సాక్షి, అమరావతి: పండగ వేళ కొత్త కారు కొందామనుకుంటున్నారా.. ఆ కారును మీరు నడపాలంటే కనీసం 6 నుంచి 20 నెలల పాటు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు కొత్త కారు బుక్ చేస్తే కనీసం ఆరు నెలలు దాటితే కానీ డెలివరీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గతేడాది కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో చైనాలో తలెత్తిన సెమీ కండక్టర్ చిప్‌ల కొరత ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేస్తోంది. దీంతో దసరా–దీపావళి సీజన్ అమ్మకాలపై భారీగా అంచనాలు పెట్టుకున్న రాష్ట్ర ఆటోమొబైల్ డీలర్ల ఆశలు అడియాసలయ్యాయి. ఆటోమొబైల్ అమ్మకాల్లో దసరా–దీపావళి సీజన్ అత్యంత కీలకమైనది. ఏడాది మొత్తం మీద జరిగే అమ్మకాల్లో 40 శాతం ఈ సీజన్‌లో జరుగుతాయి.
50 శాతం అమ్మకాలూ కష్టమే..
గతేడాది జరిగిన కార్ల విక్రయాల్లో కనీసం 50 శాతం కూడా చేరుకోలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని డీలర్లు చెబుతున్నారు. గతేడాది దసరా–దీపావళి పండుగ సీజన్‌లో కుశలవ హ్యూందాయ్ నాలుగు జిల్లాల్లో 570 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది 400 మార్కును అందుకోవడం కూడా కష్టంగా కనిపిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ బి.వెంకటరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. చిప్‌ల కొరత కారణంగా కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేయడంతో సరఫరా నిలిపోయిందని, దీంతో ఈ సీజన్‌కు 200 కార్లను మించి సరఫరా చేయలేమని హ్యూందాయ్ సంస్థ చెబుతోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
హ్యూందాయ్‌లో మంచి డిమాండ్ ఉన్న క్రెటా వంటి మోడల్స్‌కు వెయిటింగ్ పీరియడ్ 9–10 నెలలకు పెరిగిపోయిందన్నారు. అలాగే క్రెటా డీజిల్ వెర్షన్‌తో పాటు కొన్ని మోడల్స్‌పై బుకింగ్‌ను నిలిపివేసినట్టు తెలిపారు. గతేడాది వరుణ్ మారుతి దసరా సీజన్‌లో 578 కార్లను విక్రయించగా ఈ ఏడాది ఇప్పటివరకు 50 కార్లను కూడా విక్రయించలేకపోయామని ఆ సంస్థ జనరల్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. మారుతి డిజైర్, బ్రెజా, స్విఫ్ట్ వంటి మోడల్స్ సరఫరా ఆగిపోవడంతో అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని, గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 50 శాతం క్షీణిస్తాయని అంచనా వేస్తున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది జనవరి వరకు సెమీ కండక్టర్ చిప్‌ల కొరత సమస్య ఉంటుందని డీలర్లు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా రూ.15.54 లక్షల కోట్ల నష్టం
సెమీ కండక్టర్స్ కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ రూ.15.54 లక్షల కోట్లు (210 బిలియన్ డాలర్లు) నష్టపోతుందని అంతర్జాతీయ సంస్థ అలెక్స్ పార్టనర్ అంచనా వేసింది. చిప్‌ల కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల యూనిట్ల ఉత్పత్తి నష్టపోనున్నట్టు తెలిపింది. మన దేశంలో కూడా కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని 40 నుంచి 50 శాతం వరకు తగ్గించుకోవడంతో ఆ మేరకు అమ్మకాలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దసరా–దీపావళి సీజన్‌లో దేశవ్యాప్తంగా 4.5 లక్షల యూనిట్ల కార్లను అమ్ముతుండగా.. అది ఈ ఏడాది 3.5 లక్షల మార్కును దాటకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దేశ ఆటోమొబైల్ రంగం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోందని, కార్లకు భారీగా డిమాండ్ ఉంటే ఉత్పత్తి లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ఉన్న ద్విచక్ర వాహనాలకు వినియోగదారుల నుంచి డిమాండ్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటోందంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment