క్షణాల్లో సందేశం.. ‘ఆన్‌లైన్’ సంతోషం | Message in seconds .. 'Online' joy | Sakshi
Sakshi News home page

క్షణాల్లో సందేశం.. ‘ఆన్‌లైన్’ సంతోషం

Published Sat, Dec 28 2013 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

Message in seconds .. 'Online' joy

కొత్త సంవత్సరం వస్తుందొంటే అదో హడావుడి. చిన్నపిల్లలైతే దేవుళ్లు, సినీనటుల ఫొటోలు, పూలు ఉండే గ్రీటింగ్‌ల కోసం వెతికేవారు. యువతరం పూలు, ప్రకృతి, ప్రేమచిహ్నాలు, స్నేహానికి నిర్వచనం చెప్పే వాక్యాలుండే గ్రీటింగ్‌కార్డుల కోసం గాలించేవారు. మధ్యవయస్సువారు, పెద్దలు వారి స్థాయిలో గౌరవంగా శుభాకాంక్షలు చెప్పుకునే విధంగా ఉండే కార్డుల కోసం అన్ని దుకాణాలు తిరిగేవారు. రెండువారాల ముందే గ్రీటింగ్‌కార్డులు కొని పోస్టు ద్వారా కుటుంబసభ్యులు, స్నేహితులు, బందువులకు పంపేవారు. అవి కొందరికి ఒకటో తేదీకి అటు ఇటుగా చేరితే మరికొందరికి జనవరి మొదటి వారంలో చేతికందేవి. వాటిని చూడగానే కళ్లు విప్పారేవి. కార్డులోని ప్రతి అక్షరాన్ని చదువుతూ సంతోషంతో ఆనందబాష్పాలు రాలేవి. ఇదంతా 15 ఏళ్ల క్రితం మాట. ఇప్పుడంతా ఆన్‌లైనే. శుభాకాంక్షలు చెప్పేందుకు అరచేతిలో వైకుంఠాలు ఉన్నాయి. ఒక బటన్ నొక్కితే చాలు పదుల సంఖ్యలో ఎస్‌ఎంఎస్‌లు సన్నిహితులకు వెళ్లే సదుపాయం నేడు వచ్చింది.
 
 ఇందుకు పలు సామాజిక వెబ్‌సైట్‌లు రకరకాల ఫీచర్లతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. అక్షరాల్లోనే గాక ఫొటోలు, చిత్రాల ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేందుకు నేటి తరం రంగం సిద్ధం చేసుకుంటోంది. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే సెల్‌ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌లు పని ప్రారంభం కానుంది. సమాజంలో నేడు 50 శాతం మందికి పైగా సెల్‌ఫోన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వారి ఆర్థిక స్థోమతకు తగ్గట్లు సాధారణ సెల్‌ఫోన్లతో పాటు స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు.
 
 అధిక శాతం యువత స్మార్ట్‌ఫోన్లపై మక్కువ పెంచుకుంటోంది. ఈ దశలో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సెల్‌ఫోన్ల ద్వారా ఎస్‌ఎంఎస్‌లు పంపించేందుకు రెడీ అవుతున్నారు. స్మార్ట్‌ఫోన్లలోని వాట్స్‌ఆప్, లైన్ తదితర యాప్‌లతో పాటు గూగుల్, యాహూ, జీ మెయిల్, రెడిఫ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర  సామాజిక వెబ్‌సైట్‌లను ఉపయోగించుకుని ఇంటర్‌నెట్ ద్వారా గ్రీటింగ్‌లు పంపించేందుకు యువత సమాయత్తమవుతోంది. కంప్యూటర్, ట్యాబ్లెట్‌పీసీలు, ల్యాప్‌టాప్‌ల ద్వారా సామాజిక వెబ్‌సైట్లు, ఈ మెయిల్స్ ద్వారా శుభ సందేశాలను పంపించనున్నారు. గతంలో శుభాకాంక్షలు పంపించేందుకు వారాలు పట్టే కాలం నేడు ఖండాంతరాలు దాటైనా క్షణాల్లో చేరిపోతోంది.            
 - న్యూస్‌లైన్, కర్నూలు(విద్య)
 
 గ్రీటింగ్‌కార్డులు మనసును
 తాకుతాయి -ఎండి గౌస్, యోగాశిక్షకులు
 ఒకప్పుడు గ్రీటింగ్‌కార్డుల కోసం ప్రజలు వెంపర్లాడేవారు. వారి అభిరుచికి తగ్గట్లు కార్డులు కొని ఆప్తులకు పంపేవారు.  చేతితో రాసిన సందేశాలు మనసుకు తాకుతాయి. స్మార్ట్‌ఫోన్లు, ఆండ్రాయిడ్‌ఫోన్లు ఎన్ని వచ్చినా గ్రీటింగ్‌కార్డులకు ఉన్న విలువ వేరు.
 
 ఆధునిక టెక్నాలజీతో క్షణాల్లో సందేశం  
 -డాక్టర్ పి. సునీల్‌కుమార్‌రెడ్డి, దంత వైద్యనిపుణులు
 గతంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలంటే వారాల సమయం పట్టేది. ఆధునిక టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు క్షణాల్లో ఎవరికైనా, ఎక్కడి వారికైనా విషెష్ చెప్పొచ్చు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్‌నెట్ సౌకర్యం ద్వారా విదేశాల్లో ఉన్న వారికి  క్షణాల్లో శుభసందేశాలు పంపించే అవకాశం ఉంది.
 
 ఇంటర్‌నెట్ వినియోగం పెరిగింది
 -భూమా కిశోర్, అఖిల్ కంప్యూటర్స్
 ఇటీవల కాలంలో ఇంటర్‌నెట్ వాడకం పెరిగిపోయింది. అధిక శాతం విద్యావంతులు మొబైల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్ వాడుతున్నారు. న్యూ ఇయర్‌కు తక్కువ సమయంలో ఎక్కువ యాక్సెసబులిటి ఉంటుంది. క్షణాల్లో సందేశం వెళ్తుంది.
 
 గ్రీటింగ్స్ వెబ్‌సైట్లు :
 www.123greetings.com, www.supertop100.com, www.snowleopard.org,
 
 ఎస్‌ఎంఎస్‌ల వెబ్‌సైట్లు :
 www.newyearsms.in, www.onlysms.net, www.mobileheart.com
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement