సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు దుస్తుల పంపిణీతో పాటు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏనాటికీ ఓటమి లేదని, అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీదే ఘన విజయం అని సజ్జల అన్నారు.
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..:
ఆదర్శంగా 12 ఏళ్ల ప్రస్థానం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజలతో మమేకం అవుతోంది. అందుకే ప్రజలంతా తమ హృదయాల్లో పార్టీని పదిలపర్చుకున్నారు. 12 ఏళ్లుగా సీఎం జగన్ పార్టీని అంత ఆదర్శంగా నడుపుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా పరిపాలిస్తున్నారు. సీఎం జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ అందుకు నిదర్శనం. తండ్రి బాటలో నడుస్తున్న వైఎస్ జగన్, ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారు.
బాధ్యత, నిబద్ధతతో పరిపాలన:
ప్రజలే లక్ష్యం. ప్రజలే గమ్యం. పేదల అభివృద్ధే ప్రధాన ఆశయం. సామాజిక సాధికారితే ఎజెండాగా సీఎం ముందుకు వెళ్తున్నారు. 75 ఏళ్లుగా నినాదాలకే పరిమితమైన అనేక అంశాలను ఆయన ఆచరణలోకి తీసుకొచ్చారు. అలాగే ఎన్నికల హామీల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తామని చెప్పి, అందులో చెప్పిన ప్రతి మాటను అమలు చేశారు. అలా సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోయారు. గత ఎన్నికల్లో 151 స్దానాల్లో గెలిపించిన ప్రజలు, తమపై అచంచల విశ్వాసాన్ని చూపితే.. దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, తాము సరైన పార్టీకి, సరైన నాయకుడుకి పాలనా పగ్గాలు అప్పగించామని ప్రజలు గర్వపడేలా సీఎం పని చేస్తున్నారు.
వినూత్న, విప్లవాత్మక నిర్ణయాలు:
పలు పథకాలు, కార్యక్రమాల ద్వారా అవినీతి రహితంగా.. మధ్యవర్తులు లేకుండా, దాదాపు రూ.2 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశారు. 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, గతంలో పేదలు, బడుగు, బలహీన వర్గాలకు దూరమైన విద్య, వైద్య రంగాలను వారికి చేరువ చేశారు. సచివాలయ వ్యవస్ధ ద్వారా ప్రజల ముంగిటనే పాలన అందిస్తున్నారు.
ఆ వ్యవస్థ ద్వారా 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా వివిధ శాఖల్లో మరో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఏ సమస్య అయినా సచివాలయం ద్వారా పరిష్కరించే పరిస్దితి తీసుకువచ్చారు. మరో అడుగు ముందుకేస్తూ.. ‘జగనన్నకు చెబుదాం’ మొదలు పెడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది అత్యంత సాహసోపేతమైనది. సీఎం ఆ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్నారు.
అది మామూలు విషయం కాదు:
నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం.. వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇస్తూ ఏకంగా చట్టం చేయడం నిజంగా ఒక గొప్ప నిర్ణయం. అది మామూలు విషయం కాదు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అలా చేయడానికి సాహసించ లేదు. అలాగే మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 70 శాతం పదవులు ఇవ్వడం దేశంలో ఎక్కడా జరగలేదు. అది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. ఇన్ని మంచి పనులతో సీఎం జగన్, వైస్సార్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్త గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేశారు. దీన్ని మేం గర్వంగా చెప్పుకోగలం.
పార్టీకి ఓటమి లేదు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, నేతలు.. ఎవరైనా సరే అందరూ కార్యకర్తలే. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎలా ఉండాలి.. ఎలా పరిపాలించాలి.. అనేది ఆదర్శవంతంగా చూపింది వైఎస్సార్‌సీపీ. అందుకే పార్టీకి ఓటమి లేదు. అది ఒక జీవ ప్రవాహంలా ముందుకు వెళ్తుంది. తమ ప్రచార శక్తులుగా ఉన్న పచ్చ మీడియా ద్వారా చంద్రబాబు వంటి వారు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజల్లో వేళ్ళూనుకున్న మా పార్టీని ఏ మాత్రం కదిలించ లేరు.
ముఖ్యంగా మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు, ఇతర శక్తులు ఎన్ని కుట్రలు పన్నాలో అన్నీ చేస్తాయి. మారీచులుగా పథకాలు పన్నుతాయి. మనం అన్నింటినీ ఎదుర్కోగలం. ఎందుకంటే ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పార్టీ ముందుకు వెళ్తోంది. అందుకే విజయం మనల్నే వరిస్తుంది. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి మారీచుల కుట్రలు ఎదుర్కోవాలి.
నమ్మకం–విశ్వాసం పార్టీ ప్రధానాంశాలు: లేళ్ల అప్పిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెడుతోంది. మహానేత వైఎస్సార్ హఠాన్మరణాన్ని ఎవరూ ఊహించ లేదు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రజలు కోరుకున్న విధంగా జగన్‌గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించారు. నమ్మకం, విశ్వాసం ప్రధాన అంశాలుగా పార్టీ ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల్లో 151 సీట్లతో అఖండ విజయం సాధించిన పార్టీ, వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు గెల్చుకుంటుంది.
మంత్రుల మేరుగ నాగార్జున, జోగి రమేష్, మండలి ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి, ప్రభుత్వ సలహాదారులు ఎస్‌ఎం జియాఉధ్దీన్, నారమల్లి పద్మజ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, గ్రంధాలయ పరిషత్ రాష్ట్ర ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ వరప్రసాదరెడ్డి, పండుగాయల రత్నాకర్, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తితో పాటు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరక్టర్లు, పార్టీ నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
చదవండి: మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి.. సీఎం జగన్ ట్వీట్
Comments
Please login to add a commentAdd a comment