విశాఖ బీచ్‌రోడ్డులో ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న నౌకాదళ విన్యాసాలకు ఆహ్వానం పలుకుతున్న విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్), 25 నుంచి మార్చి 4 వరకూ మిలాన్ విన్యాసాలకు విశాఖ నగరం ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను సీఎస్ శనివారం సమీక్షించారు. బీచ్‌రోడ్డు, తూర్పు నౌకాదళ పరిధిలో రహదారులు, పోర్టు పరిసరాలు, వీవీఐపీలు ప్రయాణించే మార్గాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పైలాన్‌ను సమీర్‌శర్మ, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్‌లో తూర్పు నౌకాదళ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టరేట్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు, జీవీఎంసీ.. పరిశ్రమలు, టూరిజం, కస్టమ్స్ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నాటికి నగరంలో అన్ని పనులూ పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో పారిశుధ్యం, రహదారులు, బ్యూటిఫికేషన్‌పై దృష్టిసారించాలన్నారు.
ఘనంగా మిలాన్ ఏర్పాట్లు
అదేవిధంగా 25 నుంచి ప్రారంభమయ్యే మిలాన్‌కు కూడా ఏర్పాట్లు ఘనంగా ఉండాలని సీఎస్ సూచించారు. మిలాన్–2022కి సుమారు 46 దేశాలకు చెందిన 900 మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని వారికి పరిచయం చేసి.. ఆంధ్ర సంప్రదాయానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 27న బీచ్ రోడ్డులో జరిగే ఇంటర్నేషనల్ పరేడ్ కార్నివాల్‌ని తిలకించేందుకు సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా, నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ, వీఎంఆర్‌డీఏ కమిషనర్ వెంకటరమణారెడ్డి, జేసీ వేణుగోపాల్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment