సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైనవారి జాబితాను రాష్ట్ర పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటించింది. అత్యంత పారదర్శకంగా అభ్యర్థుల ప్రతిభ, రిజర్వేషన్ల ప్రకారం సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 411 ఎస్‌ఐ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. 315 సివిల్ ఎస్‌ఐ (పురుషులు, మహిళలు), 96 ఏపీఎస్పీ ఎస్‌ఐ (పురుషులు) పోస్టులకు రాత పరీక్షల ఫలితాల అనంతరం నాలుగు జోన్ల వారీగా మెరిట్ జాబితాను ప్రకటించింది. సివిల్ ఎస్‌ఐ పోస్టులకు ఏకంగా 102 మంది మహిళలు ఎంపికవ్వడం విశేషం. మొత్తం సివిల్ ఎస్‌ఐ పోస్టులకు సంబంధించి విశాఖపట్నం జోన్‌లో 50, ఏలూరులో 105, గుంటూరులో 55, కర్నూలులో 105 మందిని ఎంపిక చేశారు.
టాపర్లు వీరే..
సివిల్ ఎస్‌ఐ పురుషుల విభాగంలో గోనబోయిన విజయభాస్కరరావు (రి.నం. 5033539) 400 మార్కులకు గాను 284 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. ఈయన ఏలూరు జోన్‌కు ఎంపికయ్యారు. మహిళల్లో లోగిసా కృష్ణవేణి (రి.నం.5052468) 273 మార్కులతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఏపీఎస్పీ విభాగంలో రానెల్లి కోటారావు (రి.నం.5036787) 300 మార్కులకు గాను 190.5 మార్కులతో ప్రథమ స్థానం సాధించారు.
త్వరలో పోలీసు నియామక మండలి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతోపాటు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేపట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్థులకు అనంతపురంలోని ఏపీ పోలీసు అకాడమీలో శిక్షణ ఇవ్వనుంది. సంక్రాంతి తర్వాత శిక్షణ ఉండొచ్చని పోలీసు నియామక మండలి తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ప్రతిభ, రోస్టర్ ప్రకారం..
రాష్ట్రంలో 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ ఇవ్వగా 1,73,047 దరఖాస్తులు వచ్చాయి. 1,40,453 మంది పురుషులు, 32,594 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 1,51,288 మంది పరీక్ష రాస్తే 57,923 మంది (38.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 31,193 మంది తుది రాత (మెయిన్స్) పరీక్షకు ఎంపికయ్యారు. అక్టోబర్ 14, 15 తేదీల్లో తుది పరీక్ష జరగ్గా ఈ నెల 6న ఫలితాలు విడుదలయ్యాయి.
ఇందులో 18,637 మంది అర్హత సాధించారు. వీరిలో ప్రతిభావంతుల జాబితాను రూపొందించి రోస్టర్ ప్రకారం మెరిట్‌లో నిలిచిన 411 మంది అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎస్‌ఐ పోస్టులకు ఎంపిక చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌తో పాటు ప్రత్యేక కోటా రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల తుది ఎంపికలు చేపట్టింది. పోలీస్ ఎగ్జిక్యూటివ్ (పీఈ)కు 2 శాతం, ఎన్‌సీసీకి 3 శాతం, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ (ఎంఎస్‌పీ)కు 2 శాతం, పోలీసు సిబ్బంది పిల్లలు (సీపీపీ)కు 2 శాతం, సీడీఐకి 2 శాతం, పోలీసు మినిస్టీరియల్ (పీఎం)కు 1 శాతం రిజర్వేషన్ కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment