సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీరు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో ప్రజలకు పాలన ఎంతో చేరువైంది. ఇక మీదట ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయి. వాట్సాప్‌లో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సూచించే మొబైల్ నెంబరుకు కేవలం ‘హాయ్’ అని మేసెజ్ చేస్తే చాలు.. సచివాలయంలో మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం ఇట్టే అందుతుంది.
అలాగే, ‘నవరత్నాల’ పేరిట ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హులేనా.. లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారన్న సమాచారం కూడా తెలిసిపోతుంది. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తమ అధికారిక ప్రభుత్వ సేవల పోర్టల్‌లో అవసరమైన మార్పులకు కసరత్తు చేస్తోంది. దీనికితోడు.. ఈ సేవల కోసమే ఒక మొబైల్ నంబరును కేటాయించి ఆ నంబరుకు ఎవరైనా కేవలం మెసేజ్ చేస్తే చాలు.. ఈ సేవలు పొందవచ్చు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ అకౌంట్‌ను ఇప్పటికే తెరిచినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు వెల్లడించారు.
ఉదా.. ఎవరైనా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సేవల కోసం గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకుంటే.. సంబంధిత అధికారుల ఆమోదం అనంతరం ఆ సమాచారం వాట్సాప్ ద్వారా దరఖాస్తుదారుడి మొబైల్ నెంబరుకు ఇవ్వడంతోపాటు ఆయా ధ్రువీకరణ పత్రాలను కూడా మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని నెలన్నర రోజులుగా అమలుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ సేవల్లో సువర్ణాధ్యాయం..
నాలుగేళ్ల క్రితం.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్నపని ఉన్నా మండల, జిల్లా ఆఫీసుల చుట్టూ నెలలు, ఏళ్ల తరబడి తిరగాల్సి వచ్చేది. అన్ని అర్హతలు ఉండి పింఛను లేదా రేషన్‌కార్డు లేదా మరోదాని కోసం కొత్తగా దరఖాస్తు చేసుకుంటే.. అదెప్పుడు మంజూరవుతుందో తెలీని దుస్థితి. పైగా మంజూరు కాకపోతే ఎందుకు కాలేదో కూడా చెప్పే దిక్కుండదు. సరైన సమాచారమిచ్చే నాథుడేలేక దరఖాస్తుదారునికి చుక్కలు కనిపించేవి.
కానీ, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వలంటీరు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటవడంతో పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ ప్రజలందరికీ వారివారి సచివాలయంలోనే ప్రభుత్వ సేవలన్నీ అందుబాటులోకి వచ్చాయి. పింఛన్లు, రేషన్ల పంపిణీ వంటివి అయితే లబ్ధిదారుల గడప వద్దే అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలుచేస్తున్నా ఆ పథకం అర్హుల వివరాలతో పాటు, తిరస్కరణకు గురైన వారి వివరాలు, ఎందుకు తిరస్కరణకు గురయ్యాయన్న సమాచారాన్ని నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నారు.
రానున్న రోజుల్లో ఆ సమాచారమంతా వాట్సాప్‌లోనూ..
ఇక వాట్సాప్ ద్వారా కూడా గ్రామ, వార్డు సచివాలయాల సేవలు పూర్తిస్థాయిలో అమలుచేసే విధానం అమలులోకి వస్తే.. సచివాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచే సమాచారం కూడా ప్రజలు వాట్సాప్ ద్వారా తెలుసుకునే వీలు ఏర్పడుతుందని ఆ అధికారులు తెలిపారు. అదెలాగంటే.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సూచించే వాట్సాప్ నెంబరుకు కేవలం ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే చాలు.. ఆ సమయంలో పథకాల పేర్లు వాట్సాప్ మెసేజ్‌లో ప్రత్యక్షమవుతాయి.
తాము తెలుసుకోదలిచిన పథకం ఎంపిక చేసుకుని ఎవరికి వారు తమ ఆధార్ నెంబరు నమోదుచేస్తే అర్హుల జాబితాలో తమ పేరు ఉందో లేదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అనర్హులుగా పేర్కొంటే ఆ వివరాలు కూడా ఆ సమాచారంలో తెలుస్తాయి. దీనికితోడు.. పింఛను, రేషన్‌కార్డు వంటి వాటితో ఏవైనా ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే అది ఏ అధికారి పరిశీలనలో ఉందన్న సమాచారం ఆ దరఖాస్తుదారునికి వాట్సాప్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment