సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే పని అన్నట్టు ఈనాడు రామోజీరావు తప్పుడు రాతలు మానడం లేదు. ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ భూతద్దం పెట్టి వెతకడం.. అందులో ఏమీ దొరక్కపోయినా తన విష పుత్రిక ‘ఈనాడు’లో విషం జిమ్మడం రామోజీకి నిత్యకృత్యంగా మారింది.
ఈ కోవలోనే వాస్తవాలను వక్రీకరించి ‘ఉన్నత విద్యలో గాడి తప్పిన క్యాలెండర్’ అంటూ శనివారం ‘ఈనాడు’లో దుష్ప్రచారానికి దిగారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా రంగాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టింది.
అయితే చంద్రబాబు అనే గుడ్డి గుర్రానికి పళ్లు తోమడమే పనిగా పెట్టుకున్న రామోజీకి ప్రభుత్వం చేసిన మంచి పనులు కనిపించడం లేదు. పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అన్నట్టు ప్రభుత్వం ఏం చేసినా తప్పే.. ఏం చేయకపోయినా తప్పే అనే రీతిలో అడ్డగోలు రాతలకు దిగజారుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనాడు కథనానికి సంబంధించి వాస్తవాలు ఇవిగో..
కరోనాతో దెబ్బతిన్నషెడ్యూల్ సాధారణ స్థితికి..
కరోనా కాలంలో దాదాపు పదినెలల విద్యా సంవత్సరాన్ని కోల్పోయినా గత రెండేళ్లలో ఆ కాలాన్ని క్రమబద్ధీకరించి రాష్ట్రంలో విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వం సాధారణ స్థితికి తెచ్చింది. ప్రస్తుతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాల ప్రక్రియ నడుస్తోంది. తెలంగాణలోనూ ఇప్పుడే పలు కోర్సులకు ప్రవేశాల ప్రక్రియ చేపట్టారు. వాస్తవం ఇలా ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నత విద్యలో క్యాలెండర్ గాడి తప్పిందని రామోజీ దుష్ప్రచారానికి దిగారు.
వాస్తవానికి విద్యార్థులు రాష్ట్రంలో పలు సెట్స్ రాసినా వారి మొదటి ప్రాధాన్యత సెంట్రల్ యూనివర్సిటీలకే ఉంటుంది. దీంతో విద్యార్థులు మంచి అవకాశాలు కోల్పోరాదన్న భావనతో ఏపీ పీజీఈ సెట్ కౌన్సెలింగ్‌ను ఆగస్టు 11న చేపట్టారు, సెప్టెంబర్ 6న ఐసెట్, 11న పీజీసెట్, 26న లాసెట్, 30న ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని గతంలోనే షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో కూడా టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 6న, టీఎస్ పీజీసెట్‌ను మూడో వారంలో నిర్వహించనున్నారు. పలు సెంట్రల్ యూనివర్సిటీలు కూడా సెప్టెంబర్‌లోనే ప్రవేశ ప్రక్రియ చేపట్టబోతున్నాయి. అందుకు అనుగుణంగా ఏపీ సెట్స్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోనే అనర్థం జరిగిపోతోందంటూ రామోజీ తనకలవాటైన రీతిలో ఏడుపు లంకించుకున్నారు.
యూజీసీ నిబంధనలు పట్టవా రామోజీ?
మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యపై బురద చల్లడమే ‘ఈనాడు’ పనిగా పెట్టుకుంది. సజావుగా జరుగుతున్న కార్యక్రమాలను కూడా తీవ్ర అపరాధంగా చిత్రీకరించేందుకు నానా అగచాట్లు పడుతోంది. ఇలాగే ఆర్–సెట్ విషయంలోనూ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేసింది.
యూజీసీ.. పీహెచ్‌డీ ప్రవేశాల నిబంధనలను మార్చడంతో మన ఆర్–సెట్ జీవో కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. ముందుగా జేఆర్‌ఎఫ్ అభ్యర్థుల అడ్మిషన్స్ పూర్తి చేశాకే రాష్ట్ర సెట్ ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఒక జాప్యంగా ‘ఈనాడు’ చూపడం ప్రభుత్వంపై బురద చల్లడంలో భాగమే.
ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పైనా వ్యంగ్యమేనా?
అడ్మిషన్స్ ప్రక్రియకు ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేస్తూ ‘ఈనాడు’ తన కుత్సిత బుద్ధిని చాటుకుంది. ముఖ్యమంత్రి దూరదృష్టితో ఎమర్జింగ్ టెక్నాలజీస్‌పై దిశానిర్దేశం చేస్తే దాన్ని కూడా వ్యంగ్యానికి వాడుకోవడం రామోజీకే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతతో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. గత నాలుగేళ్లలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై గతంలో ఏ ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయలేదు.
మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ.. ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వస్తున్న మంచి పేరును దెబ్బతీసే ప్రక్రియలో భాగంగానే ‘ఈనాడు’ ఇలాంటి విష ప్రచారానికి దిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈ రెండింటి మధ్య సమన్వయం లేదని రామోజీ తీర్మానించేశారు.
రెండేళ్లుగా విద్యార్థులు సాధించిన సర్టిఫికేషన్ ఇంటర్న్‌షిప్స్, కమ్యూనిటీ ప్రాజెక్టులు ప్లేస్‌మెంట్స్ సమన్వయానికి నిదర్శనాలుగా నిలుస్తున్నా ఆయన పచ్చ కళ్లకు కనిపించడం లేదు. దేశమంతా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా వ్యవస్థని మెచ్చుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాలు మన పథకాలను అమలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ రామోజీ మాత్రం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment