సచివాలయాల సిబ్బంది చేతివాటం | Secretariat Employee Suspended In Andhra Pradesh For Stealing Pension Money, More Details Inside | Sakshi
Sakshi News home page

సచివాలయాల సిబ్బంది చేతివాటం

Published Tue, Jul 2 2024 3:28 AM | Last Updated on Tue, Jul 2 2024 10:48 AM

Secretariat Employee Suspended in andhra pradesh

పలుచోట్ల పింఛన్ల డబ్బు మాయం

కొన్నిచోట్ల రూ.500, రూ.1,000 మినహాయించుకున్న సిబ్బంది

ప్రొద్దుటూరు క్రైం/మాచర్ల/రాప్తాడు/కుక్కునూరు/చీపురుపల్లి/పాలకొల్లు అర్బన్‌: పింఛన్ల పంపిణీలో తొలి రోజే సచివాలయాల సిబ్బంది చేతివాటం చూపారు. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు 7వ వార్డు సచివాలయంలో మురళీమోహన్‌ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. సోమవారం పింఛన్‌ పంపిణీ చేసేందుకు అధికారులు అతడికి రూ.4 లక్షలు ఇచ్చారు. ఈ క్రమంలో అతడికి రోడ్డు ప్రమాదం జరిగి కింద పడిపోగా 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథరెడ్డి త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తమదైన స్టైల్‌లో మురళీమోహన్‌ను విచారించగా ఆ డబ్బును అతడే వాడుకున్నట్లు తేలింది. దీంతో అతడిని సస్పెండ్‌ చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు సచివాలయ కార్యదర్శి–2 బి.రాము పింఛన్ల డబ్బు రూ.2,50,500 తీసుకుని పరారయ్యాడు. అతడి ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉండటంతో పంచాయతీ కార్యదర్శి రాజేష్‌ సోమవారం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం కర్లాం సచివాలయంలో వ్యవసాయ సహాయకునిగా పని చేస్తున్న రాఘవకు పింఛన్ల పంపిణీ చేయమని అధికారులు రూ.3.96 లక్షలు అందజేశారు.

అయితే రాఘవ ఆ డబ్బుతో మాయమయ్యాడు. అలాగే ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్లలో పింఛన్లు పంపిణీ చేసే బాధ్యతలను ఉప్పేరు పంచాయతీలో వెటర్నరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సంకు ప్రసాద్‌కు అధికారులు అప్పగించారు. అతడు పింఛన్లు పంపిణీకి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగి స్వగ్రామమైన చింతలపూడి మండలం సీతానగరానికి వెళ్లిన అధికారులకు అతడు గాయాలతో ఇంటి వద్దే కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

పల్నాడు జిల్లా మాచర్ల తొమ్మిదో వార్డుకు చెందిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ముడావత్‌ వాల్యూనాయక్‌ ఒక్కో లబ్ధిదారుకు రూ.7 వేలు చొప్పున అందించాల్సి ఉండగా.. ఒక్కొక్క లబి్ధదారు నుంచి రూ.500 చొప్పున వసూలు చేశాడు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసుకు ఫిర్యాదులు రావడంతో ఆయన వాల్యూ నాయక్‌ను సస్పెండ్‌ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తిలో పింఛన్ల లబి్ధదారులకు రూ.7 వేలు చొప్పున పంపిణీ చేయాల్సి ఉండగా..  గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసులు దాదాపు 20 మందికి రూ.6 వేలే ఇచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement