సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ముగిసే ఫిబ్రవరి 21వ తేదీ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని 243 కె నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనకు ఉన్న విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని చెప్పారు. ఈ ఆదేశాల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
► శుక్రవారం తిరుపతిలో విలేకరుల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలపై రాజకీయ పార్టీలు, సాధారణ పౌరుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. మంత్రి మాటలు ఓటర్ల మనసులో భయాందోళనలు సృష్టించాయి.
► మంత్రి వ్యాఖ్యలు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వతంత్రతను బెదిరించడం కిందకు వస్తుంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యలున్నాయి.
► అత్యున్నత పదవిలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి ఉద్దేశ పూర్వకంగానే చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఉంది. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది.
► జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు స్వేచ్ఛాయుతంగా, న్యాయపరంగా సజావుగా ఎన్నికలు నిర్వహించడానికే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నా.
► వైద్య సహాయం తీసుకోవడానికి, ఇతర సహేతుక కారణాల తెలిపిన సందర్భాలలో ఈ ఆంక్షలు వర్తించవు. అలాంటి సందర్భాల్లోనూ మంత్రిని మీడియాకు, అతని మద్దతు దారులకు, అనుచరులకు దూరంగా ఉంచాలి. మంత్రిగా అధికార పత్రాలను పరిశీలించవచ్చు. ఈ ఆదేశాలు కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే. పరివర్తన, పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆదేశాలపై భవిష్యత్‌లో పునరాలోచన చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉంటుంది.
రిటర్నింగ్ అధికారులకు రక్షణ
ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులు అభద్రతా భావనకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరు ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారని పేర్కొన్నారు. వీరిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలన్నా ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి విధిగా తీసుకోవాలన్నారు. బెదిరింపు ప్రకటనలను ఎంతటి పెద్దవారు ఇచ్చినా లెక్క పెట్టవలసిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment