సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతినివ్వాలని హైకోర్టును రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) అభ్యర్థించింది. కౌంటింగ్, ఫలితాల ప్రకటనను పూర్తి చేసి, ఆ తరువాత ఎంపీపీ, జెడ్పీపీపీల కోఆప్టెడ్ సభ్యులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికను కూడా పూర్తి చేస్తామని, దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణమవుతుందని వివరించింది. వీలైనంత త్వరగా కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపడితే మేలన్న ఉద్దేశంతోనే ఈ అభ్యర్థన చేస్తున్నామంది. కోవిడ్ సెకండ్ వేవ్ సవాలు విసురుతోందని, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బ్యాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామంది.
గతంలో టీడీపీ నేత వర్ల రామయ్య, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో ఎన్నికల కమిషన్ కార్యదర్శి కె.కన్నబాబు గురువారం పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నియమావళి విషయంలో టీడీపీ, జనసేన నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. పూర్తిస్థాయి వాదనల నిమిత్తం న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. కాగా, వర్ల రామయ్య, చిల్లపల్లి శ్రీనివాసరావు పిటిషన్లను గతంలో విచారించిన సింగిల్ జడ్జి.. ఎన్నికలను వాయిదా వేయాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఆ తీర్పుపై ఎస్‌ఈసీ ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపడానికి ధర్మాసనం అనుమతిచ్చిన విషయం విదితమే. అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దని ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో ఎస్‌ఈసీ తన కౌంటర్‌లో ఫలితాల ప్రకటనకు అభ్యర్థించింది. ఎన్నికలను ఆపాలనే లక్ష్యంతోనే టీడీపీ నేత పిటిషన్ దాఖలు చేశారని, దానిని కొట్టివేయాలని కన్నబాబు కౌంటర్‌లో అభ్యర్థించారు. ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల కాపీని పరిశీలన నిమిత్తం తమ ముందుంచాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది సన్నపురెడ్డి వివేక్ చంద్రశేఖర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే బీజేపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కూడా ఈ వ్యాజ్యాలకు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
చదవండి:
టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు
ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెమార్పిడి
Comments
Please login to add a commentAdd a comment