
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ పథకంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మ వద్దని, రైతులకు ఉచిత విద్యుత్‌పై శాశ్వత హక్కు కల్పించేందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గట్టి పునాది వేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవాలన్నది ముఖ్యమంత్రి జగన్ అభిమతమని, ఉచిత విద్యుత్ విషయంలో ఆయన వెనుకడుగు వేయరన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
► ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ నిర్ణయం పట్ల అందరూ సానుకూలంగా స్పందించి, స్వీకరించాలి. ఈ సంస్కరణలపై దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలను నమ్మకూడదు. ప్రజలు, మేధావులు అందరూ ఆలోచించాలి.
► రైతులకు శాశ్వతంగా ఒక నమ్మకమైన, నాణ్యమైన, గ్యారెంటీ టైంతో కూడిన ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు జీవో తెస్తే.. టీడీపీ, కొన్ని ఆర్కెస్ట్రా పార్టీలు రైతుల్లో అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నాయి. అందుకే ప్రజల ముందు వాస్తవాలను ఉంచుతున్నాం.
దమ్మున్న నాయకుడిగా జగన్ ముందడుగు
► ఇప్పటి వరకు విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పులబారిన పడి వేల కోట్ల రూపాయల బకాయిలు మోయలేక కునారిల్లుతున్నాయి. ఇదే సమయంలో కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా తీసుకొస్తున్న సవరణలు మనమీద పడే అవకాశం కనిపిస్తోంది. అందుకు తగిన విధంగా మనం సమాయత్తం కావాలనే ఉద్దేశంతో దమ్ము ఉన్న నాయకుడిగా జగన్ మేలి సంస్కరణల దిశగా ముందడుగు వేశారు.
► నిజానికి ఉచిత విద్యుత్ ఎవరో పోరాడి సాధించుకున్నది కాదు. అది దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేటెంట్. ఎడాపెడా కరెంట్ చార్జీలు పెంచి నిరసనగా రోడ్డెక్కిన వారి ప్రాణాలు తీసిన వ్యక్తి చంద్రబాబు.
► వైఎస్సార్ ఆలోచనలే పునాదిగా, విధానాలుగా వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకానికి భంగం కలుగనీయదు. చంద్రబాబు పేటెంట్లు ఏవైనా ఉంటే అవి బెల్ట్‌షాపులు, ఊరూరా మద్యం అమ్మించడం.
► వచ్చే 30, 35 ఏళ్లు ఇబ్బంది లేకుండా పది వేల మెగావాట్ల సోలార్ పవర్‌ను నిబద్ధతతో, తక్కువ ఖర్చుతో రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చంద్రబాబు ఉంచి పోయిన విద్యుత్ బకాయిలు రూ.8,000 కోట్లు కట్టాం.
► విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయినా, రమేష్ హాస్పిటల్‌లో 10 మంది చనిపోయినా మాట్లాడకుండా.. అవినీతి కేసులో అడ్డంగా దొరికిన అచ్చెన్నాయుడు, హత్య కేసులో ఉన్న కొల్లు రవీంద్రను పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు ప్రజలకు ఆలోచనా శక్తి లేదనుకుంటున్నారు.