నాన్న.. నేను..  ఓ స్కూటర్‌ | Scooter Made In Memory Of Father‌ In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నాన్న.. నేను..  ఓ స్కూటర్‌

Published Thu, Mar 3 2022 12:08 PM | Last Updated on Thu, Mar 3 2022 4:02 PM

Scooter Made In Memory Of Father‌ In Visakhapatnam - Sakshi

కనిపించే దేవత అమ్మ.. నడిపించే దైవం నాన్న. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత.. నాన్నంటే ఓ రిలేషన్‌ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఎమోషన్‌. అలాంటి ఓ నాన్న ఎమోషన్‌ను అర్థం చేసుకున్నాడో కుమారుడు. తండ్రి ఎంతో ఇష్టంగా చూసుకున్న స్కూటర్‌ను జ్ఞాపకంగా మార్చుకునేందుకు ఆరేళ్లు తపన పడ్డాడు. స్కూటర్‌కు కొత్త రూపు తీసుకొచ్చేందుకు ఇంటర్నెట్‌లో శోధించాడు.

ఆ రంగంలో నిష్ణాతులను కలిశాడు. వివిధ విభాగాల కోసం పలు రాష్ట్రాలకు వెళ్లాడు. అనుకున్నది సాధించాడు. అద్భుతమైన స్కూటర్‌ తయారు చేశాడు. తండ్రి జ్ఞాపకంగా ఆ స్కూటర్‌పై రయ్‌ రయ్‌మంటూ దూసుకుపోతున్నాడు. అతనే జీవీఎంసీ 52వ వార్డు శాంతినగర్‌కు చెందిన స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి బి.కె.రమేష్‌. 
– గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) 

సాధారణంగా తుప్పుపట్టిన వస్తువులను పాత సామాన్ల వారికి అమ్మేస్తుంటాం. కానీ తన తండ్రి ఇష్టపడి కొనుక్కున్న లాంబ్రెట్టా మోడల్‌ లాంబీ 150 స్కూటర్‌ పూర్తిగా మరమ్మతులకు గురైనా.. రమేష్‌ దాన్ని విక్రయించాలని అనుకోలేదు. మూలన పడేయనూ లేదు. ఆ కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ స్కూటర్‌ను మళ్లీ కొత్త బండిలా తయారు చేయాలని భావించారు. తానే సొంతంగా బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. డిప్లమో ఇంజినీరింగ్‌ చేసిన రమేష్‌ దీన్ని తీర్చిదిద్దడానికి నడుంకట్టారు. సుమారు ఆరేళ్ల పాటు స్కూటర్‌కు కావాల్సిన స్పేర్‌ పార్ట్స్‌ కోసం అన్వేషణ సాగించారు.

స్కూటర్ల వాడకం కనుమరుగైన కాలంలో.. లాంబీ విడి పార్టుల కోసం నానా పాట్లు పడ్డారు. ఒరిజినల్‌ పార్ట్స్‌ కోసం విశాఖపట్నంతో పాటు కర్నాటక, ఢిల్లీ, ముంబయి, కేరళ తదిత ర ప్రాంతాల్లో తిరిగారు. ఇంటర్నెట్‌ ద్వారా లాంబీ స్కూటర్‌పై అభిమానమున్న వ్యక్తులను కలుసుకొని కొన్ని పార్టులు సంపాదించారు. స్కూటర్‌ ఆయిల్‌ ట్యాంక్, ఫోర్కు, ఫోర్క్‌ బాల్స్‌ సెట్‌ తదితర పార్టులు మార్కెట్‌లో దొరక్క పోవడంతో.. తానే సొంతంగా డిజైన్‌ చేసి తయారు చేసుకున్నారు. ఇలా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి.. చివరకు స్పేర్‌ పార్ట్స్‌ సంపాదించారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఆరు నెలల పాటు శ్రమించి అద్భుతంగా స్కూటర్‌ తయారు చేశారు. 

లాంబీ.. ఓ సెంటిమెంట్‌
‘లాంబీ స్కూటర్‌ పార్టుల కోసం తిరుగుతుంటే దీని విలువ తెలిసింది. విశాఖలోనే ఓ పెద్ద షాపు యజమాని ఒకప్పుడు లాంబీ స్కూటర్‌ స్పేర్‌ పార్టులు అమ్మేవాడని తెలిసి.. ఆయన్ని కలిశాను. ఆయన దగ్గర ఈ స్కూటర్‌కు సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఎంత బతిమలాడినా ఆయన పార్ట్స్‌ ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే వాటి ద్వారానే ఇంతటి వాడినయ్యానని.. ఆ పార్టులు తనకు సెంటిమెంట్‌ అని చెప్పారు. నేను తిరిగిన చోట్ల ఇలాంటి వ్యక్తులు చాలా మంది తారసపడ్డారని’ రమేష్‌ తెలిపారు.  

నాన్న జ్ఞాపకాలు పదిలం 
‘మా నాన్న అప్పలస్వామి ఆర్మీలో పనిచేశారు. ఆయనకు లాంబ్రెట్టా స్కూటరంటే చాలా ఇష్టం. 1971లో తొలిసారిగా లాంబీ స్కూటర్‌ కొన్నారు. కొన్నాళ్లు దానిపై తిరిగాక.. అమ్మేశారు. ఆ స్కూటర్‌పై మక్కువ తీరక మళ్లీ 1994లో లాంబ్రెట్టా మోడల్‌ స్కూటర్‌ కొన్నారు. అదే ఈ స్కూటర్‌. రిటైర్‌ అయ్యాక వాడడం మానేశారు. తర్వాత అది పూర్తిగా పాడైంది. దాన్ని పూర్వం మాదిరిగా తయారు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు ఆ బండి నడిపారు. ఇప్పుడు ఆ బండిని మరింత మెరుగ్గా తీర్చి దిద్దే పనిలో ఉన్నాను.’ అని రమేష్‌ వివరించారు.  

స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం 
ప్రస్తుతం రమేష్‌ స్టీల్‌ప్లాంట్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ స్కూటర్‌ తయారీలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆటో మొబైల్‌ రంగంలో చాలా విజ్ఞానాన్ని సముపార్జించానని రమేష్‌ చెబుతున్నారు. ఇంటర్నెట్‌ ద్వారా, కొందరు మెకానిక్‌లకు సంప్రదించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు.

బండికి కావాల్సిన కొత్త వస్తువును తయారు చేసే ముందు ఆ వస్తువుకు సంబంధించి కొలతలన్నీ రాసుకోవడంతో పాటు డయాగ్రమ్‌ గీసుకునేవారు. ఆ వస్తువు మార్కెట్‌లో దొరక్కపోతే సొంతంగా తయారు చేసుకునేవారు. అనుభవం వల్లే ఈ విజ్ఞానం సాధించినట్లు చెప్పారు. ఆరు నెలల పాటు స్కూటర్‌ తయారీలో ప్రతి అంశాన్ని తన యూట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు వివరించారు. లాంబ్రెట్టా రమేష్‌ పేరుతో యూట్యూబ్‌ చానల్‌లో ఆటో మొబైల్‌కు సంబంధించిన చాలా విషయాలు వివరించినట్లు చెప్పారు.  

నాన్న సెంటిమెంట్‌ను నిలబెట్టాను  
ఈ స్కూటర్‌ మా నాన్నకు ఎంతో ఇష్టమైనది. అరుదైనది. అందుకే దీన్ని బాగు చేశాను. లాంబీ–150 మోడల్‌ స్కూటర్లు 1977 నుంచి 86 మధ్య కాలంలో మన దేశంలో అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇది ఇటలీ వెర్షన్‌లో తయారైన బండి. ఒక్కో పార్టును అధిక ధర ఇచ్చి కొనుగోలు చేశాను. రూ.70 ఖరీదు గల లాంబీ–150 మోనోగ్రామ్‌ రూ.300 ఇచ్చి కొనాల్సి వచ్చింది.

పెట్రోల్‌ ట్యాంకును కేరళలో కొన్నాను. ఇంజిన్‌లోకి అవసరమయ్యే పార్టులను ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేశాను. దాదాపు రూ.4.50 లక్షలు వెచ్చించి స్కూటర్‌ను తయారు చేశాను. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తే దేశం మొత్తం మీద 10 లోపు స్కూటర్లు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించాను. ఇప్పుడు ఈ బండిపై వెళ్తుంటే ఆరేళ్ల పాటు నేను పడిన కష్టం మర్చిపోతున్నా.. ప్రస్తుతం ఈ స్కూటర్‌ను మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నా.
– బి.కె.రమేష్, స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement