పోలీసు యంత్రాంగం అత్యుత్తమ పనితీరుతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిస్థాయిలో విజయవంతమవుతోందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా దిశ వ్యవస్థతో మహిళల భద్రతను పటిష్టపరచడం దేశానికే ఆదర్శప్రాయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్, దిశ వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో మహిళా పోలీసు వ్యవస్థతో మహిళల భద్రతకు పూర్తి భరోసా కల్పి స్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతి
వినూత్న విధానాలతో నేరాల కట్టడి
విజబుల్ పోలీసింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగం, వినూత్న విధానాలతో నేరాల కట్టడి సాధ్యమైంది. 2022 కంటే 2023లో రాష్ట్రంలో నేరాలు 8.13శాతం తగ్గాయి. 2022లో 1,75,612 కేసులు నమోదు కాగా 2023లో 1,61,334 కేసులకు తగ్గాయి. హత్యలు, దాడులు, దోపిడీలు, దొంగతనాలు, ఘర్షణలు, మహిళలపై నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.
హత్యలు, హత్యాయత్నం కేసులు 10శాతం, దోపిడీలు 28.57శాతం, దొంగతనాలు 37.24 శాతం, పగటి దొంగతనాలు 13.41 శాతం, రాత్రి దొంగతనాలు 13.54 శాతం, రోడ్డు ప్రమాదాలు 7.83 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 15.20 శాతం, సైబర్ నేరాలు 25.52 శాతం తగ్గాయి. పోలీసు బీట్లు పునర్వ్యవస్థీకరించడం, నిరంతర పర్యవేక్షణ, అనుమానితుల వేలిముద్రల సేకరణ, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం వంటి విధానాలను పటిష్టంగా అమలు చేశాం. మహిళా భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించి సత్ఫలితాలను సాధించాం.
అసాంఘిక శక్తులపై నిఘా, విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, మహిళా పోలీసుల సమర్థ వినియోగం, పీడీ యాక్ట్ ప్రయోగం, కన్విక్షన్ బేస్డ్ విధానాలతో నేరాలను గణనీయంగా తగ్గించగలిగాం. పోలీసు శాఖకు చెందిన 4,92,142 కేసులను లోక్ అదాలత్‌ల ద్వారా పరిష్కరించాం. రౌడీలపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాష్ట్రంలోని 4వేల మంది రౌడీల్లో వెయ్యి మంది జైళ్లలో ఉన్నారు. ఈ ఏడాది 900 మంది రౌడీలకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించగలిగాం. మరో 200 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేశాం.
మహిళలకు పటిష్ట భద్రత
2023లో రాష్ట్రంలో మహిళలపై నేరాలతోపాటు అన్ని రకాల నేరాలను గణనీయంగా తగ్గించడంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతమైన పాత్ర పోషించింది. క్షేత్రస్థాయి వరకు పోలీసింగ్ వ్యవస్థను విస్తృత పరచడం, సమర్థ పర్యవేక్షణ, సున్నిత ప్రాంతాల జియో మ్యాపింగ్ వంటి విధానాలతో మహిళలకు పటిష్ట భద్రత. 2022లో కంటే 2023లో మహిళలపై అత్యాచార కేసులు 28.57శాతం, వరకట్న కేసులు 11.76శాతం, మహిళలపై ఇతర నేరాలు 14శాతం తగ్గడమే అందుకు నిదర్శనం. సమర్థ పోలీసింగ్ విధానాలతో రాష్ట్రంలో అన్ని రకాల నేరాలు భారీగా తగ్గాయి.
డ్రగ్స్, గంజాయి కట్టడి
డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. నాటుసారాపై ఉక్కుపాదం మోపాం. మూడేళ్లలో 5 లక్షల కేజీల గంజాయిని జప్తు చేశాం. గిరిజనులకు 2.52 లక్షల ఎకరాల్లో ప్రత్యమ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నాం. విలేకరుల సమావేశంలో అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబ్రత బాగ్చి, డీఐజీ రాజశేఖర్‌బాబు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment