గ్రీటింగ్ కార్డుకు గ్రీటింగ్స్ లేవు! | No greetings to the greeting card! | Sakshi
Sakshi News home page

గ్రీటింగ్ కార్డుకు గ్రీటింగ్స్ లేవు!

Published Mon, Dec 28 2015 10:52 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

గ్రీటింగ్ కార్డుకు  గ్రీటింగ్స్ లేవు! - Sakshi

గ్రీటింగ్ కార్డుకు గ్రీటింగ్స్ లేవు!

కాగితాలు రెక్కలై ఎగిరిన గ్రీటింగ్ కార్డు
అరుదైన ప్రాణిగా మారింది.
క్రమక్రమంగా అంతరించి పోతోంది.
సోషల్ మీడియా కాలుష్యానికి ఆ స్పర్శ నిండిన పలకరింపు మూగబోతోంది.

 
న్యూ ఇయర్ వస్తుంటే కొంత డబ్బు మూట గట్టుకోవాలి. మరికొంత డబ్బు దాచి పెట్టుకోవాలి. చివరి వారంలో బజారుకు వెళ్లి ఇష్టమైనవాళ్ల కోసం గ్రీటింగ్స్ కొని తెచ్చుకోవాలి. బంధువులకు, స్నేహితులకు, ప్రియమైన వాళ్లకు, ప్రేమిస్తున్నవాళ్లకు. ఆ తర్వాత వాటికి కవర్లు కొనడం, స్టాంపులు అంటించడం, పోస్టాఫీసుకు వెళ్లి ఆల్రెడీ నిండిపోయిన పెట్టెల్లోకి కూరి కూరి లోపలికి నెట్టడం... మనం పంపిన కార్డు చేరి జవాబు వచ్చేదాకా ఒక ఎదురుచూపు మనకు వచ్చే కార్డుల కోసం గడప దగ్గర నిలబడి నిరీక్షణ... ఈ రోజులన్నీ పోయాయి.   ఇప్పుడు గ్రీటింగులు ఉన్నాయి. కార్డులు లేవు.

ఒక ఎస్‌ఎంఎస్... ఒక వాట్సప్ మెసేజ్... లేదంటే ఈ మెయిల్... కాదంటే ఫోన్ కాల్... కాని అందులో స్పర్శ లేదు. రెండు మడతల ప్రింటెడ్ కార్డ్ కొని, ఆ కార్డ్ మీద మనకు ఇష్టమైన మన టేస్ట్‌కు తగిన గులాబీల బొమ్మో, ప్రకృతిని చీల్చినట్టు ఉండే ఒక దారి బొమ్మో, బోసి నవ్వుల పాపాయి బొమ్మో, టెడ్డీ బేర్ బొమ్మో ఉన్నది కొని లోపల మనకిష్టమైన క్యాప్షన్ ఉండేలా చూసుకొని లేదా కొత్త రెడ్ స్కెచ్‌తో క్యాప్షన్ రాసి పైన అందుకోవాల్సిన వారి పేరు కింద మన సంతకం... సొంత దస్తూరిలో ఉంటే అది తాకే స్పర్శ ఈ వర్చువల్ గ్రీటింగ్స్‌లో ఉంటుందా? ఈ ఆనందాలు ఇప్పటి కుర్రాళ్లకు తెలీవు.
 
ప్రేమను బట్టి సైజు...
ఇరవై ముప్పై ఏళ్ల కిందట ఇయర్ వస్తే గ్రీటింగ్ కార్డులదే. అవి అమ్మడానికే కొన్ని షాపులు ప్రత్యేకంగా ఉండేవి. స్తోమతను బట్టి కార్డు సైజులు కూడా ఉండేవి. పోస్ట్‌కార్డ్ లాంటి గ్రీటింగ్ కార్డులకు గౌరవం తక్కువ. ఫోల్డెడ్ కార్డ్స్‌కే గిరాకీ ఎక్కువ. వాటిలో కూడా రకరకాల సైజులు. జేబులో పట్టే సైజు, అర చెయ్యంత సైజు, జానెడు సైజు... ఇంకా పెద్దది కావాలంటే మూరంత సైజు కూడా ఉండేవి. కొత్తగా ప్రేమలో పడినవాళ్లు వీటిని కొనేవాళ్లు. న్యూ ఇయర్ రోజు తల స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని గుడి కెళ్లినంత భక్తిగా ఇవి ఇవ్వడానికి తమ గర్ల్‌ఫ్రెండ్/ బాయ్‌ఫ్రెండ్స్‌ను వెతుక్కుంటూ వెళ్లేవాళ్లు. నలుగురి కంట పడకుండా సంకేత ప్రదేశాల్లో ఈ గ్రీటింగులు మార్చుకోవడం ఆ వెర్రిబాగుల రోజుల్లో పెద్ద అడ్వంచర్. ఆ దక్కిన కార్డును క్లోజ్ ఫ్రెండ్స్‌కు చూపించుకోవడం పెద్ద ఘరానా. కొందరు గత సంవత్సరం తమకు పంపినవారికి మాత్రమే పంపేవారు. మరికొందరు ఈ సంవత్సరమే తమ ఖాతాను ఓపెన్ చేసేవారు. ‘చేరదు, పోస్ట్ ఆఫీస్‌లో ఎవరైనా నొక్కేస్తారు’ అనే భయం ఉన్నవారు పట్టుబట్టి రిజిస్టర్డ్ పోస్ట్ చేసి ఆ రసీదును జాగ్రత్తగా దాచుకునేవారు.

అది అందేసరికి ఫిబ్రవరి వచ్చేది. అయినా సరే ఆనందం దక్కేది. కొందరు పొదుపు సంఘాల వాళ్లు తెలివిగా ఒకే కార్డులో న్యూ ఇయర్‌కూ పొంగల్‌కు కలిపి గ్రీటింగ్స్ చెప్పేవారు. మరికొందరు క్రిస్మస్‌ను, న్యూ ఇయర్‌ను సంక్రాంతి దాకా పొడిగించేవారు. పోస్ట్ అని పోస్ట్ మేన్ వచ్చి గుప్పెడు గ్రీటింగ్ కార్డ్స్ గుమ్మం ముందు పడేసి పోతే ఆ వీధిలో ఆ ఇంటికి ఎంతో మర్యాద. వాటిని అందుకున్నవారికి ఎంతో గౌరవం. కొందరు అదృష్ట వంతులకు అమెరికా నుంచి కార్డులు అందేవి. ఆ సంగతి ఒక నెలపాటు ఊరంతా మళ్లీ మళ్లీ తెలిసేది. ఇప్పుడన్నీ గాలి శుభాకాంక్షలు... వాయు సందేశాలు.... అవి గుండెల్లో నిలవవు.

పేద ఆనందాలు...
అయితే ఆ రోజుల్లో అందరి దగ్గరా డబ్బులు ఉండేవి కాదు. ప్రేమ మాత్రం హృదయం నిండుగా ఉండేది. తమ ఆత్మీయతను వ్యక్తం చేయడానికి వీరంతా కళాకారులుగా మారేవారు. బజారుకు వెళ్లి నాలుగు రంగుల నాలుగు చార్టులు కొని వాటిని గ్రీటింగ్ కార్డుల సైజ్‌లో కట్ చేసి బొమ్మలు గీసేవారు. పూసలు అంటించేవారు. తాటాకులనూ నెమలి పింఛాలను పక్షుల ఈకలను.. వీటన్నింటితో అద్భుతమైన కళాఖండాలు తయారు చేసేవారు. బజారులో దొరికేవాటికన్నా ఇవే బాగుండేవి. ఇవి అందుకున్నవారికి సంతృప్తిని, కనుల వెంట తడి చెమ్మని ప్రసాదించేవి. కొందరు వీటిని టేబుళ్ల మీద డిస్‌ప్లే చేసుకునేవారు. మరికొందరు తీగలు కట్టి వేలాడదీస్తే శుభకరం అని భావించేవారు.

నిరుడు కురిసిన హిమసమూహములు...
ఇప్పటి కాలంలో వీధుల్లో గంగిరెద్దులైనా అరుదుగా కనిపిస్తున్నాయి కానీ, సీజనల్ గ్రీటింగ్ కార్డుల దుకాణాలు మాత్రం బొత్తిగా కనిపించడం లేదు. ‘పిడికిట్లోకి ప్రపంచం’ వచ్చిపడ్డాక ఇంటర్నెట్ ఇంటింటికీ విస్తరించడం మొదలయ్యాక మనుషులకు పోస్టాఫీసులతో అనుబంధం తెగిపోయింది. మొబైల్ ఫోన్లు దోమలను మించి వ్యాపించాక టెలిగ్రామ్ ఊపిరే ఆగిపోయింది. స్మార్ట్‌ఫోన్లు చేతుల్లోకి వచ్చాక ఒక క్లిక్కుతో వంద కార్డులు... కార్డు సేమ్... నేమ్స్ చేంజ్డ్... అన్నీ ఉత్తుత్తి కార్డులే... అంటరానివి కాదు గానీ, అంటలేని కార్డులు. వర్చువల్ ప్రపంచంలో ప్రేమాభిమానాలూ వర్చువలే! కాని ఏం చేయగలం... వచ్చు కాలమే మేలు గడిచిన కాలం కంటే అని అనుకోవడం తప్ప.    
 
సోషల్ మీడియా దెబ్బ
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందలాది కోట్లకు పడగలెత్తిన గ్రీటింగ్‌కార్డుల వ్యాపారం ఇంటర్నెట్ తాకిడికి కుదేలైంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఈ వ్యాపారాన్ని చావుదెబ్బ తీసింది. అమెరికాలో 2008-10 మధ్య కాలంలోనే గ్రీటింగ్ కార్డుల వ్యాపారం ఏకంగా 25 శాతం మేరకు పతనమైంది. ఈ పరిణామం ఫలితంగా గ్రీటింగ్‌కార్డుల వ్యాపారంలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా వెలిగిన హాల్‌మార్క్ కంపెనీ అమ్మకాల్లో ఏటా దాదాపు 600 కోట్ల డాలర్ల తగ్గుదల నమోదవుతోంది. అమ్మకాలను పెంచుకునే మార్గాలు కనుచూపు మేరలో కనిపించని పరిస్థితుల్లో హాల్‌మార్క్ కంపెనీ గత ఏడాది మూడువందల మంది ఉద్యోగులను తొలగించింది. గ్రీటింగ్ కార్డుల పరిశ్రమలో నంబర్ వన్‌గా పేరుపొందిన హాల్‌మార్క్ కంపెనీ పరిస్థితే ఇలా ఉంటే ప్రపంచంలో మిగిలిన కంపెనీల పరిస్థితిని ఊహించుకోవచ్చు.
 
 
ఆరు శతాబ్దాల చరిత్ర
గ్రీటింగ్ కార్డుల చరిత్ర ఆరు శతాబ్దాల నాటిది. పదిహేనో శతాబ్ది తొలినాళ్లలో ఈజిప్షియన్లు పాపిరస్ మీద రంగు రంగుల బొమ్మలు వేసి, చూడచక్కని దస్తూరీతో సందేశాలు రాసి వాటిని చుట్టగా చుట్టి గ్రీటింగులు పంపేవారు. జర్మన్లు కలప ఫలకాలను చెక్కి గ్రీటింగ్ కార్డులను ముద్రించేవారు. యూరోప్‌లోని దాదాపు పంతొమ్మిదో శతాబ్ది ప్రథమార్ధం వరకు ఎక్కువగా చేతితో రూపొందించిన గ్రీటింగ్‌కార్డులను పంపుకొనేవారు. వీటి బట్వాడా కోసం అప్పట్లో తపాలా రాయితీలూ ఉండేవి. మార్కస్ వార్డ్ అండ్ కో, గుడాల్ అండ్ చార్లెస్ బెన్నెట్ వంటి కంపెనీలు 1860ల నాటికి ముద్రణా యంత్రాలను సమకూర్చుకొని భారీ ఎత్తున గ్రీటింగ్ కార్డుల తయారీని ప్రారంభించాయి. గ్రీటింగ్ కార్డుల రూపకల్పన కోసం ఈ కంపెనీలు పేరొందిన చిత్రకారులకు ఉద్యోగాలు ఇచ్చాయి. కలర్ లిథోగ్రఫీ పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక 1930ల నాటి నుంచి గ్రీటింగ్ కార్డుల ముద్రణలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ముద్రణ రంగంలోకి కంప్యూటర్లు వచ్చిన కొన్నేళ్ల వరకు కూడా గ్రీటింగ్ కార్డుల పరిశ్రమ ఢోకా లేకుండానే సాగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement