సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ ఆడిటర్‌నే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కూడా ఆడిటర్‌గా నియమించడం వెనుక ప్రజాధనం కొల్లగొట్టాలన్న ఎత్తుగడ ఉందని న్యాయస్థానానికి సీఐడీ తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిధుల అక్రమ మళ్లింపులో దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించిన ఆధారాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఈ కేసులో నిందితుడు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతించాలని సీఐడీ తరఫున రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు.
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం వరుసగా మూడో రోజు శుక్రవారం విచారించింది. సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిధుల అక్రమ మళ్లింపునకే టీడీపీకి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రెండింటికీ వెంకటేశ్వరరావును ఆడిటర్‌గా నియమించారన్నారు. గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడిపించారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా డిజైన్‌టెక్ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాలోకి చేరినట్టు సీఐడీ అధికారులు గుర్తించారన్నారు.
దీనిపై ఈ నెల 10న విచారణకు రావాలని ఆడిటర్ వెంకటేశ్వరరావుకు సీఐడీ నోటీసులు జారీ చేసిందన్నారు. టీడీపీ ఖాతాల్లో చేరిన రూ.27 కోట్లతోపాటు అక్రమంగా తరలించిన మిగిలిన నిధులపై రాబట్టిన కీలక ఆధారాలపై చంద్రబాబును సీఐడీ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీడీపీ ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఐటీ రిటర్న్స్‌ను మాత్రమే సీఐడీ డౌన్‌లోడ్ చేసిందని, బ్యాంకుల నుంచి రికార్డులు తీసుకోలేదన్నారు. బ్యాంకర్ల నుంచి రికార్డులు తీసుకున్నారని చెబుతున్న చంద్రబాబు న్యాయవాదుల వాదనలో వాస్తవం లేదన్నారు.
గతంలో రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన, సహాయ నిరాకరణ చేసి విలువైన సమయాన్ని వృథా చేశారని తెలిపారు. కాబట్టి చంద్రబాబును కనీసం మూడు రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలని న్యాయస్థానాన్ని ఏఏజీ కోరారు. సీఎం హోదాలో ఉంటూ కుట్రపూరితంగా వ్యవహరించి షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన చంద్రబాబుకు సెక్షన్ 409 వర్తిస్తుందన్నారు.
సీఐడీ నోటీసులు జారీ చేసిన కీలక సాక్షులు చంద్రబాబుకు పీఎస్‌గా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని విదేశాలకు పరారైన విషయాన్ని ఆయన మరోసారి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ తరుణంలో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తే ఇతర కీలక సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందన్నారు.
13 మంది నిందితులు బెయిల్‌పై ఉన్నారు.. చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వండి
చంద్రబాబు తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదనలు వినిపిస్తూ.. ఆదాయ పన్ను శాఖ, ఎన్నికల సంఘానికి టీడీపీ సమర్పించిన రిటర్న్స్‌లు, రికార్డులను తప్పుగా అన్వయిస్తున్నారన్నారు. ఈ కేసులో ఇప్పటికే 13మంది నిందితులు బెయిల్‌పై బయట ఉన్నందున చంద్రబాబుకు కూడా బెయిల్ మంజూరు చేయాలన్నారు. వాదనల సందర్భంగా న్యాయస్థానంపై చంద్రబాబు తరఫు న్యాయవాది దూబే చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి తప్పుబట్టారు.
సీడీ ఫైల్ లేకుండా విచారిస్తున్నారని దూబే వాదించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ తన టేబుల్‌పై ఉన్న సీడీ ఫైల్‌ను చూపిస్తూ ఇదేమిటి అన్ని ప్రశ్నించారు. న్యాయస్థానంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దాంతో కంగుతిన్న దూబే తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు విన్న తరువాత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment