పంజాబ్‌లో బాదల్, ‘కెప్టెన్‌’ ఆఖరి పోరాటం | Captain Amarinder to fight Badal from Lambi | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో బాదల్, ‘కెప్టెన్‌’ ఆఖరి పోరాటం

Published Sat, Jan 21 2017 11:06 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

పంజాబ్‌లో బాదల్, ‘కెప్టెన్‌’ ఆఖరి పోరాటం - Sakshi

పంజాబ్‌లో బాదల్, ‘కెప్టెన్‌’ ఆఖరి పోరాటం

రెండు వారాల్లో దాదాపు రెండు కోట్ల ఓటర్లు పంజాబ్‌ పాలకపక్షం ఏదో నిర్ణయించబోతుండగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంటోంది. అమృత్‌సర్‌ లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికతోపాటు 117 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల నాలుగున పోలింగ్‌ జరుగుతుంది. పదేళ్లుగా ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్‌ చావోరేవో అనే రీతిలో శిరోమణి అకాలీదళ్‌–బీజేపీ కూటమిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. పంజాబ్‌ గెలుపుతో కాంగ్రెస్‌ వరుస పరాజయాలకు ముగింపు పలకవచ్చని  అధిష్టానం ఆశిస్తోంది.

పదిహేనో పంజాబ్‌ శాసనసభ ఎన్నికల ప్రత్యేకత ఏమంటే, ప్రస్తుత సీఎం, అకాలీ అధ్యక్షుడు ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌తో మాజీ సీఎం, పీసీసీ నేత ‘కెప్టెన్‌’ అమరీందర్‌సింగ్‌ ముక్తసర్‌ జిల్లా లంబీ సీటులో ముఖాముఖి తలపడడం. 2013 డిసెంబర్‌ దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం షీలా దీక్షిత్‌పై ఆమ్‌ఆద్మీపార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ పోటీచేసిన సందర్భాన్ని లంబీ పోటీ గుర్తుచేస్తోంది. పదేళ్లు బీజేపీ అమృత్‌సర్‌ ఎంపీగా పనిచేశాక మూడోసారి టికెట్‌ దక్కకపోయినా రాజ్యసభకు నామినేట్‌ అయిన ప్రఖ్యాత క్రికెటర్‌ నవజోత్‌సింగ్‌ సిద్ధూ ఈసారి కాంగ్రెస్‌లో చేరి అమృత్‌సర్‌ ఈస్ట్‌ నుంచి అసెంబ్లీకి పోటీచేయడం మరో విశేషం. ఆయనపై పాలక కూటమి తరఫున రాజేష్‌కుమార్‌ హనీ(బీజేపీ)పోటీచేస్తున్నారు. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మరో వీవీఐపీ స్థానం జలాలాబాద్‌లో డెప్యూటీ సీఎం, బాదల్‌ కుమారుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌తో సంగ్రూర్‌ ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీ భగవంత్‌ మాన్‌ తలపడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ సీఎం బియాంత్‌సింగ్‌ మనవడు, లూథియాణా ఎంపీ రవనీత్‌సింగ్‌ బిట్టూ రంగంలోకి దిగారు.

‘కెప్టెన్‌’ చివరి ప్రయత్నం
2007 నుంచీ సీఎం పదవిలో ఉన్న బాదల్‌ తనకు ఇదే చివరి ఎన్నికలని లంబీలో ప్రచారం చేస్తున్నారు. డిసెంబర్‌లో 89 ఏళ్లు నిండిన బాదల్‌ వారసునిగా సుఖ్‌బీర్‌ వ్యవహరిస్తున్నారు. జ్ఞానీ జైల్‌సింగ్‌(1972–75) తర్వాత కాంగ్రెస్‌ తరఫున ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించిన అమరీందర్‌ కూడా యువకుడేమీ కాదు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే మార్చి11న ఆయనకు 75 ఏళ్లు నిండుతాయి. పటియాలా ‘రాజ’ కుటుంబంలో గత 150 ఏళ్లలో 70 ఏళ్లు బతికిన వారసులు ఇంతవరకూ లేరు. ఈ లెక్కన ఆ రోజు ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే ఈ పటియాలా మాజీ యువరాజు పుట్టిన రోజును విజయోత్సవంగా జరపాలని కాంగ్రెస్‌ నేతలు ఆశిస్తున్నారు.  ఒకట్రెండు రోజుల్లో అమరీందర్‌ను కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా ప్రకటించవచ్చని తెలుస్తోంది.

లంబీలో నామినేషన్‌ వేసినా సొంతూరు పటియాలా(అర్బన్‌)నుంచి కూడా ఆయన  పోటీచేస్తున్నారు. లంబీలో గెలుపుపై నమ్మకం లేకనే ‘కెప్టెన్‌’ సురక్షిత స్థానం పటియాలా నుంచి కూడా రంగంలోకి దిగారని అకాలీ–బీజేపీ కూటమి, ఆప్‌లు ఎత్తిపొడుస్తున్నాయి. ఇక్కడ పాలక కూటమి అభ్యర్థిగా ఆర్మీ మాజీ చీఫ్‌ జేజే సింగ్‌ బీజేపీ తరఫున తలపడుతున్నా, ఆయనకు జనాదరణ కనిపించడం లేదు. ఆర్మీ నేపథ్యం ఉన్న ఇద్దరూ వ్యక్తిగత నిందారోపణలకు దిగుతున్నారు. జేజేను జనరల్‌గా పిలవనని అమరీందర్‌ చెబుతుండగా, ఈ మాజీ కెప్టెన్‌ రెండు చోట్లా ఓడిపోతారని జేజే సింగ్‌ జోస్యం చెబుతున్నారు. లంబీలో తాను పోటీచేయడం ద్వారా 68 సీట్లున్న మాల్వా ప్రాంతంలో కాంగ్రెస్‌ విజయావకాశాలు మెరుగవుతాయని కూడా ‘కెప్టెన్‌’ ఆశపడుతున్నారు.

బాదల్‌ కుటుంబంపైనే అందరి గురి
పదేళ్లలో బాదల్‌ కుటుంబం మద్యం, మాదకద్రవ్యాల వ్యాపారులతో కుమ్మక్కయి పంజాబ్‌ను నాశనం చేసిందని కాంగ్రెస్‌తోపాటు, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. హోటళ్లు సహా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించిన బాదల్‌  కుటుంబం ఆయా వ్యాపారాల్లో దాదాపు లక్ష కోట్లు సంపాదించిందని శుక్రవారం నవజోత్‌ సిద్ధూ ఆరోపించారు. వ్యవసాయరంగంలో సంక్షోభం కారణంగా నెలకు 35 మంది రైతులు భాక్రా కెనాల్‌లోకి దూకి ప్రాణాలు తీసుకుంటున్నారనే అంశం కూడా అకాలీ కూటమి సర్కారును ఇరుకునపెడుతోంది.

విజయావకాశాలపై తలో మాట!
పాలకపక్షాన్ని ప్రతి ఎన్నికల్లో మార్చే సంప్రదాయాన్ని 2012లో జనం మరిచారు. ఈసారైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఉపకరిస్తుందని పార్టీ నేతలు భావించారు. ఆరు నెలల క్రితమైతే కాంగ్రెస్, అకాలీ కూటమి కన్నా ఆప్‌ ముందుందని సర్వేలు చెప్పాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆప్‌ ఆకర్షణ తగ్గిందని కొన్ని పరిణామాలు సూచించాయి. అయినా, కెనడాలో స్థిరపడిన పంజాబీలు దాదాపు 200 మంది ఇక్కడికొచ్చి ఆప్‌ తరఫున ప్రచారం చేయడం విశేషం. ఆప్‌ను దెబ్బదీసే లక్ష్యంతో కాంగ్రెస్, అకాలీ కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆప్‌కు మెజారిటీ వస్తే పంజాబ్‌ సీఎం కావాలని కేజీవాల్‌ ఆశిస్తున్నారని  అమరీందర్‌ ప్రచారం చేస్తున్నారు. జనవరి 5న సీఎస్‌డీఎస్‌–ఏబీపీ విడుదల చేసిన  సర్వేలో అకాలీ కూటమికి మెజారిటీ రాకున్నా ఇతర పక్షాల కన్నా ముందున్నట్టు సూచించగా, ఈ కూటమి, కాంగ్రెస్‌ మధ్య  తీవ్ర పోటీ ఉంటుందని ఇండియా టుడే–యాక్సిస్‌ సర్వే జోస్యం చెప్పింది.
(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement