న్యూ ఇయర్ పూట.. వాట్సప్ డౌన్!
కొత్త సంవత్సరం వచ్చేసింది.. స్నేహితులు, బంధువులు అందరికీ శుభాకాంక్షలు చెబుదామని అనుకున్న వాళ్లకు వాట్సప్ పెద్ద షాకిచ్చింది. ప్రస్తుతం ఫేస్‌బుక్ యాజమాన్యం చేతుల్లో ఉన్న ఈ సోషల్ మీడియా నుంచి సందేశాలు పంపడానికి, అందుకోడానికి కూడా చాలాచోట్ల సమస్యలు ఎదురయ్యాయి. ప్రధానంగా యూకే, పశ్చిమ యూరప్ దేశాల్లో వాట్సప్ బాగా ఇబ్బంది పెట్టినట్లు డౌన్‌డిటెక్టర్ అనే సైట్ తెలిపింది. ఇంటర్‌నెట్, మొబైల్ సేవల రియల్ టైం సేవలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని ఈ సైట్ చెబుతుంది.
భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో రాత్రి కొంత సమయం పాటు మెసేజిలు పంపడానికి, అందుకోడానికి కూడా సమస్యగానే ఉందని కొందరు వినియోగదారులు తెలిపారు. ప్రధానంగా రాత్రి 12 గంటలకు ముందు అంతా బాగానే ఉన్నా, తర్వాత మాత్రం కాసేపు మెసేజిలు వెళ్లలేదు. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వాట్సప్ తెలిపింది. అయితే దానికి కారణం ఏంటి, ఎప్పుడు మొదలైందన్న విషయాలకు మాత్రం సమాధానం లేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్ల మంది వాట్సప్ వాడుతున్నారని ఫేస్‌బుక్ చెబుతోంది.