వాట్సప్ ఆల్‌టైం రికార్డ్
వాట్సప్ ఆల్‌టైం రికార్డ్
Published Fri, Jan 6 2017 3:10 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. శుభాకాంక్షలు చెబుతూ గ్రీటింగులు పంపడం ఒకప్పటి అలవాటు. ఆ తర్వాత ఎస్ఎంఎస్‌లు వచ్చాయి, వాటి స్థానాన్ని వాట్సప్ ఆక్రమించింది. ఈ ఏడాది ఈ మెసేజిలు ఆల్‌టైం రికార్డు సాధించాయి. టెలికం ఆపరేటర్లు మిగిలిన రోజుల్లో ఉన్న ఎస్ఎంఎస్ ఆఫర్లను కూడా కొత్త సంవత్సరం, ఇతర పండుగల సమయాల్లో రద్దు చేస్తుండటంతో.. ఖర్చు తగ్గించుకోడానికి వాట్సప్ సందేశాలు వెల్లువెత్తించారు. డిసెంబర్ 31న ఒక్క భారతదేశంలోనే 1400 కోట్ల సందేశాలు వాట్సప్ ద్వారా వెళ్లాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీయే వెల్లడించింది. భారతదేశంలో వాట్సప్ చరిత్రలోనే ఇది సరికొత్త రికార్డని అంటున్నారు. డిసెంబర్ 31న 310 కోట్ల ఫొటోలు, 70 కోట్ల జిఫ్‌లు, 61 కోట్ల వీడియోలు కూడా భారతీయులు ఒకరికొకరు పంపుకున్నారు. మొత్తం సందేశాల్లో 32 శాతం మీడియా రూపంలోనే ఉన్నాయని, మిగిలినవి టెక్స్ట్ సందేశాలని కూడా కంపెనీ తెలిపింది.
వాట్సప్ కాల్స్, వీడియో కాల్స్ లాంటి వాటి వల్ల టెలికం కంపెనీలు 2016 సంవత్సరంలో 21 వేల కోట్ల ఆదాయన్ని కోల్పోయాయని ఓవమ్ అనే రీసెర్చి సంస్థ తెలిపింది. ఇప్పుడు వాట్సప్ నిత్యజీవితంలో ఒక అత్యవసరమైన భాగం అయిపోయిందని, పండుగలు జరుపుకోవడం అయినా.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలన్నా అన్నింటికీ ముందుగా కమ్యూనికేషన్ మార్గం వాట్సప్ అవుతోందని అంటున్నారు. దేశ విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా దీని ద్వారా వెంటనే సందేశాలు పంపుతుండటంతో కమ్యూనికేషన్ సులభం అవుతోంది.
Advertisement