మధురిమలు పంచుకోండి.. మధురంగా.. | Sakshi Special Story On Valentines Day | Sakshi
Sakshi News home page

మధురిమలు పంచుకోండి.. మధురంగా..

Published Mon, Feb 13 2023 3:59 AM | Last Updated on Mon, Feb 13 2023 3:59 AM

Sakshi Special Story On Valentines Day

ఒక గులాబీ.. ఒక చాక్లెట్‌.. ఒక గ్రీటింగ్‌ కార్డ్‌.. ఒక కేక్‌.. ఒక గిఫ్ట్‌.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. 

నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్‌ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది.  

సాక్షి, పశ్చిమగోదావరి డెస్క్‌: ప్రేమ అనేది ఓ మధుర భావన. ఇది మనసులను కలుపుతుంది.. మనుషులను దగ్గర చేస్తుంది. ప్రేమతో జీవించడం.. జీవితంలోని మాధుర్యాన్ని మన దరి చేరుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారైనా.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటున్నవారైనా.. అంతిమంగా తమ భాగస్వామిపై చూపే ప్రేమే వారి జీవిత గమనాన్ని మధురంగా మారుస్తుంది. మరి ఇలాంటి జంటలు ఈ ఏడాది ప్రేమికుల రోజును ఎలా జరుపుకోవాలనే దానిపై ఆలోచిస్తుంటే.. వారికి నెటిజన్లు అనేక సూచనలు అందిస్తున్నారు.

వాటిలో కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కాగా.. మరికొన్ని తక్కువ వ్యయంతో ప్లాన్‌ చేసుకోదగినవి. అసలు ఖర్చే అవసరం లేనివి కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో తమకు ఉత్తమంగా అనుకున్నవి.. సాధ్యమయ్యేవి ప్లాన్‌ చేసుకుని సెలబ్రేట్‌ చేసుకుంటే.. ఆ మాధుర్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని కూడా చెబుతున్నారు. ఇవి నెట్టింట చాలా ఎక్కువమందిని ఆకట్టుకుంటుండటం విశేషం. అవేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. అయితే.. ఇవి మీకోసమే.. 

► మీకు ఇష్టమైన పాటలను కలిసి ఎంచుకోండి. మీ సంబంధాన్ని గుర్తుచేసే, మీ భాగస్వామికి ఎక్కువగా ఇష్టమైన పాటలకు అందులో ప్రాధాన్యత ఇవ్వండి. వాటిని మీ ప్లే లిస్ట్‌లో ఉంచేందుకు సమయం కేటాయించండి. 

► ఇద్దరూ కలిసి ఒకరోజు గడపడంలో ఉత్తమ­మైన మార్గాల్లో మరొకటి.. స్వచ్ఛంద సేవ. ఇతరులకు స్వయంగా సేవ చేయడం మీరు ఒకరికొకరు మరింత కనెక్ట్‌ అయ్యేలా చేస్తుంది.

► మీ సొంత ప్రాంతంలో పర్యాటకులుగా మారండి. మీ పట్టణంలో ఏదైనా ప్రసిద్ధమైన ప్రాంతాన్ని లేదా మీరు ఎప్పుడూ చూడని మ్యూజియాన్ని సందర్శించండి. ఫొటోగ్రాఫర్లుగా మారి నచ్చిన విధంగా ఫొటోలు తీయండి.

► మీ ఇద్దరి తీపి గుర్తులను కలిపి ఒక విలువైన పుస్తకంగా రూపొందించండి. లవ్‌ లెటర్లు, దుస్తులు, చేతి రుమాళ్లు, బహుమతులు, ఫొటోలు, పాత సినిమా టికెట్లు, గుర్తుగా దాచుకున్నవాటిని సేకరించి దీనిని తయారుచేయండి. 

► డ్రైవ్‌ కోసం వెళ్లండి.. కారు లేదా బైక్‌ ఫుల్‌ ట్యాంకు చేయించండి. ఇది కొంత ఖర్చుతో కూడు­కున్నది కావచ్చు. అయినా ఇది మీరు వెళ్లే కొత్త ప్రాంతంలో సరికొత్త అనుభూతులను కలిసి ఆస్వాదించేందుకు ఉపకరిస్తుంది. 

► ఇద్దరూ కలిసి మీ ప్రేమకు సింబాలిక్‌గా ఉండేలా గోడకు తగిలించే లేదా వేలాడదీసే ఒక ఆహ్లాదకరమైన కళాత్మక వస్తువును రూపొందించండి. దానిని మీరు నిత్యం సంచరించే ప్రాంతంలో ఏర్పాటు చేయండి. 

► ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకోండి. ఇంతకుముందే రాసిన అనుభూతులు ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా ప్రయత్నించండి. మీ భాగస్వామి మీకు ఎందుకు ప్రత్యేకమైన వారో అందులో పొందుపరచండి. మీ భాగస్వామిలోని ఏ లక్షణాలను మీరు ఎక్కువగా ఆరాధిస్తారో, వారు మిమ్మల్ని ఎలా భావిస్తారో, మీరు వారితో ఎందుకు ప్రేమలో పడ్డారో ఆ లేఖలో తెలియజేయండి.

► ఇద్దరికీ ఇష్టమైన రొమాంటిక్‌ సినిమాలు చూడండి. పాప్‌కార్న్‌ వంటి స్టఫ్‌ కూడా అందుబాటులో పెట్టుకోండి. 

► ఇద్దరూ కలిసి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చు­కో­వడా­నికి ప్రయత్నించండి. అది వంటకం కావ­చ్చు.. డ్యాన్స్‌ కావచ్చు.. మరేదైనా కావచ్చు. 

► కలిసి యోగా లేదా వ్యాయామం సాధన చేయండి. ఆ సమయాన్ని ఆస్వాదించండి. 

► ట్రెజర్‌ హంట్‌ (నిధి వేట) లాంటి ఆసక్తికరమైన ఆట ఎంచుకోండి. మీ భాగస్వామికి ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రేమికుల రోజు బహుమతిని దాచి ఉంచండి. దానిని కనుగొనడానికి ఆధారాలు రూపొందించి దానిని కనిపెట్టాలని సూచించండి. 

► ప్రేమకు సూచిక అయిన హార్ట్‌ సింబల్‌లో ఆహారాన్ని కలిసి తయారు చేయండి. చపాతీ, పిజ్జా, ఆమ్లెట్, కేక్‌.. ఇలా మీ ఊహ మేరకు ప్రయత్నించండి. లేదంటే హార్ట్‌ సింబల్‌ ఆకారంలో కేక్‌కి ఆర్డర్‌ ఇవ్వండి. 

► ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లండి. ఒకరి కోసం ఇంకొకరు ఇష్టమైన వస్తువును కొనడానికి ప్రయత్నించండి. 

► ఇద్దరూ కలిసి పెయింట్‌ చేయండి. మీరు పెయింటర్లు కాకపోవచ్చు.. అయినా ఇద్దరూ కలిసి ఒక సొంత కళాఖండం రూపొందించడానికి ప్రయత్నించండి. అది తప్పనిసరిగా సరికొత్త అనుభూతులను పంచుతుంది. 

► ఇద్దరూ కలిసి అందమైన పూలతోటను సందర్శించడానికి ప్రయత్నించండి. కనీసం మీకు సమీపంలోని నర్సరీకి వెళ్లి ప్రేమికుల రోజుకు గుర్తుగా ఒక మొక్క కొనుగోలు చేయండి. అద్భుతమైన ఫొటోలూ తీసుకోండి. 

► రాత్రి భోజనం కలిసి వండండి. ఒక సూపర్‌ బిజీ రెస్టారెంట్‌లో తినడానికి బయటకు వెళ్లడం కంటే ప్రత్యేకంగా ఇంట్లో వండిన భోజనం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. మీలో ఒకరికి చెఫ్‌కి సమానమైన నైపుణ్యాలు లేకపోయినా, మీరు ఇద్దరూ ఆనందించే చిరస్మరణీయమైన విందును చేయవచ్చు. 

► ఒక గులాబీ.. ఒక చాక్లెట్‌.. ఒక గ్రీటింగ్‌ కార్డ్‌.. ఒక కేక్‌.. ఒక గిఫ్ట్‌.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. 

► నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్‌ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement