రాల్లో రూ.9,880 కోట్ల మూలధన వ్యయ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా ఇప్పటికే రూ.4,940 కోట్లు రాష్ట్రాలకు విడుదలయ్యాయి. ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, నీటిపారుదల, విద్యుత్, రవాణా, విద్య, పట్టణాభివృద్ధి వంటి వివిధ రంగాల్లో మూలధన వ్యయ ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment