సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత ఏజెంట్ మాదిరిగా వ్యవహరిస్తున్నారనే విషయం ఇప్పటికే తేటతెల్లం అయిందని, ఆయన వ్యవహరిస్తున్న తీరు, సుజనా చౌదరి లాంటి వారితో హోటళ్లలో జరిపిన సమావేశాలు చూస్తే వారి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో అర్థమవుతోందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలో ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొద్ది రోజుల్లో ముగియనున్న తరుణంలో ఎవరితోనూ సంప్రదించకుండా అర్ధంతరంగా వాయిదా వేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఇప్పుడు మళ్లీ హడావుడి చేస్తున్నారని చెప్పారు. ఓ రాజకీయ పార్టీగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే ప్రజలందరి క్షేమం, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
అదొక్కటే రాజ్యాంగ వ్యవస్థా?
‘రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎస్‌ఈసీ ఎన్నికలంటూ హడావుడి చేస్తున్నారు. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ అంటున్నారు. ఎన్నికల షెడ్యూలు వచ్చాక నిర్వహిస్తే బాగుండేది. ఇప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌తో ఏం పని? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచి తాను రాజ్యాంగబద్ధమైన వ్యవస్థనని చెప్పడం ఎంత వరకు సబబు? ప్రపంచంలో అదొక్కటే రాజ్యాంగ వ్యవస్థా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాదా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే అల్లాటప్పాగా బయట తిరిగే వ్యక్తి కాదు కదా! పాలనా యంత్రాంగానికంతా బాధ్యత వహిస్తారు కదా? అలాంటి వారు చెప్పిన అభిప్రాయాన్ని గౌరవించాల్సింది పోయి నిమ్మగడ్డ ఘర్షణ వాతావరణాన్ని కోరుకుంటున్నారు. గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పరిస్థితులు ఎప్పుడు కుదుట పడితే అప్పుడు ఎన్నికలకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పుడు నిమ్మగడ్డ కాదు కదా చంద్రబాబు ఎన్నికల కమిషన్‌లో ఉన్నా ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం.
అందరి క్షేమాన్ని కాంక్షిస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం టీచర్లు, పోలీసులు, ప్రజలందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ పరిస్థితులు కుదుటపడగానే వీలైనంత త్వరగా ఎన్నికలు జరిగి ప్రజాప్రతినిధులు బాధ్యతలు నిర్వర్తించాలని కోరుకుంటోంది. సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజాదరణ మరింత పెరిగింది. ప్రజా సంకల్పయాత్రను గుర్తు చేసుకుంటూ నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనటమే ఇందుకు నిదర్శనం.
ఎప్పుడు జరిగినా స్వీప్ చేస్తాం..
ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలకు ఎప్పుడైనా మేం సిద్ధమే. వచ్చే వారం జరిపినా రెడీనే. ఎప్పుడు జరిగినా 90 శాతం సీట్లను స్వీప్ చేస్తాం. ప్రజల్లో మా పార్టీకి తిరుగులేని ఆదరణ, అభిమానం ఉంది. ఎన్నికలంటే భయపడే వాళ్లమే అయితే వాయిదా వేసినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తాం? అయితే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది. అది అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. చంద్రబాబుకు ధైర్యముంటే ఎన్నికల ప్రక్రియ అర్ధంతరంగా ఆగిన చోట నుంచే పునఃప్రారంభించాలని కోరాలి.
ఎన్నికల కమిషనర్ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశానికి అసలు ప్రాధాన్యతే లేదు. తొలుత ప్రభుత్వంతో మాట్లాడి అభిప్రాయం తీసుకుని పార్టీల సమావేశాన్ని నిర్వహించలేదు. పోనీ అందరినీ కూర్చోబెట్టి అభిప్రాయాలు తీసుకున్నారా అంటే అదీ లేదు. నిమ్మగడ్డ ఉద్దేశాలు తెలుసు కాబట్టే మేం హాజరు కాలేదు. ఆయన టీడీపీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయని, ఏమాత్రం ప్రజల్లో బలం లేని పార్టీలను కూడా పిలిచి అభిప్రాయాలడిగారు. అందరూ కాపీ కొట్టినట్లుగా అభిప్రాయాలను చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment