greeting card
-
మధురిమలు పంచుకోండి.. మధురంగా..
ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. సాక్షి, పశ్చిమగోదావరి డెస్క్: ప్రేమ అనేది ఓ మధుర భావన. ఇది మనసులను కలుపుతుంది.. మనుషులను దగ్గర చేస్తుంది. ప్రేమతో జీవించడం.. జీవితంలోని మాధుర్యాన్ని మన దరి చేరుస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారైనా.. పెళ్లి తర్వాత ప్రేమించుకుంటున్నవారైనా.. అంతిమంగా తమ భాగస్వామిపై చూపే ప్రేమే వారి జీవిత గమనాన్ని మధురంగా మారుస్తుంది. మరి ఇలాంటి జంటలు ఈ ఏడాది ప్రేమికుల రోజును ఎలా జరుపుకోవాలనే దానిపై ఆలోచిస్తుంటే.. వారికి నెటిజన్లు అనేక సూచనలు అందిస్తున్నారు. వాటిలో కొన్ని ఖర్చుతో కూడుకున్నవి కాగా.. మరికొన్ని తక్కువ వ్యయంతో ప్లాన్ చేసుకోదగినవి. అసలు ఖర్చే అవసరం లేనివి కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో తమకు ఉత్తమంగా అనుకున్నవి.. సాధ్యమయ్యేవి ప్లాన్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటే.. ఆ మాధుర్యాన్ని ఎప్పటికీ మరిచిపోలేరని కూడా చెబుతున్నారు. ఇవి నెట్టింట చాలా ఎక్కువమందిని ఆకట్టుకుంటుండటం విశేషం. అవేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. అయితే.. ఇవి మీకోసమే.. ► మీకు ఇష్టమైన పాటలను కలిసి ఎంచుకోండి. మీ సంబంధాన్ని గుర్తుచేసే, మీ భాగస్వామికి ఎక్కువగా ఇష్టమైన పాటలకు అందులో ప్రాధాన్యత ఇవ్వండి. వాటిని మీ ప్లే లిస్ట్‌లో ఉంచేందుకు సమయం కేటాయించండి. ► ఇద్దరూ కలిసి ఒకరోజు గడపడంలో ఉత్తమమైన మార్గాల్లో మరొకటి.. స్వచ్ఛంద సేవ. ఇతరులకు స్వయంగా సేవ చేయడం మీరు ఒకరికొకరు మరింత కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ► మీ సొంత ప్రాంతంలో పర్యాటకులుగా మారండి. మీ పట్టణంలో ఏదైనా ప్రసిద్ధమైన ప్రాంతాన్ని లేదా మీరు ఎప్పుడూ చూడని మ్యూజియాన్ని సందర్శించండి. ఫొటోగ్రాఫర్లుగా మారి నచ్చిన విధంగా ఫొటోలు తీయండి. ► మీ ఇద్దరి తీపి గుర్తులను కలిపి ఒక విలువైన పుస్తకంగా రూపొందించండి. లవ్ లెటర్లు, దుస్తులు, చేతి రుమాళ్లు, బహుమతులు, ఫొటోలు, పాత సినిమా టికెట్లు, గుర్తుగా దాచుకున్నవాటిని సేకరించి దీనిని తయారుచేయండి. ► డ్రైవ్ కోసం వెళ్లండి.. కారు లేదా బైక్ ఫుల్ ట్యాంకు చేయించండి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది కావచ్చు. అయినా ఇది మీరు వెళ్లే కొత్త ప్రాంతంలో సరికొత్త అనుభూతులను కలిసి ఆస్వాదించేందుకు ఉపకరిస్తుంది. ► ఇద్దరూ కలిసి మీ ప్రేమకు సింబాలిక్‌గా ఉండేలా గోడకు తగిలించే లేదా వేలాడదీసే ఒక ఆహ్లాదకరమైన కళాత్మక వస్తువును రూపొందించండి. దానిని మీరు నిత్యం సంచరించే ప్రాంతంలో ఏర్పాటు చేయండి. ► ఒకరికొకరు ప్రేమలేఖలు రాసుకోండి. ఇంతకుముందే రాసిన అనుభూతులు ఉన్నప్పటికీ.. ఇప్పుడు కొత్తగా ప్రయత్నించండి. మీ భాగస్వామి మీకు ఎందుకు ప్రత్యేకమైన వారో అందులో పొందుపరచండి. మీ భాగస్వామిలోని ఏ లక్షణాలను మీరు ఎక్కువగా ఆరాధిస్తారో, వారు మిమ్మల్ని ఎలా భావిస్తారో, మీరు వారితో ఎందుకు ప్రేమలో పడ్డారో ఆ లేఖలో తెలియజేయండి. ► ఇద్దరికీ ఇష్టమైన రొమాంటిక్ సినిమాలు చూడండి. పాప్‌కార్న్ వంటి స్టఫ్ కూడా అందుబాటులో పెట్టుకోండి. ► ఇద్దరూ కలిసి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అది వంటకం కావచ్చు.. డ్యాన్స్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ► కలిసి యోగా లేదా వ్యాయామం సాధన చేయండి. ఆ సమయాన్ని ఆస్వాదించండి. ► ట్రెజర్ హంట్ (నిధి వేట) లాంటి ఆసక్తికరమైన ఆట ఎంచుకోండి. మీ భాగస్వామికి ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రేమికుల రోజు బహుమతిని దాచి ఉంచండి. దానిని కనుగొనడానికి ఆధారాలు రూపొందించి దానిని కనిపెట్టాలని సూచించండి. ► ప్రేమకు సూచిక అయిన హార్ట్ సింబల్లో ఆహారాన్ని కలిసి తయారు చేయండి. చపాతీ, పిజ్జా, ఆమ్లెట్, కేక్.. ఇలా మీ ఊహ మేరకు ప్రయత్నించండి. లేదంటే హార్ట్ సింబల్ ఆకారంలో కేక్‌కి ఆర్డర్ ఇవ్వండి. ► ఇద్దరూ కలిసి షాపింగ్‌కు వెళ్లండి. ఒకరి కోసం ఇంకొకరు ఇష్టమైన వస్తువును కొనడానికి ప్రయత్నించండి. ► ఇద్దరూ కలిసి పెయింట్ చేయండి. మీరు పెయింటర్లు కాకపోవచ్చు.. అయినా ఇద్దరూ కలిసి ఒక సొంత కళాఖండం రూపొందించడానికి ప్రయత్నించండి. అది తప్పనిసరిగా సరికొత్త అనుభూతులను పంచుతుంది. ► ఇద్దరూ కలిసి అందమైన పూలతోటను సందర్శించడానికి ప్రయత్నించండి. కనీసం మీకు సమీపంలోని నర్సరీకి వెళ్లి ప్రేమికుల రోజుకు గుర్తుగా ఒక మొక్క కొనుగోలు చేయండి. అద్భుతమైన ఫొటోలూ తీసుకోండి. ► రాత్రి భోజనం కలిసి వండండి. ఒక సూపర్ బిజీ రెస్టారెంట్లో తినడానికి బయటకు వెళ్లడం కంటే ప్రత్యేకంగా ఇంట్లో వండిన భోజనం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. మీలో ఒకరికి చెఫ్‌కి సమానమైన నైపుణ్యాలు లేకపోయినా, మీరు ఇద్దరూ ఆనందించే చిరస్మరణీయమైన విందును చేయవచ్చు. ► ఒక గులాబీ.. ఒక చాక్లెట్.. ఒక గ్రీటింగ్ కార్డ్.. ఒక కేక్.. ఒక గిఫ్ట్.. ప్రేమికుల రోజును ఇలాంటి వాటితో ఆరంభించండి.. మీకు ప్రియమైన వారిపై మీకున్న ప్రేమను తెలియజేయండి. రోజూ చూపే ప్రేమను ఇది ఎన్నో రెట్లు ఎక్కువగా చేస్తుంది. ఈ అనుభూతి మరింత మధురానుభూతులను మీ జీవితంలో నింపుతుంది. ► నచ్చిన ఆట.. కలిసి ఆడండి. ఉదాహరణకు చెస్, క్యారమ్స్ వగైరా.. ఏదైనా.. ఆ ఆట ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది. -
చిన్న క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు
లండన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న క్రిస్మస్ గ్రీటింగ్ కార్డుని బ్రిటన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. 15్ఠ20 మైక్రో మీటర్ల వైశాల్యం గల ఈ కార్డుని శక్తిమంతమైన మైక్రోస్కోపు ద్వారానే చూడొచ్చు. ఒక్క పోస్టేజీ స్టాంపుపై 200 మిలియన్ గ్రీటింగ్‌కార్డులు పడతాయి. నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ వినూత్న గ్రీటింగ్‌కార్డుని రూపొందించారు. ప్లాటినం పూతగల సిలికాన్ నైట్రెడ్తో ఈ కార్డును తయారు చేశామని శాస్త్రవేత్తల్లో ఒకరైన కెన్ మిన్గార్డు తెలిపారు. ఈ కార్డు కొత్త పరికరాల రూపకల్పనలో ఉపయోగపడుతుందన్నారు. ఇంతకుముందు రికార్డుల్లో ఉన్న దాని కంటే ఈ గ్రీటింగ్ కార్డు పది రెట్లు చిన్నదని వెల్లడించారు. -
గ్రీటింగ్ కార్డుకు గ్రీటింగ్స్ లేవు!
కాగితాలు రెక్కలై ఎగిరిన గ్రీటింగ్ కార్డు అరుదైన ప్రాణిగా మారింది. క్రమక్రమంగా అంతరించి పోతోంది. సోషల్ మీడియా కాలుష్యానికి ఆ స్పర్శ నిండిన పలకరింపు మూగబోతోంది. న్యూ ఇయర్ వస్తుంటే కొంత డబ్బు మూట గట్టుకోవాలి. మరికొంత డబ్బు దాచి పెట్టుకోవాలి. చివరి వారంలో బజారుకు వెళ్లి ఇష్టమైనవాళ్ల కోసం గ్రీటింగ్స్ కొని తెచ్చుకోవాలి. బంధువులకు, స్నేహితులకు, ప్రియమైన వాళ్లకు, ప్రేమిస్తున్నవాళ్లకు. ఆ తర్వాత వాటికి కవర్లు కొనడం, స్టాంపులు అంటించడం, పోస్టాఫీసుకు వెళ్లి ఆల్రెడీ నిండిపోయిన పెట్టెల్లోకి కూరి కూరి లోపలికి నెట్టడం... మనం పంపిన కార్డు చేరి జవాబు వచ్చేదాకా ఒక ఎదురుచూపు మనకు వచ్చే కార్డుల కోసం గడప దగ్గర నిలబడి నిరీక్షణ... ఈ రోజులన్నీ పోయాయి. ఇప్పుడు గ్రీటింగులు ఉన్నాయి. కార్డులు లేవు. ఒక ఎస్ఎంఎస్... ఒక వాట్సప్ మెసేజ్... లేదంటే ఈ మెయిల్... కాదంటే ఫోన్ కాల్... కాని అందులో స్పర్శ లేదు. రెండు మడతల ప్రింటెడ్ కార్డ్ కొని, ఆ కార్డ్ మీద మనకు ఇష్టమైన మన టేస్ట్‌కు తగిన గులాబీల బొమ్మో, ప్రకృతిని చీల్చినట్టు ఉండే ఒక దారి బొమ్మో, బోసి నవ్వుల పాపాయి బొమ్మో, టెడ్డీ బేర్ బొమ్మో ఉన్నది కొని లోపల మనకిష్టమైన క్యాప్షన్ ఉండేలా చూసుకొని లేదా కొత్త రెడ్ స్కెచ్‌తో క్యాప్షన్ రాసి పైన అందుకోవాల్సిన వారి పేరు కింద మన సంతకం... సొంత దస్తూరిలో ఉంటే అది తాకే స్పర్శ ఈ వర్చువల్ గ్రీటింగ్స్‌లో ఉంటుందా? ఈ ఆనందాలు ఇప్పటి కుర్రాళ్లకు తెలీవు. ప్రేమను బట్టి సైజు... ఇరవై ముప్పై ఏళ్ల కిందట ఇయర్ వస్తే గ్రీటింగ్ కార్డులదే. అవి అమ్మడానికే కొన్ని షాపులు ప్రత్యేకంగా ఉండేవి. స్తోమతను బట్టి కార్డు సైజులు కూడా ఉండేవి. పోస్ట్‌కార్డ్ లాంటి గ్రీటింగ్ కార్డులకు గౌరవం తక్కువ. ఫోల్డెడ్ కార్డ్స్కే గిరాకీ ఎక్కువ. వాటిలో కూడా రకరకాల సైజులు. జేబులో పట్టే సైజు, అర చెయ్యంత సైజు, జానెడు సైజు... ఇంకా పెద్దది కావాలంటే మూరంత సైజు కూడా ఉండేవి. కొత్తగా ప్రేమలో పడినవాళ్లు వీటిని కొనేవాళ్లు. న్యూ ఇయర్ రోజు తల స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని గుడి కెళ్లినంత భక్తిగా ఇవి ఇవ్వడానికి తమ గర్ల్‌ఫ్రెండ్/ బాయ్‌ఫ్రెండ్స్‌ను వెతుక్కుంటూ వెళ్లేవాళ్లు. నలుగురి కంట పడకుండా సంకేత ప్రదేశాల్లో ఈ గ్రీటింగులు మార్చుకోవడం ఆ వెర్రిబాగుల రోజుల్లో పెద్ద అడ్వంచర్. ఆ దక్కిన కార్డును క్లోజ్ ఫ్రెండ్స్‌కు చూపించుకోవడం పెద్ద ఘరానా. కొందరు గత సంవత్సరం తమకు పంపినవారికి మాత్రమే పంపేవారు. మరికొందరు ఈ సంవత్సరమే తమ ఖాతాను ఓపెన్ చేసేవారు. ‘చేరదు, పోస్ట్ ఆఫీస్‌లో ఎవరైనా నొక్కేస్తారు’ అనే భయం ఉన్నవారు పట్టుబట్టి రిజిస్టర్డ్ పోస్ట్ చేసి ఆ రసీదును జాగ్రత్తగా దాచుకునేవారు. అది అందేసరికి ఫిబ్రవరి వచ్చేది. అయినా సరే ఆనందం దక్కేది. కొందరు పొదుపు సంఘాల వాళ్లు తెలివిగా ఒకే కార్డులో న్యూ ఇయర్‌కూ పొంగల్‌కు కలిపి గ్రీటింగ్స్ చెప్పేవారు. మరికొందరు క్రిస్మస్ను, న్యూ ఇయర్‌ను సంక్రాంతి దాకా పొడిగించేవారు. పోస్ట్ అని పోస్ట్ మేన్ వచ్చి గుప్పెడు గ్రీటింగ్ కార్డ్స్ గుమ్మం ముందు పడేసి పోతే ఆ వీధిలో ఆ ఇంటికి ఎంతో మర్యాద. వాటిని అందుకున్నవారికి ఎంతో గౌరవం. కొందరు అదృష్ట వంతులకు అమెరికా నుంచి కార్డులు అందేవి. ఆ సంగతి ఒక నెలపాటు ఊరంతా మళ్లీ మళ్లీ తెలిసేది. ఇప్పుడన్నీ గాలి శుభాకాంక్షలు... వాయు సందేశాలు.... అవి గుండెల్లో నిలవవు. పేద ఆనందాలు... అయితే ఆ రోజుల్లో అందరి దగ్గరా డబ్బులు ఉండేవి కాదు. ప్రేమ మాత్రం హృదయం నిండుగా ఉండేది. తమ ఆత్మీయతను వ్యక్తం చేయడానికి వీరంతా కళాకారులుగా మారేవారు. బజారుకు వెళ్లి నాలుగు రంగుల నాలుగు చార్టులు కొని వాటిని గ్రీటింగ్ కార్డుల సైజ్‌లో కట్ చేసి బొమ్మలు గీసేవారు. పూసలు అంటించేవారు. తాటాకులనూ నెమలి పింఛాలను పక్షుల ఈకలను.. వీటన్నింటితో అద్భుతమైన కళాఖండాలు తయారు చేసేవారు. బజారులో దొరికేవాటికన్నా ఇవే బాగుండేవి. ఇవి అందుకున్నవారికి సంతృప్తిని, కనుల వెంట తడి చెమ్మని ప్రసాదించేవి. కొందరు వీటిని టేబుళ్ల మీద డిస్ప్లే చేసుకునేవారు. మరికొందరు తీగలు కట్టి వేలాడదీస్తే శుభకరం అని భావించేవారు. నిరుడు కురిసిన హిమసమూహములు... ఇప్పటి కాలంలో వీధుల్లో గంగిరెద్దులైనా అరుదుగా కనిపిస్తున్నాయి కానీ, సీజనల్ గ్రీటింగ్ కార్డుల దుకాణాలు మాత్రం బొత్తిగా కనిపించడం లేదు. ‘పిడికిట్లోకి ప్రపంచం’ వచ్చిపడ్డాక ఇంటర్నెట్ ఇంటింటికీ విస్తరించడం మొదలయ్యాక మనుషులకు పోస్టాఫీసులతో అనుబంధం తెగిపోయింది. మొబైల్ ఫోన్లు దోమలను మించి వ్యాపించాక టెలిగ్రామ్ ఊపిరే ఆగిపోయింది. స్మార్ట్ఫోన్లు చేతుల్లోకి వచ్చాక ఒక క్లిక్కుతో వంద కార్డులు... కార్డు సేమ్... నేమ్స్ చేంజ్డ్... అన్నీ ఉత్తుత్తి కార్డులే... అంటరానివి కాదు గానీ, అంటలేని కార్డులు. వర్చువల్ ప్రపంచంలో ప్రేమాభిమానాలూ వర్చువలే! కాని ఏం చేయగలం... వచ్చు కాలమే మేలు గడిచిన కాలం కంటే అని అనుకోవడం తప్ప. సోషల్ మీడియా దెబ్బ ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్లకు పడగలెత్తిన గ్రీటింగ్‌కార్డుల వ్యాపారం ఇంటర్నెట్ తాకిడికి కుదేలైంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఈ వ్యాపారాన్ని చావుదెబ్బ తీసింది. అమెరికాలో 2008-10 మధ్య కాలంలోనే గ్రీటింగ్ కార్డుల వ్యాపారం ఏకంగా 25 శాతం మేరకు పతనమైంది. ఈ పరిణామం ఫలితంగా గ్రీటింగ్‌కార్డుల వ్యాపారంలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా వెలిగిన హాల్‌మార్క్ కంపెనీ అమ్మకాల్లో ఏటా దాదాపు 600 కోట్ల డాలర్ల తగ్గుదల నమోదవుతోంది. అమ్మకాలను పెంచుకునే మార్గాలు కనుచూపు మేరలో కనిపించని పరిస్థితుల్లో హాల్‌మార్క్ కంపెనీ గత ఏడాది మూడువందల మంది ఉద్యోగులను తొలగించింది. గ్రీటింగ్ కార్డుల పరిశ్రమలో నంబర్ వన్‌గా పేరుపొందిన హాల్‌మార్క్ కంపెనీ పరిస్థితే ఇలా ఉంటే ప్రపంచంలో మిగిలిన కంపెనీల పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఆరు శతాబ్దాల చరిత్ర గ్రీటింగ్ కార్డుల చరిత్ర ఆరు శతాబ్దాల నాటిది. పదిహేనో శతాబ్ది తొలినాళ్లలో ఈజిప్షియన్లు పాపిరస్ మీద రంగు రంగుల బొమ్మలు వేసి, చూడచక్కని దస్తూరీతో సందేశాలు రాసి వాటిని చుట్టగా చుట్టి గ్రీటింగులు పంపేవారు. జర్మన్లు కలప ఫలకాలను చెక్కి గ్రీటింగ్ కార్డులను ముద్రించేవారు. యూరోప్‌లోని దాదాపు పంతొమ్మిదో శతాబ్ది ప్రథమార్ధం వరకు ఎక్కువగా చేతితో రూపొందించిన గ్రీటింగ్‌కార్డులను పంపుకొనేవారు. వీటి బట్వాడా కోసం అప్పట్లో తపాలా రాయితీలూ ఉండేవి. మార్కస్ వార్డ్ అండ్ కో, గుడాల్ అండ్ చార్లెస్ బెన్నెట్ వంటి కంపెనీలు 1860ల నాటికి ముద్రణా యంత్రాలను సమకూర్చుకొని భారీ ఎత్తున గ్రీటింగ్ కార్డుల తయారీని ప్రారంభించాయి. గ్రీటింగ్ కార్డుల రూపకల్పన కోసం ఈ కంపెనీలు పేరొందిన చిత్రకారులకు ఉద్యోగాలు ఇచ్చాయి. కలర్ లిథోగ్రఫీ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక 1930ల నాటి నుంచి గ్రీటింగ్ కార్డుల ముద్రణలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ముద్రణ రంగంలోకి కంప్యూటర్లు వచ్చిన కొన్నేళ్ల వరకు కూడా గ్రీటింగ్ కార్డుల పరిశ్రమ ఢోకా లేకుండానే సాగింది. -
క్షణాల్లో సందేశం.. ‘ఆన్లైన్’ సంతోషం
కొత్త సంవత్సరం వస్తుందొంటే అదో హడావుడి. చిన్నపిల్లలైతే దేవుళ్లు, సినీనటుల ఫొటోలు, పూలు ఉండే గ్రీటింగ్‌ల కోసం వెతికేవారు. యువతరం పూలు, ప్రకృతి, ప్రేమచిహ్నాలు, స్నేహానికి నిర్వచనం చెప్పే వాక్యాలుండే గ్రీటింగ్‌కార్డుల కోసం గాలించేవారు. మధ్యవయస్సువారు, పెద్దలు వారి స్థాయిలో గౌరవంగా శుభాకాంక్షలు చెప్పుకునే విధంగా ఉండే కార్డుల కోసం అన్ని దుకాణాలు తిరిగేవారు. రెండువారాల ముందే గ్రీటింగ్‌కార్డులు కొని పోస్టు ద్వారా కుటుంబసభ్యులు, స్నేహితులు, బందువులకు పంపేవారు. అవి కొందరికి ఒకటో తేదీకి అటు ఇటుగా చేరితే మరికొందరికి జనవరి మొదటి వారంలో చేతికందేవి. వాటిని చూడగానే కళ్లు విప్పారేవి. కార్డులోని ప్రతి అక్షరాన్ని చదువుతూ సంతోషంతో ఆనందబాష్పాలు రాలేవి. ఇదంతా 15 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడంతా ఆన్లైనే. శుభాకాంక్షలు చెప్పేందుకు అరచేతిలో వైకుంఠాలు ఉన్నాయి. ఒక బటన్ నొక్కితే చాలు పదుల సంఖ్యలో ఎస్ఎంఎస్లు సన్నిహితులకు వెళ్లే సదుపాయం నేడు వచ్చింది. ఇందుకు పలు సామాజిక వెబ్సైట్లు రకరకాల ఫీచర్లతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. అక్షరాల్లోనే గాక ఫొటోలు, చిత్రాల ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేందుకు నేటి తరం రంగం సిద్ధం చేసుకుంటోంది. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే సెల్ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్లు పని ప్రారంభం కానుంది. సమాజంలో నేడు 50 శాతం మందికి పైగా సెల్ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్లు సాధారణ సెల్ఫోన్లతో పాటు స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. అధిక శాతం యువత స్మార్ట్ఫోన్లపై మక్కువ పెంచుకుంటోంది. ఈ దశలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సెల్ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్లు పంపించేందుకు రెడీ అవుతున్నారు. స్మార్ట్ఫోన్లలోని వాట్స్ఆప్, లైన్ తదితర యాప్‌లతో పాటు గూగుల్, యాహూ, జీ మెయిల్, రెడిఫ్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక వెబ్సైట్లను ఉపయోగించుకుని ఇంటర్నెట్ ద్వారా గ్రీటింగ్‌లు పంపించేందుకు యువత సమాయత్తమవుతోంది. కంప్యూటర్, ట్యాబ్లెట్పీసీలు, ల్యాప్‌టాప్‌ల ద్వారా సామాజిక వెబ్సైట్లు, ఈ మెయిల్స్ ద్వారా శుభ సందేశాలను పంపించనున్నారు. గతంలో శుభాకాంక్షలు పంపించేందుకు వారాలు పట్టే కాలం నేడు ఖండాంతరాలు దాటైనా క్షణాల్లో చేరిపోతోంది. - న్యూస్‌లైన్, కర్నూలు(విద్య) గ్రీటింగ్‌కార్డులు మనసును తాకుతాయి -ఎండి గౌస్, యోగాశిక్షకులు ఒకప్పుడు గ్రీటింగ్‌కార్డుల కోసం ప్రజలు వెంపర్లాడేవారు. వారి అభిరుచికి తగ్గట్లు కార్డులు కొని ఆప్తులకు పంపేవారు. చేతితో రాసిన సందేశాలు మనసుకు తాకుతాయి. స్మార్ట్ఫోన్లు, ఆండ్రాయిడ్ఫోన్లు ఎన్ని వచ్చినా గ్రీటింగ్కార్డులకు ఉన్న విలువ వేరు. ఆధునిక టెక్నాలజీతో క్షణాల్లో సందేశం -డాక్టర్ పి. సునీల్‌కుమార్‌రెడ్డి, దంత వైద్యనిపుణులు గతంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలంటే వారాల సమయం పట్టేది. ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు క్షణాల్లో ఎవరికైనా, ఎక్కడి వారికైనా విషెష్ చెప్పొచ్చు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా విదేశాల్లో ఉన్న వారికి క్షణాల్లో శుభసందేశాలు పంపించే అవకాశం ఉంది. ఇంటర్నెట్ వినియోగం పెరిగింది -భూమా కిశోర్, అఖిల్ కంప్యూటర్స్ ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. అధిక శాతం విద్యావంతులు మొబైల్ఫోన్లు, ఇంటర్నెట్ వాడుతున్నారు. న్యూ ఇయర్‌కు తక్కువ సమయంలో ఎక్కువ యాక్సెసబులిటి ఉంటుంది. క్షణాల్లో సందేశం వెళ్తుంది. గ్రీటింగ్స్ వెబ్సైట్లు : www.123greetings.com, www.supertop100.com, www.snowleopard.org, ఎస్ఎంఎస్ల వెబ్సైట్లు : www.newyearsms.in, www.onlysms.net, www.mobileheart.com