![Sand Mining in Andha Pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/08/25/445.jpg.webp?itok=ylz-5YHP)
అస్తవ్యస్తంగా మారిపోయిన ఇసుక సరఫరా
బుకింగే కష్టం.. సామాన్యుడికి దొరకడమే గగనం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలను ఇసుక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచీ్చరాగానే అప్పటికే అమల్లో ఉన్న ఇసుక విధానాన్ని అస్తవ్యస్థంగా మార్చేయడంతో సర్వం గందరగోళమైంది. ఒకవైపు ఉచిత ఇసుక అంటూ సీఎం చంద్రబాబు, అధికారులు ప్రచారం చేస్తున్నా.. యార్డుల వద్ద మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. సామాన్యుడికి ఇసుక దొరకడమే గగనమైపోయింది.
బుకింగ్‌కు సరైన విధానమంటూ లేకపోవడంతో ఎక్కడ కొనుగోలు చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని చెప్పినా అది ఎక్కడా అమల్లోకి రాలేదు. స్థానికంగా డంప్ యార్డులున్న చోట బుకింగ్ కేంద్రాలు పెట్టినా అక్కడ పెద్దపెద్ద లైన్లు ఉంటున్నాయి.
అక్కడ టీడీపీ నేతల హవా కొనసాగుతుండటంతో సాధారణ ప్రజలు బుకింగ్ చేసుకోలేకపోతున్నారు. దీంతో చాలాచోట్ల లారీ యజమానులపైనే ఆధారపడాల్సి వస్తోంది. వారు కూడా టీడీపీ నేతల కసుసన్నల్లోనే పని చేస్తుండటంతో ఇసుక ధర భయపెట్టేలా ఉంటోంది. పది కిలోమీటర్ల దూరానికి 20 టన్నుల ఇసుక లారీకి రూ.30 వేలకుపైగా ఖర్చవుతోంది. ఒకవైపు ఇంతలా జేబులకు చిల్లు పెట్టుకుంటూ నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ఉచిత ఇసుకంటూ డప్పు కొట్టుకోవడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.
3 రోజులు వేచి ఉండాల్సిందే..
సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నివాస ప్రాంతం పక్కనే ఉన్న తాళ్లాయపాలెం, లింగాయపాలెం ఇసుక స్టాక్ యార్డుల వద్ద లోడింగ్ కోసం నిత్యం కిలోమీటర్ల మేర లారీలు నిలిచిపోయి ఉంటున్నాయి. బుకింగ్ చేసుకున్నాక 2, 3 రోజులు క్యూలైన్లలో వేచి ఉంటే గానీ ట్రక్కు, డంప్ యార్డుకు చేరుకోలేకపోతోంది. దీంతో రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డు, ఉద్దండరాయునిపాలెం వద్ద వందల సంఖ్యలో లారీల క్యూ కనిపిస్తోంది.
రోజుల కొద్దీ ట్రక్కులు వేచి ఉండడంతో లారీ కిరాయి, డ్రైవర్ జీతం, వెయిటింగ్ చార్జీలన్నీ కలిపి బుక్ చేసుకున్న వారు ఒక్కో లారీకి అదనంగా రూ.5 వేల నుంచి రూ.6 వేలు అదనంగా చెల్లించాల్సివస్తోంది. ఇక గోదావరి నది వద్ద ఉన్న స్టాక్ యార్డుల్లోనూ చార్జీల మోత మోగుతోంది. ఇసుకను బుకింగ్ చేసుకున్నాక తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పందలపర్రు, పెండ్యాల, ఉసులమర్రు ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఒకటి, రెండు రోజుల పాటు లారీలు ఉండాల్సి వస్తోంది. టన్ను ఇసుకను రూ. 270కి ఇస్తున్నా రవాణా చార్జీలు దానికి పది రెట్లు, వెయిటింగ్ చార్జీలు మరో మూడు రెట్లు పెరగడంతో ఇసుకరేటు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది.
టీడీపీ నేతల హల్‌చల్
తమ వారికే ముందు ఇవ్వాలని యార్డుల వద్ద టీడీపీ నేతలు హల్‌చల్ చేస్తున్నారు. దొంగ బుకింగ్‌లను పెద్దఎత్తున చేయించి ఇసుకను తరలిస్తున్నారు. మరికొందరు నేతలు బుకింగ్‌తో సంబంధం లేకుండా వాళ్ల లారీలను దొడ్డి దారిన స్టాక్ యార్డు వద్దకు తీసుకెళ్లి లోడింగ్ చేయించుకుంటున్నారు. దీంతో ఇసుక బుకింగ్ చేసుకోవడమే పెద్ద ప్రహసనంగా మారిపోయింది. బుకింగ్ చేసుకున్న వారిని కూడా టీడీపీ నేతలు బెదిరించి ఇసుకను వేరేవాళ్లకు అమ్మేసుకుంటున్నారు. ఇటీవల పెండ్యాల స్టాక్ యార్డు నుంచి సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యం 37 లారీల ఇసుకను బల్క్ బుకింగ్ చేసుకోగా కర్మాగారానికి ఒక లారీ మాత్రమే వెళ్లింది. యార్డు నుంచి వెళ్లిన మిగిలిన లారీలను టీడీపీ నేతలు మధ్యలోనే దారి మళ్లించి అమ్మేసుకున్నారు. దీనిపై ప్లాంట్ మేనేజర్ల ఫిర్యాదు చేయడంతో ఆ విషయాన్ని బయటకు రానీయకుండా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారు.
తెలంగాణకు తరలిపోతోంది
ఎనీ్టఆర్ జిల్లా జగ్గయ్యపేట వద్ద ఉన్న అనుమంచిపల్లె ఇసుక స్టాక్ యార్డు నుంచి ప్రతినిత్యం వందల లారీల ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతోంది. దీనిలో టీడీపీ నేతల హస్తం ఉందని తెలుస్తోంది. ట్రాక్టర్లలో తీసుకెళ్లి గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో పాలేరు నది ఒడ్డున డంప్ చేస్తున్నారు. అక్కడ రాత్రిపూట లారీల్లోకి లోడ్ చేసి సూర్యాపేట, హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. 30 టన్నుల లారీ లోడ్‌ని సూర్యాపేటలో రూ.35 వేలు, హైదరాబాద్‌లో రూ.70 వేల చొప్పున అమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment