
ఇసుక ఫ్రీనే కానీ.. ప్రతి రేణువుకూ రేటుంది
టన్నుల లెక్కన బోర్డులు పెట్టి మరీ ముక్కు పిండి వసూలు
స్టాక్ పాయింట్ నుంచి రవాణా చార్జీలు, పన్నులు అదనం
వేబ్రిడ్జిలు లేనిచోట్ల ఇష్టారాజ్యంగా లోడింగ్...
ఒకే బిల్లుపై పలు వాహనాల్లో తరలింపు
ఇప్పటికే 40 లక్షల టన్నుల ఇసుక మాయం
పచ్చ ముఠాల కనుసన్నల్లోనే రీచ్‌లు, స్టాక్ పాయింట్లు
ఉచితంగా ఇస్తామంటూ ఉమ్మడి మేనిఫెస్టో హామీ ఇసుకలోకి..
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ చూసినా.. తెలుగు నిఘంటువులు,శబ్ద రత్నాకరం తిరగేసినా వాటిల్లో వాస్తవ అర్థాలే ఉంటాయి.కానీ సీఎం చంద్రబాబు డిక్షనరీ మాత్రం వేరే ఉంది. ప్రతి పదానికీ తనదైన అర్థాలు, నిర్వచనాలు ఉంటాయి! అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఎలాగంటే.. ఉచితం అంటారు.. కానీ దానికో ధర ఉందంటారు! ఇసుక ఉచితంగా ఇస్తామంటూనే ఊరికే ఏదీ రాదంటారు మరి!! ఉచితం అంటే టీడీపీ పెద్దల దృష్టిలో అమ్మకమే. రాష్ట్రవ్యాప్తంగా స్టాక్ యార్డుల వద్ద బోర్డు పెట్టి మరీ టన్నుల చొప్పున బహిరంగంగా విక్రయిస్తున్నా సరే అది ఉచితంగా ఇవ్వడమే!
సీనరేజి ఫీజు, తవ్వకం, లోడింగ్, ఇతర పన్నులతోపాటు రవాణా చార్జీలు కూడా వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. డబ్బులు చెల్లించి కొన్నా సరే ఇసుకను ఉచితంగా ఇస్తున్నారనే చెప్పాలి. లేదంటే సీఎం చంద్రబాబుకు కోపం వస్తుంది. ‘ఉచితం అంటే మీ ఇంటికి నేనే ఫ్రీగా తీసుకొచ్చి ఇవ్వాలా?’ అని ఎదురుదాడి చేస్తారు. డబ్బులిచ్చి కొంటున్నాం..కదా అని ఎవరైనా వినియోగదారుడు ఉచితం కాదని చెబితే టీడీపీ శ్రేణులు చితకబాదినా దిక్కుండదు. ఎందుకంటే అది టీడీపీ సర్కారు ఉచిత విక్రయ పథకం కాబట్టి! – సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్
పల్నాడులో పచ్చనేతలు చెప్పిందే ధర
మాచర్లలో.. 30,000
పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమ డంప్‌లు పెద్ద ఎత్తున ఉన్నాయి.కృష్ణానది, గుండ్లకమ్మ, వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి డంపింగ్ యార్డులలో నిల్వ ఉంచారు. ఇటీవల వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం తలర్లపల్లిలో గుండ్లకమ్మ వాగు నుంచి టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఓ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మరణించిన విషయం తెలిసిందే. కొండమోడులో టన్ను ఇసుక ధర రూ.564లు ఉండగా, వినుకొండలో రూ.793లు ఉంది. వీటికి రవాణా చార్జీలు అదనం. తాళ్లాయపాలెం నుంచి గుంటూరుకు ఇసుక లారీ రావాలంటే రూ.15,000 పైనే అవుతోంది. మాచర్లలో 18 టన్నుల ఇసుక రవాణాతో కలిపి రూ.30వేలు అవుతోంది.
కడపలో కొల్లగొట్టేస్తున్నారు..
మదనపల్లెలో..28,300
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ఉచిత ఇసుక పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు పోటాపోటీగా ఉచిత ఇసుకను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీ సీఎం రమేష్ వర్గీయులకు పోటీగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఇసుక అక్రమ అమ్మకాలు సాగిస్తున్నారు. మదనపల్లెకు 18 టన్నుల ఇసుక తరలించాలంటే రవాణా చార్జీలతో కలిపి రూ.28,300 వరకు ఖర్చవుతోంది. జమ్మలమడుగుకు అయితే రూ.20వేలకు పైగా అవుతోంది.
కృష్ణమ్మ చెంతనే ఉన్నా వేలల్లో ధరలు
ఎన్టీఆర్ జిల్లాలో..25,200
ఉచిత ఇసుక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రవాణా, లోడింగ్, సీనరేజీ, జీఎస్టీ చార్జీల పేరుతో స్టాకు యార్డుల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ట్రక్కు బాడుగ రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఉంది. కంచికచర్ల మండలం మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద అధికారులు నామమాత్రంగా ఉండగా, 20 మందికి పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.
ఒకే బిల్లుపై రెండు వాహనాల్లో లోడ్ చేసి తరలిస్తున్నారు. పెనమలూరు పరిధిలోని చోడవరంలో 50–70 లారీలకు పైగా ఇసుక నిల్వలను అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు లారీ రూ.16 వేల నుంచి రూ.20 వేల చొప్పున అమ్మేశారు. స్టాకు యార్డుల్లో నిల్వలు లేవంటూ కృత్రిమ కొరత సృష్టించి ట్రాక్టరు లోడ్ రూ.6 వేల నుంచి రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. దూరప్రాంతాలకు 18 టన్నుల ఇసుక లారీలో తేవాలంటే బాడుగ, పన్నులతో కలిపి రూ.20,835 నుంచి రూ.25,200 అవుతుంది.
కర్నూలులో కొనలేం..
శ్రీశైలంలో 32,000
కర్నూలు జిల్లాలో ఇసుక ధరలు భారీగా ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పెట్టి దోచుకుంటున్నారు. మరోవైపు కౌతాళం మండలం గుడికంబాళి రీచ్‌లోని ఇసుకను టీడీపీ నాయకులు ఇతరుల ఆధార్ కార్డులతో కొల్లగొట్టి డంపింగ్ చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో 18 టన్నులు ఇసుక గరిష్టంగా లారీ రవాణా చార్జీలతో కలిపి రూ.32వేలు వరకు అవుతోంది.
ఉత్తరాంధ్రలో విచ్చలవిడిగా లూటీ..
పెందుర్తిలో.. 28,800
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉచితం పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా.. ఆచరణలో మాత్రం అధిక ధరలు వసూలు చేస్తున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 18 టన్నుల ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.20వేల నుంచి 28,800 వరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక డిమాండ్ ఎక్కువగా ఉండే విశాఖపట్నం నగర పరిసర ప్రాంతాల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి.
అనంతలో అతి కష్టం
పెనుకొండలో..25,000
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం జుంజురంపల్లి సమీపంలో వేదావతి హగరి నది వద్ద ఇసుక విక్రయాలు ప్రారంభించారు. ఇక్కడి నుంచి అనంతపురం లాంటి దూర ప్రాంతాలకు తరలించాలంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. పెనుకొండలో గరిష్టంగా 18టన్నుల ఇసుక రవాణాచార్జీలతో కలిపి రూ.25,000 వరకు అవుతోంది.
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చిత్ర విచిత్రాలు..
నెల్లూరు రూరల్..23,000
ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు మండలం దిగువ మాసపల్లి రీచ్‌లో టన్నుకు రూ.289 సీనరేజీ కింద చెల్లిస్తూ అదనంగా రూ200 వసూలు చేస్తున్నారు. నగరి, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల ప్రజలు చిత్తూరు రూరల్ మండలంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపో వద్దకు వచ్చి తీసుకెళ్లేందుకు రవాణా చార్జీలతో కలిపి ట్రాక్టర్ లోడు ఇసుక రూ.7,500 వరకు ఖర్చు అవుతోంది.
కుప్పం, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల ప్రజలు గంగవరం మండలం బైరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఇసుక డిపోనకు వచ్చి ఇసుక తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి రవాణా ఖర్చులతో కలిపి ట్రాక్టర్ లోడు రూ.8,500 వరకు ఖర్చు అవుతోంది. గూడూరుకు వెళ్లేందుకు ట్రాక్టర్ ఇసుకకు రూ.9 వేల నుంచి రూ.10వేలు వ్యయం అవుతోంది. చంద్రగిరికి లారీ ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.21,600 వరకు అవుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 18 టన్నుల ఇసుక లారీ తీసుకువెళ్లేందుకు రూ.23,000 అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment