ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో పెచ్చరిల్లిన పెత్తందారీ వ్యవస్థను సీఎం జగన్ సమూలంగా పెకలించివేశారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అంటరానివారుగా చిత్రీకరించి పెత్తందార్ల కాళ్ల కింద ఉంచితే, సీఎం జగన్ అదే పేదలకు పట్టం కట్టారని తెలిపారు.
కావలిలో గురువారం నిర్వహించిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు విపరీతమైన అహంకారంతో మత్స్యకారులను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు. మత్స్యకారుల తోకలు కత్తిరిస్తానని, ఎస్సీ, ఎస్టీలుగా ఎవరూ పుట్టాలని కోరుకోరని బహిరంగంగా అవమానించడంతో పాటు బీసీలు జడ్జీలుగా పనికిరారని ఏకంగా లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు అని తెలిపారు.
ఆయన పదవీ కాలంలో పేదలకు, అట్టడుగు వర్గాలకు పనికివచ్చేలా ఒక్క పనీ చేయలేదన్నారు. జన్మభూమి కమిటీలనే అసాంఘిక శక్తులను పేదల నెత్తిన పెట్టి స్వైరవిహారం చేయించాడని అన్నారు. ప్రజలు బాబు పాలనను ఛీకొట్టి, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అధికారం అప్పగించిన తరువాత పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్పారు. రేషన్‌కార్డు, పింఛను, ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు ఏది కావాలన్నా అర్హత ఉంటే చాలు నేరుగా వలంటీర్లు ఇళ్ళ వద్దకు వెళ్ళి అందిస్తున్నారని, ఈ ఘనత సీఎం జగన్‌దేనని చెప్పారు.
కావలిలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం
సామాజిక న్యాయానికి రోల్ మోడల్ జగన్ : ఎంపీ మస్తాన్‌రావు
సామాజిక న్యాయానికి, సాధికారతకు సీఎం వైఎస్ జగన్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. ఎనిమది మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలు ఉన్నారన్నా, కేబినెట్‌లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారంటే అందుకు జగన్‌మోహన్ రెడ్డి దార్శనికతే కారణమన్నారు.
అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత సీఎం జగన్‌దే: జూపూడి ప్రభాకర్
రాష్ట్రంలో అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని అందలం ఎక్కించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే సాధ్యమైందని ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వ హయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అధికార మదంతో అణగదొక్కితే.., సీఎం జగన్ మాత్రం ఈ వర్గాలను ఆదరించి, అభివృద్ధిలోకి తెస్తున్నారని తెలిపారు.
జగన్‌తోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం సీఎం జగన్‌తోనే ప్రారంభమైందని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌ను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
కనకపట్నంగా మారనున్న కావలి: ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి
సీఎం వైఎస్ జగన్ పాలనలో కావలి కనకపట్నంగా మారనుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి అన్నారు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దామవరం ఎయిర్‌పోర్టులతో నియోజకవర్గం రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. పారిశ్రామిక ప్రగతి కూడా ఊపందుకుంటుందని వివరించారు.
21న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రారంభం
మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈనెల 21న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి అప్పలరాజు అన్నారు. ఈ హార్బర్ అందుబాటులోకి వచ్చిన తరువాత మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయన్నారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, సామాజిక సాధికార బస్సు యాత్రలకు వస్తున్న స్పందనను చూసి టీడీపీ, ఆపార్టీకి వంతపాడుతున్న పచ్చమీడియాకు నిద్రపట్టడం లేదన్నారు.
పేదల సంక్షేమమే సీఎం జగన్ అజెండా: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు పేదల సంక్షేమమే ఏకైక అజెండాగా వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తెలిపారు. రాష్ట్రంలో సామాజిక సాధికారతతో పాటు సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజలంతా అండగా నిలిచి, రానున్న ఎన్నికల్లో 175 స్థానాలను బహుమానంగా అందించాలని ప్రజలను ఆయన కోరారు. వెనుకబడిన వర్గాలు ఎల్లవేళలా మంచిగా ఉండాలంటే మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి కావాలని హఫీజ్‌ఖాన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment