సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ కుంభకోణం కేసు కీలకమలుపు తిరిగింది. షెల్ కంపెనీలు, బోగస్ ఇన్వాయిస్‌ల ద్వారా చంద్రబాబు ముఠా అడ్డగోలుగా నిధులను అక్రమంగా తరలించారన్నది స్పష్టమైంది. ఈ బాగోతంలో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా మొత్తం అవినీతి నెట్‌వర్క్‌ను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు.
స్కిల్ స్కాం కేసులో నిందితుడు (ఏ–13)గా ఉన్న ఆయన తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ స్కాంలో బోగస్ ఇన్వాయిస్‌ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టిందీ వివరిస్తూ ఆయన గతంలోనే గుంటూరులోని న్యాయస్థానంలో 2022, జులై 23న 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు.
తాజాగా.. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారి స్కిల్ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులు, తెరవెనుక కుట్రను వెల్లడించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రకాంత్ షాను సీఐడీ గతంలో అరెస్టుచేయగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
యోగేశ్ గుప్తానే కథ నడిపారు..
ఇక ఈ కేసులో చంద్రబాబు సన్నిహితుడు యోగేశ్ గుప్తా పాత్ర మరోసారి బయటకొచ్చింది. అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాలు, టిడ్కో ప్రాజెక్టు కాంట్రాక్టుల కేటాయింపులో నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు వసూలుచేసి చంద్రబాబుకు చేరవేయడంలో యోగేశ్ గుప్తా పాత్రధారిగా ఉన్నారు. అందుకే ఈయనకు ఐటీ శాఖ కూడా నోటీసులిచ్చి విచారించింది. అలాగే, స్కిల్ స్కాం కేసులోనూ యోగేశ్ గుప్తా నిందితుడుగా (ఏ–22) ఉన్నారు.
నిధుల అక్రమ తరలింపులో ఈయన కీలకపాత్ర పోషించారని చంద్రకాంత్ షా తన అప్రూవర్ పిటిషన్‌లో వెల్లడించారు. ఈ కేసులో మరో నిందితుడు సావన్ కుమార్ జజూ (ఏ–26)తో కలిసి యోగేశ్ గుప్తా 2016లో ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షాను సంప్రదించారు. డిజైన్‌టెక్, స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్‌వేర్ సమకూర్చినట్లు.. ఐటీ సేవలు అందించినట్లుగా బోగస్ ఇన్వాయిస్‌లు కావాలని కోరారు. అనంతరం.. ఏసీఐ కంపెనీ పేరిట స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్‌లు, డిజైన్‌టెక్ కంపెనీకి రెండు బోగస్ ఇన్వాయిస్‌లు ఇచ్చారు.
సీమెన్స్–డిజైన్‌టెక్ కంపెనీలతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు నమ్మించేందుకే బోగస్ ఇన్వాయిస్‌లు తమ నుంచి తీసుకున్నట్లు తాను గుర్తించానని చంద్రకాంత్ షా పేర్కొన్నారు. ఈ బోగస్ ఇన్వాయిస్‌ల విలువ మేరకు రూ.64,87,39,313 ఏసీఐ కంపెనీ బ్యాంకు ఖాతాలో జమచేశారు. అనంతరం సావన్‌కుమార్ చెప్పిన పలు షెల్ కంపెనీలకు ఆ నిధులను చంద్రకాంత్ షా బదిలీ చేశారు.
మరోవైపు.. స్కిల్ స్కాం నిధులు రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు సీఐడీ తాజాగా గుర్తించింది. ఇందులో రూ.64.87 కోట్లు ఏసీఐ కంపెనీ బోగస్ ఇన్వాయిస్‌లతోనే అక్రమంగా తరలించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. చంద్రకాంత్ షా అప్రూవర్ పిటిషన్‌పై విచారణకు డిసెంబర్ 5న హాజరుకావాలని కోర్టు ఆయన్ని ఆదేశించింది. దాంతో స్కిల్ స్కాం దర్యాప్తులో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment