సాక్షి, అమరావతి: గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమం మే లో ప్రారంభమవుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈలోపు సచివాలయాల పరిధిలో సమస్యలను, ప్రభుత్వ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయనే విషయాలు తెలుసుకుని ఉంటే బాగుంటుందన్నారు. గడపగడపకు కార్యక్రమం పునాది వలంటీర్ల సత్కారసభలోనే పడాలన్నారు. ప్లీనరీ తర్వాత పార్టీ కార్యక్రమాలు బాగా పెరుగుతాయని చెప్పారు. సచివాలయాల పరిధిలో సూక్ష్మస్థాయి పరిశీలన ద్వారా పార్టీ శ్రేణుల పనితీరు, అసంతృప్తులు, గ్యాప్ ఎక్కడ ఉంది, వాటిని ఏ విధంగా సరిదిద్దుకుని ముందుకెళ్లాలనే అంశాలపై పూర్తి అవగాహన రావచ్చన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, నగర మేయర్లతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల డెలివరీ మెకానిజం ఏ విధంగా జరుగుతోందో తెలుసుకునేందుకు వలంటీర్లకు పురస్కారాలు అందించి సత్కరించే కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, మునిసిపల్ చైర్మన్లతో సమన్వయం చేసుకుని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సచివాలయాల సంఖ్యను బట్టి ఈ కార్యక్రమాల షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులను కూడా సమాయత్తం చేసుకోవాలన్నారు. సీఎం జగన్ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా సిన్సియారిటీ, హానెస్టీ, ట్రాన్స్‌పరెన్సీ కోరుకుంటున్నారన్నారు.
ప్రజలకు అందే సేవల విషయంలో లోపాలుంటే సరిదిద్దుకోవచ్చన్నారు. వలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశాల ద్వారా లోపాలను గుర్తించి పరిష్కారాలు కనుగొనవచ్చని చెప్పారు. నియోజకవర్గాల్లో భవిష్యత్తు కార్యక్రమాలకు ఈ సమావేశాలు ఉపయోగపడతాయన్నారు. ఇక నుంచి ప్రతి కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు పొందినవారు, పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. అసంతృప్తులు ఉంటే వారిలో స్తబ్ధత తొలగించి అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలు తీసుకోవాలని చెప్పారు. వారికి ప్రేరణ కలిగించాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జీలదేనని పేర్కొన్నారు. బూత్ కమిటీలపై పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు 20 రోజుల్లో సమాచారం పంపాలని ఆయన కోరారు.
మే నెలలో గడపగడపకు ఎమ్మెల్యే
Published Thu, Apr 7 2022 3:46 AM | Last Updated on Thu, Apr 7 2022 8:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment