మారుమూల పల్లెలకు బడిబస్సులు | RTC free buses for school students In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మారుమూల పల్లెలకు బడిబస్సులు

Published Fri, Mar 5 2021 3:40 AM | Last Updated on Fri, Mar 5 2021 3:40 AM

RTC free buses for school students In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టీసీ నడుపుతున్న ఉచిత బస్సులపై గత ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారు మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కళాశాల విద్యార్థులకు రాయితీ బస్‌పాస్‌ పరిధిని కూడా పెంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మారుమూల పల్లెలకూ బడి బస్సులు నడుపుతోంది. మొత్తం మీద విద్యార్థుల చదువులకు పెద్దపీట వేస్తూ అందుకు రవాణా ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ప్రత్యేకంగా డెడికేటెడ్‌ రవాణా సౌకర్యం కూడా కల్పించింది. దీంతో రాష్ట్రంలో టెన్త్‌ లేదా 18 ఏళ్లలోపు ఆడపిల్లలు, 12 ఏళ్లలోపు (ఏడో తరగతి) విద్యార్థులు ఉచితంగా బస్‌పాస్‌లు పొంది తమ చదువులను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తున్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో 20 కి.మీ.లోపు.. పట్టణ, నగర ప్రాంతాల్లో 22 కి.మీ.లోపు ఉచిత ప్రయాణాన్ని కూడా ఆర్టీసీ విద్యార్థులకు కల్పిస్తోంది.

మరోవైపు.. ఇంటర్మీడియెట్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులకు 80–90 శాతం వరకు రాయితీ బస్‌పాస్‌లను అందిస్తోంది. గతంలో విద్యార్థులకు ఉచిత, రాయితీ పాస్‌లిచ్చినప్పటికీ ఆర్టీసీ సరిగ్గా బస్సులను నడిపేది కాదు. టీడీపీ హయాంలో అయితే ఆర్టీసీ బస్సులను డ్వాక్రా మహిళలను సభలకు తరలించేందుకు, పోలవరం యాత్రలకు పంపడమే తప్ప బడి బస్సులను ఏర్పాటుచేసిన దాఖలాల్లేవు. దీంతో మారుమూల గ్రామాల్లోని విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లడానికి నానా యాతన పడేవారు. బస్సుల కోసం విద్యార్థులు ధర్నాలు చేసిన ఘటనలున్నాయి. కానీ, వైఎస్‌ జగన్‌ సర్కారు వచ్చాక విద్యార్థుల అవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అన్ని రీజియన్ల నుంచి కేవలం పాఠశాల, కళాశాల విద్యార్థుల కోసమే ఆర్టీసీ 480 డెడికేటెడ్‌ బస్సులకు శ్రీకారం చుట్టింది. 

రాయితీ బస్‌పాస్‌ల పరిధి పెంపు
విద్యార్థులకు అందించే రాయితీ బస్‌పాస్‌లను గతంలో 35 కిలోమీటర్లకు పరిమితం చేశారు. దీంతో విద్యార్థులు అప్పట్లో నానా ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే.. రాష్ట్రంలో అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో నెలకొన్నాయి. దీంతో విద్యార్థులు తమ ఇంటి నుంచి పాఠశాల, కళాశాలకు వెళ్లాలంటే 40–50 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఈ కారణంగా రాయితీ బస్‌పాస్‌లు ఉపయోగకరంగా ఉండేవి కావు. విద్యా సంస్థల బస్సుల్లో వెళ్లాలంటే రవాణా ఛార్జీలు అధికమయ్యేవి. విధిలేని పరిస్థితుల్లో షేర్‌ ఆటోల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకునే ప్రయాణించే వారు. ఈ ఇబ్బందుల్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. రాయితీ బస్‌పాస్‌ల కిలోమీటర్ల పరిధిని 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 660 విద్యా సంస్థలు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం లెక్కగట్టి ఆ మేరకు పరిధిని పెంచుతూ జీఓ జారీచేసింది. ఈ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందారు. అలాగే, పరిధి పెంపుతో ప్రభుత్వంపై ఏటా 18.50 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడింది.

 

బస్‌పాస్‌లకు వంద శాతం రీయింబర్స్‌మెంట్‌
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఆర్టీసీ మొత్తం 57,042 ఉచిత, 76,099 రాయితీ బస్‌పాస్‌లను జారీచేసింది. ఇందుకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నూరు శాతం ఆర్టీసీకి రీయింబర్స్‌ చేస్తోంది. ఇలా ఏటా రూ.450 కోట్ల మేర ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. కాగా, ఆర్టీసీలో పనిచేసే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది 5 వేల మందికి కూడా సంస్థ ఉచిత పాస్‌లు అందించింది. అలాగే, ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకూ వీటిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. 

ఉచిత బస్‌పాస్‌తో చదువుకు ఆటంకాల్లేవు
మాది పూర్తి గిరిజన ప్రాంతం పాడేరు వద్ద మారుమూల పల్లె. ప్రతిరోజూ పాడేరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే రానూపోను రూ.25 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం ఉచిత పాస్‌ ఇవ్వడంతో మాకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది.
– కె.లిఖిత, ఏడో తరగతి విద్యార్థిని, ములియపట్టు గ్రామం

ప్రతీరోజూ ఠంఛనుగా బస్సు
పాడేరు పరిధిలోని మా ఊరి నుంచి హుకుంపేట మండల కేంద్రంలో పాఠశాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు. ఆర్టీసీ బస్సు లేకపోతే నేను చదువు మానుకోవాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఠంఛనుగా ఆర్టీసీ బస్సు వస్తుండడంతో ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగిస్తున్నా.
– పొంగి సంతోష్‌కుమార్, 8వ తరగతి, జోగులాపుట్‌ గ్రామం

ఎలాంటి ఆటంకాల్లేకుండా నడుపుతున్నాం
బడి బస్సులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుపుతున్నాం. విద్యార్థులు చదువుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో మారుమూల గ్రామాలకు బస్సుల్ని పంపుతున్నాం. 
– బ్రహ్మానందరెడ్డి, ఈడీ (ఆపరేషన్స్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement