సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ చట్ట నిబంధనల ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన అన్ని శాఖల్లో సోదాలు చేయవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 46 ప్రకారం చిట్ పుస్తకాలు, రికార్డులను తనిఖీ చేసే అధికారం రిజిస్ట్రార్‌కు ఉందని తెలిపింది. అలాగే ప్రభుత్వం నియమించే అధీకృత అధికారి కూడా పని వేళలు లేదా పని దినాల్లో నోటీసు ఇచ్చి లేదా నోటీసు ఇవ్వకుండా తనిఖీలు చేయవచ్చని చెప్పింది. మార్గదర్శి రోజూవారీ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సోదాలు చేయొచ్చని, ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను గౌరవించాలని తెలిపింది.
చట్ట నిబంధనలకు అనుగుణంగా తప్ప, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఎలాంటి సోదాలు నిర్వహించడానికి వీల్లేదంది. సీఐడీ లేదా ఇతర అధి కారులు సోదాల పేరుతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యా పార కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించడానికి వీల్లేదని చెప్పింది. డిప్యూటీ రిజిస్ట్రార్ కొందరికి ఆథరైజేషన్ ఇవ్వడం చిట్స్ ఇన్‌స్పెక్టర్ల నియామకం కిందకు రాదని పేర్కొంది. అలాంటి ఆథరైజేషన్ అనుమతించదగ్గదా కాదా అన్న విషయాన్ని లోతుగా విచారిస్తామంది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమ సంస్థకు చెందిన అన్ని శాఖల్లో చిట్ రిజిస్ట్రార్లు చేస్తున్న సోదాలను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోదాల నిమిత్తం జారీ చేసిన ప్రొసీ డింగ్స్‌ను స్టే చేయడంతో పాటు తమ సంస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ అనుబంధ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య రెండు రోజుల క్రితం మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ వాదనలు విని తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. బుధవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరిస్తూ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ శాఖల్లో సోదాలను నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే చట్ట ప్రకారం సోదాలు చేసేందుకు అనుమతినిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment