Lambi
-
నాన్న.. నేను.. ఓ స్కూటర్
కనిపించే దేవత అమ్మ.. నడిపించే దైవం నాన్న. నాన్నంటే భద్రత, భరోసా, బాధ్యత.. నాన్నంటే ఓ రిలేషన్ మాత్రమే కాదు.. ఎప్పటికీ అర్థం కాని ఎమోషన్. అలాంటి ఓ నాన్న ఎమోషన్‌ను అర్థం చేసుకున్నాడో కుమారుడు. తండ్రి ఎంతో ఇష్టంగా చూసుకున్న స్కూటర్‌ను జ్ఞాపకంగా మార్చుకునేందుకు ఆరేళ్లు తపన పడ్డాడు. స్కూటర్‌కు కొత్త రూపు తీసుకొచ్చేందుకు ఇంటర్నెట్లో శోధించాడు. ఆ రంగంలో నిష్ణాతులను కలిశాడు. వివిధ విభాగాల కోసం పలు రాష్ట్రాలకు వెళ్లాడు. అనుకున్నది సాధించాడు. అద్భుతమైన స్కూటర్ తయారు చేశాడు. తండ్రి జ్ఞాపకంగా ఆ స్కూటర్‌పై రయ్ రయ్‌మంటూ దూసుకుపోతున్నాడు. అతనే జీవీఎంసీ 52వ వార్డు శాంతినగర్‌కు చెందిన స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి బి.కె.రమేష్. – గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) సాధారణంగా తుప్పుపట్టిన వస్తువులను పాత సామాన్ల వారికి అమ్మేస్తుంటాం. కానీ తన తండ్రి ఇష్టపడి కొనుక్కున్న లాంబ్రెట్టా మోడల్ లాంబీ 150 స్కూటర్ పూర్తిగా మరమ్మతులకు గురైనా.. రమేష్ దాన్ని విక్రయించాలని అనుకోలేదు. మూలన పడేయనూ లేదు. ఆ కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ స్కూటర్‌ను మళ్లీ కొత్త బండిలా తయారు చేయాలని భావించారు. తానే సొంతంగా బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. డిప్లమో ఇంజినీరింగ్ చేసిన రమేష్ దీన్ని తీర్చిదిద్దడానికి నడుంకట్టారు. సుమారు ఆరేళ్ల పాటు స్కూటర్‌కు కావాల్సిన స్పేర్ పార్ట్స్ కోసం అన్వేషణ సాగించారు. స్కూటర్ల వాడకం కనుమరుగైన కాలంలో.. లాంబీ విడి పార్టుల కోసం నానా పాట్లు పడ్డారు. ఒరిజినల్ పార్ట్స్ కోసం విశాఖపట్నంతో పాటు కర్నాటక, ఢిల్లీ, ముంబయి, కేరళ తదిత ర ప్రాంతాల్లో తిరిగారు. ఇంటర్నెట్ ద్వారా లాంబీ స్కూటర్‌పై అభిమానమున్న వ్యక్తులను కలుసుకొని కొన్ని పార్టులు సంపాదించారు. స్కూటర్ ఆయిల్ ట్యాంక్, ఫోర్కు, ఫోర్క్ బాల్స్ సెట్ తదితర పార్టులు మార్కెట్లో దొరక్క పోవడంతో.. తానే సొంతంగా డిజైన్ చేసి తయారు చేసుకున్నారు. ఇలా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి.. చివరకు స్పేర్ పార్ట్స్ సంపాదించారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఆరు నెలల పాటు శ్రమించి అద్భుతంగా స్కూటర్ తయారు చేశారు. లాంబీ.. ఓ సెంటిమెంట్ ‘లాంబీ స్కూటర్ పార్టుల కోసం తిరుగుతుంటే దీని విలువ తెలిసింది. విశాఖలోనే ఓ పెద్ద షాపు యజమాని ఒకప్పుడు లాంబీ స్కూటర్ స్పేర్ పార్టులు అమ్మేవాడని తెలిసి.. ఆయన్ని కలిశాను. ఆయన దగ్గర ఈ స్కూటర్‌కు సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. ఎంత బతిమలాడినా ఆయన పార్ట్స్ ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే వాటి ద్వారానే ఇంతటి వాడినయ్యానని.. ఆ పార్టులు తనకు సెంటిమెంట్ అని చెప్పారు. నేను తిరిగిన చోట్ల ఇలాంటి వ్యక్తులు చాలా మంది తారసపడ్డారని’ రమేష్ తెలిపారు. నాన్న జ్ఞాపకాలు పదిలం ‘మా నాన్న అప్పలస్వామి ఆర్మీలో పనిచేశారు. ఆయనకు లాంబ్రెట్టా స్కూటరంటే చాలా ఇష్టం. 1971లో తొలిసారిగా లాంబీ స్కూటర్ కొన్నారు. కొన్నాళ్లు దానిపై తిరిగాక.. అమ్మేశారు. ఆ స్కూటర్‌పై మక్కువ తీరక మళ్లీ 1994లో లాంబ్రెట్టా మోడల్ స్కూటర్ కొన్నారు. అదే ఈ స్కూటర్. రిటైర్ అయ్యాక వాడడం మానేశారు. తర్వాత అది పూర్తిగా పాడైంది. దాన్ని పూర్వం మాదిరిగా తయారు చేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు ఆ బండి నడిపారు. ఇప్పుడు ఆ బండిని మరింత మెరుగ్గా తీర్చి దిద్దే పనిలో ఉన్నాను.’ అని రమేష్ వివరించారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం ప్రస్తుతం రమేష్ స్టీల్‌ప్లాంట్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ స్కూటర్ తయారీలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆటో మొబైల్ రంగంలో చాలా విజ్ఞానాన్ని సముపార్జించానని రమేష్ చెబుతున్నారు. ఇంటర్నెట్ ద్వారా, కొందరు మెకానిక్‌లకు సంప్రదించడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్లు వెల్లడించారు. బండికి కావాల్సిన కొత్త వస్తువును తయారు చేసే ముందు ఆ వస్తువుకు సంబంధించి కొలతలన్నీ రాసుకోవడంతో పాటు డయాగ్రమ్ గీసుకునేవారు. ఆ వస్తువు మార్కెట్లో దొరక్కపోతే సొంతంగా తయారు చేసుకునేవారు. అనుభవం వల్లే ఈ విజ్ఞానం సాధించినట్లు చెప్పారు. ఆరు నెలల పాటు స్కూటర్ తయారీలో ప్రతి అంశాన్ని తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసినట్లు వివరించారు. లాంబ్రెట్టా రమేష్ పేరుతో యూట్యూబ్ చానల్లో ఆటో మొబైల్‌కు సంబంధించిన చాలా విషయాలు వివరించినట్లు చెప్పారు. నాన్న సెంటిమెంట్‌ను నిలబెట్టాను ఈ స్కూటర్ మా నాన్నకు ఎంతో ఇష్టమైనది. అరుదైనది. అందుకే దీన్ని బాగు చేశాను. లాంబీ–150 మోడల్ స్కూటర్లు 1977 నుంచి 86 మధ్య కాలంలో మన దేశంలో అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇది ఇటలీ వెర్షన్లో తయారైన బండి. ఒక్కో పార్టును అధిక ధర ఇచ్చి కొనుగోలు చేశాను. రూ.70 ఖరీదు గల లాంబీ–150 మోనోగ్రామ్ రూ.300 ఇచ్చి కొనాల్సి వచ్చింది. పెట్రోల్ ట్యాంకును కేరళలో కొన్నాను. ఇంజిన్లోకి అవసరమయ్యే పార్టులను ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేశాను. దాదాపు రూ.4.50 లక్షలు వెచ్చించి స్కూటర్‌ను తయారు చేశాను. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దేశం మొత్తం మీద 10 లోపు స్కూటర్లు మాత్రమే ఉన్నట్లుగా గుర్తించాను. ఇప్పుడు ఈ బండిపై వెళ్తుంటే ఆరేళ్ల పాటు నేను పడిన కష్టం మర్చిపోతున్నా.. ప్రస్తుతం ఈ స్కూటర్‌ను మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నా. – బి.కె.రమేష్, స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి -
పంజాబ్‌లో బాదల్, ‘కెప్టెన్’ ఆఖరి పోరాటం
రెండు వారాల్లో దాదాపు రెండు కోట్ల ఓటర్లు పంజాబ్ పాలకపక్షం ఏదో నిర్ణయించబోతుండగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంటోంది. అమృత్సర్ లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికతోపాటు 117 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల నాలుగున పోలింగ్ జరుగుతుంది. పదేళ్లుగా ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ చావోరేవో అనే రీతిలో శిరోమణి అకాలీదళ్–బీజేపీ కూటమిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పంజాబ్ గెలుపుతో కాంగ్రెస్ వరుస పరాజయాలకు ముగింపు పలకవచ్చని అధిష్టానం ఆశిస్తోంది. పదిహేనో పంజాబ్ శాసనసభ ఎన్నికల ప్రత్యేకత ఏమంటే, ప్రస్తుత సీఎం, అకాలీ అధ్యక్షుడు ప్రకాశ్‌సింగ్ బాదల్‌తో మాజీ సీఎం, పీసీసీ నేత ‘కెప్టెన్’ అమరీందర్‌సింగ్ ముక్తసర్ జిల్లా లంబీ సీటులో ముఖాముఖి తలపడడం. 2013 డిసెంబర్ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం షీలా దీక్షిత్‌పై ఆమ్ఆద్మీపార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పోటీచేసిన సందర్భాన్ని లంబీ పోటీ గుర్తుచేస్తోంది. పదేళ్లు బీజేపీ అమృత్సర్ ఎంపీగా పనిచేశాక మూడోసారి టికెట్ దక్కకపోయినా రాజ్యసభకు నామినేట్ అయిన ప్రఖ్యాత క్రికెటర్ నవజోత్‌సింగ్ సిద్ధూ ఈసారి కాంగ్రెస్‌లో చేరి అమృత్సర్ ఈస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీచేయడం మరో విశేషం. ఆయనపై పాలక కూటమి తరఫున రాజేష్‌కుమార్ హనీ(బీజేపీ)పోటీచేస్తున్నారు. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో వీవీఐపీ స్థానం జలాలాబాద్‌లో డెప్యూటీ సీఎం, బాదల్ కుమారుడు సుఖ్బీర్సింగ్ బాదల్‌తో సంగ్రూర్ ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ భగవంత్ మాన్ తలపడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం బియాంత్‌సింగ్ మనవడు, లూథియాణా ఎంపీ రవనీత్‌సింగ్ బిట్టూ రంగంలోకి దిగారు. ‘కెప్టెన్’ చివరి ప్రయత్నం 2007 నుంచీ సీఎం పదవిలో ఉన్న బాదల్ తనకు ఇదే చివరి ఎన్నికలని లంబీలో ప్రచారం చేస్తున్నారు. డిసెంబర్లో 89 ఏళ్లు నిండిన బాదల్ వారసునిగా సుఖ్బీర్ వ్యవహరిస్తున్నారు. జ్ఞానీ జైల్‌సింగ్(1972–75) తర్వాత కాంగ్రెస్ తరఫున ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన అమరీందర్ కూడా యువకుడేమీ కాదు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే మార్చి11న ఆయనకు 75 ఏళ్లు నిండుతాయి. పటియాలా ‘రాజ’ కుటుంబంలో గత 150 ఏళ్లలో 70 ఏళ్లు బతికిన వారసులు ఇంతవరకూ లేరు. ఈ లెక్కన ఆ రోజు ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే ఈ పటియాలా మాజీ యువరాజు పుట్టిన రోజును విజయోత్సవంగా జరపాలని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అమరీందర్‌ను కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించవచ్చని తెలుస్తోంది. లంబీలో నామినేషన్ వేసినా సొంతూరు పటియాలా(అర్బన్)నుంచి కూడా ఆయన పోటీచేస్తున్నారు. లంబీలో గెలుపుపై నమ్మకం లేకనే ‘కెప్టెన్’ సురక్షిత స్థానం పటియాలా నుంచి కూడా రంగంలోకి దిగారని అకాలీ–బీజేపీ కూటమి, ఆప్‌లు ఎత్తిపొడుస్తున్నాయి. ఇక్కడ పాలక కూటమి అభ్యర్థిగా ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్ బీజేపీ తరఫున తలపడుతున్నా, ఆయనకు జనాదరణ కనిపించడం లేదు. ఆర్మీ నేపథ్యం ఉన్న ఇద్దరూ వ్యక్తిగత నిందారోపణలకు దిగుతున్నారు. జేజేను జనరల్‌గా పిలవనని అమరీందర్ చెబుతుండగా, ఈ మాజీ కెప్టెన్ రెండు చోట్లా ఓడిపోతారని జేజే సింగ్ జోస్యం చెబుతున్నారు. లంబీలో తాను పోటీచేయడం ద్వారా 68 సీట్లున్న మాల్వా ప్రాంతంలో కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగవుతాయని కూడా ‘కెప్టెన్’ ఆశపడుతున్నారు. బాదల్ కుటుంబంపైనే అందరి గురి పదేళ్లలో బాదల్ కుటుంబం మద్యం, మాదకద్రవ్యాల వ్యాపారులతో కుమ్మక్కయి పంజాబ్‌ను నాశనం చేసిందని కాంగ్రెస్‌తోపాటు, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. హోటళ్లు సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించిన బాదల్ కుటుంబం ఆయా వ్యాపారాల్లో దాదాపు లక్ష కోట్లు సంపాదించిందని శుక్రవారం నవజోత్ సిద్ధూ ఆరోపించారు. వ్యవసాయరంగంలో సంక్షోభం కారణంగా నెలకు 35 మంది రైతులు భాక్రా కెనాల్లోకి దూకి ప్రాణాలు తీసుకుంటున్నారనే అంశం కూడా అకాలీ కూటమి సర్కారును ఇరుకునపెడుతోంది. విజయావకాశాలపై తలో మాట! పాలకపక్షాన్ని ప్రతి ఎన్నికల్లో మార్చే సంప్రదాయాన్ని 2012లో జనం మరిచారు. ఈసారైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఉపకరిస్తుందని పార్టీ నేతలు భావించారు. ఆరు నెలల క్రితమైతే కాంగ్రెస్, అకాలీ కూటమి కన్నా ఆప్ ముందుందని సర్వేలు చెప్పాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆప్ ఆకర్షణ తగ్గిందని కొన్ని పరిణామాలు సూచించాయి. అయినా, కెనడాలో స్థిరపడిన పంజాబీలు దాదాపు 200 మంది ఇక్కడికొచ్చి ఆప్ తరఫున ప్రచారం చేయడం విశేషం. ఆప్‌ను దెబ్బదీసే లక్ష్యంతో కాంగ్రెస్, అకాలీ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆప్‌కు మెజారిటీ వస్తే పంజాబ్ సీఎం కావాలని కేజీవాల్ ఆశిస్తున్నారని అమరీందర్ ప్రచారం చేస్తున్నారు. జనవరి 5న సీఎస్డీఎస్–ఏబీపీ విడుదల చేసిన సర్వేలో అకాలీ కూటమికి మెజారిటీ రాకున్నా ఇతర పక్షాల కన్నా ముందున్నట్టు సూచించగా, ఈ కూటమి, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఇండియా టుడే–యాక్సిస్ సర్వే జోస్యం చెప్పింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
కేజ్రీవాల్.. దమ్ముంటే పోటీకి రా!
-
కేజ్రీవాల్.. దమ్ముంటే పోటీకి రా!
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే ఆయన లంబి నియోజకవర్గంలో పోటీకి రావాలని సవాల్ చేశారు. పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సొంత నియోజకవర్గమైన లంబితోపాటు తన నియోజకవర్గంలోనూ అమరిందర్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, లంబిలో సీఎం బాదల్ విజయాన్ని సుగమం చేసేందుకు అమరిందర్ బరిలోకి దిగారంటూ కేజ్రీవాల్ విమర్శలు చేశారు. ఈ విమర్శలు కొట్టిపారేసిన అమరిందర్ సింగ్ దమ్ముంటే లంబి బరిలోకి కేజ్రీవాల్ కూడా దిగి.. తమపై పోటీ చేయాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సొంతంగానే పంజాబ్ ఎన్నికల్లో గెలుస్తుందని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు. సీఎం అభ్యర్థి విషయంలో కొత్తగా పార్టీలో చేరిన నవజ్యోత్ సింగ్ సిద్ధుతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని ఆయన స్ప ష్టం చేశారు. -
సీఎం, డిప్యూటీ సీఎం స్థానాలు ఖరారు
చండీగఢ్: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీల్లో హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు ఎక్కడెక్కడి నుంచి బరిలోకి దిగుతారనే దానిపై స్పష్టత వస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్.. లాంబీ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని అకాళీదల్ పార్టీ గురువారం వెల్లడించింది. పంజాబ్, గోవాల్లో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 11న పంజాబ్, గోవా ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది.