ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరుబాట.. 50 ఏళ్ల క్రితం విజ్ఞాపనలతో మొదలు
ఎస్సీల్లో మాల, మాదిగల మధ్య వివాదం
రిజర్వేషన్ల ఫలాల్లో 59 ఉప కులాలకు సమ న్యాయం నినాదం
సాక్షి, అమరావతి: ఒకే సామాజిక వర్గంలోని ఉప కులాలకు సమ న్యాయం జరగడం లేదంటూ దాదాపు ఆరు దశాబ్దాల క్రితం వారిలో అంతరాలకు బీజం పడింది. అన్నదమ్ముల్లా మెలిగే వారిలో అంతరాలు తొలగించి జనాభా ప్రాతిపదికన (దామాషా) రిజర్వేషన్ల అమలును సరిచేసి, వాటి ఫలాలు అందించాలని ఐదు దశాబ్దాల క్రితం విజ్ఞాపనలతో మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ చేయాల్సిందేనంటూ మూడు దశాబ్దాల క్రితం ఉద్యమం మొదలైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అటు మీడియాలో, ఇటు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
అసలీ వర్గీకరణ ఏమిటి? ఎక్కడ తేడా వస్తోంది? భావోద్వేగాలను పురిగొల్పేలా ఉద్యమం ఎందుకు జరిగింది? వంటి అనేక ప్రశ్నలకు బదులు దొరకాలంటే 6 దశాబ్దాల పరిణామాలను ఒకసారి పరికించాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్లలో న్యాయమైన వాటా దక్కడం లేదని, రిజర్వేషన్ల ఫలాలు అందుకోవడంలో ఎస్సీ కులాల్లో అసమానతలు పొడచూపడంతోనే వర్గీకరణ అంశం ఉద్యమ రూపానికి దారి తీసిందని అనేక మంది సామాజిక కార్యకర్తలు, మేథావులు పలుమార్లు స్పష్టం చేశారు.
ఎస్సీల్లోని 59 ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు జనాభా నిష్పత్తి ప్రకారం అందడం లేదని ఎస్సీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం 1965లో లాల్ బహదూర్‌శాస్త్రి ప్రభుత్వం నియమించిన లోకూర్ కమిషన్ నివేదించింది. ఇదే అంశంపై 1972 నుంచి మొదలుకుని ఉమ్మyì ఏపీలో మారిన ప్రతి సీఎంకు విజ్ఞప్తుల వెల్లువ మొదలైంది. ఎస్సీని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల్లో న్యాయం చేయాలనే డిమాండ్‌తో 1994లో మొదలైన ఉద్యమం రాష్ట్రమంతటా విస్తరించింది. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7న వర్గీకరణే ప్రధాన డిమాండ్‌గా సభ జరిపి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
రిజర్వేషన్ వర్గీకరణ ఇలా..
1996లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా ఏబీసీడీ వర్గీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 15% ఎస్సీ కోటాను విభజిస్తూ 1997 జూన్ 6న ఆనాటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ’ఏ’ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాలతో సహా మొత్తం 12 కులాలను అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించి ఒక శాతం కోటాను కేటాయించారు.
’బీ’ గ్రూపులో మాదిగ, దాని ఉప కులాలతో సహా మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7% కోటాను కేటాయించారు. ’సీ’లో మాల, దాని ఉప కులాలతో సహా మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6% కోటా ఇచ్చారు. ’డీ’లో ఆది ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1% కోటా నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
న్యాయస్థానం తలుపుతట్టిన ‘వర్గీకరణ’
ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మాల మహానాడు కోర్టును ఆశ్రయించింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని, రాజ్యాంగ విరుద్ధమైందని ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఆర్టికల్ 338 క్లాజ్ 9 ప్రకారం, ఈ వర్గీకరణ చేయడానికి ముందు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సంప్రదించాల్సి ఉందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ఆ రిజర్వేషన్ వర్గీకరణ కాస్తా రద్ధైంది. దీనిపై తొలుత అభ్యంతరాలతో ముందుకొచ్చింది మాల మహానాడు . పీవీ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన మాల మహానాడు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది.
మాదిగల వర్గీకరణ డిమాండ్‌పై మొట్ట మొదట మాలలు అభ్యంతరం చెప్పారు. సబ్–కేటగిరైజేషన్ సామాజిక వైషమ్యాలకు దారి తీస్తుందన్నారు. ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప మాదిగలకు అన్యాయం ఏమీ జరగలేదనే వాదనను పీవీ రావు తెరమీదకు తెచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్సీల ఐక్యతను దెబ్బతీసే కుట్రతో సృష్టించిందే వర్గీకరణ ఉద్యమం అని ఆరోపించారు. అప్పట్లో రాష్ట్రంలో మాలలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి, మాదిగల్ని తన వైపు తిప్పుకొనే వ్యూహంతోనే చంద్రబాబు వర్గీకరణ చిచ్చు పెట్టారనే విమర్శలు చేశారు.
‘చట్టాన్ని’ కొట్టేసిన సుప్రీంకోర్టు
ఎస్సీలను వర్గీకరిస్తూ 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ అనే చట్టాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఆ చట్టంలో ఎస్సీలను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తూ.. వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు.
కాగా, 2004 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టి వేసింది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్ వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని ప్రకటించింది. దీంతో వర్గీకరణ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. 2000 నుంచి 2004 మధ్య దాదాపు ఐదేళ్లపాటు రిజర్వేషన్ల అమలుతో మాదిగలకు దాదాపు 22 వేల వరకు ఉద్యోగాలు వచ్చినట్టు అప్పట్లో మంద కృష్ణ ప్రకటించారు.
రాజ్యాంగ సవరణ కోరిన వైఎస్సార్
ఎస్సీ వర్గీకరణ వివాదం జటిలం కావడంతో దానికి సామరస్యంగా పరిష్కారం చూపే దిశగా దివంగత సీఎం వైఎస్సార్ గట్టి ప్రయత్నం చేశారు. వర్గీకరణ విషయంలో జాతీయ స్థాయిలో పరిష్కారం చూపేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీనిపై స్పందించిన అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ.. ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. 2008 మే లో కేంద్ర మంత్రి మీరాకుమార్‌కు ఉషా మోహ్రా కమిషన్ నివేదికను సమర్పించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజును చేర్చడం ద్వారా, రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
అయితే దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా, మరో ప్రధాన వర్గానికి చెందిన ఓటు బ్యాంకు దూరమవుతుందనే భావనతో పదేళ్లుగా దానికి పరిష్కారం చూపలేదు. ఇటీవల హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో మంద కృష్ణ నిర్వహించిన మాదిగ విశ్వరూప మహాసభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై కమిటీ వేసి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఐదుగురితో కమిటీ వేశారు.
ఎస్సీ ఉప వర్గీకరణ.. పరిణామక్రమం
» రాష్ట్రంలోని ఎస్సీ కులాల వర్గీకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 1997లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర రాజు నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయగా.. కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఎస్సీ కులాలను వర్గీకరించాలని ప్రతిపాదించగా ఈ నివేదికను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. â ఎస్సీలను ఏ, బీ, సీ, డీ ఉప కులాలుగా వర్గీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎస్సీలకు ఉన్న మొత్తం 15% రిజర్వేషన్లలో ఏ ఉప కులానికి 1%, బీ ఉప కులానికి 7%, సీ ఉప కులానికి 6%, డీ ఉప కులానికి 1 % మేర రిజర్వేషన్లు కల్పించింది.
» ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఆర్డినెన్స్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుండగానే, ఆర్డినెన్స్ స్థానంలో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం 2000లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) చట్టం పేరుతో ఓ చట్టాన్ని తె చ్చింది. ఈ చట్టాన్ని కూడా హైకోర్టులో సవాలు చేశారు.
ఈ చట్టంపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తీసుకొ చ్చిన ఉప వర్గీకరణ చట్టాన్ని సమర్థించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. ప్రభుత్వ చట్టంతో రాష్ట్రపతి ఉత్తర్వులకు వ చ్చిన నష్టం ఏమీ లేదంది. చట్టాలు చేయకుండా రాష్ట్రాలను రాష్ట్రపతి ఉత్తర్వులు నిరోధించజాలవంది.
» ఈ తీర్పును సవాలు చేస్తూ డాక్టర్ ఈవీ చిన్నయ్య, మాల మహానాడులతో పాటు పలువురు 2000లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి 2004లో తీర్పునిస్తూ ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పును తప్పుపట్టింది. â 2006లో పంజాబ్, హర్యానా హైకోర్టు ధర్మాసనం ఈ సర్క్యులర్‌ను రద్దు చేసింది. పంజాబ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
దీంతో పంజాబ్ ప్రభుత్వం 2006లో పంజాబ్ రిజర్వేషన్ ఇన్ సర్వీసెస్ చట్టం తీసుకురాగా ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసన పంజాబ్ తీసుకొ చ్చిన చట్టాన్ని కొట్టేస్తూ 2010లో తీర్పుని చ్చింది. â పంజాబ్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ అప్పీళ్లపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. â జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 2020లో తీర్పునిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది.
డాక్టర్ ఈవీ చిన్నయ్య కేసులో ఐదుగురు న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనమే తీర్పు చెప్పిందని, తమది కూడా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనమే కాబట్టి, చిన్నయ్య కేసులో తీర్పును తాము సమీక్షించజాలమంది. అయితే చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును కూడా ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పునః పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
» దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తన నేతృత్వంలో ఏడుగురు న్యాయమూర్తులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఉప వర్గీకరణపై ఈ రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపి గురువారం తీర్పు వెలువరించింది.
ఇది దోపిడీ, అణచివేతలకు సంబంధించిన అంశం కాదు. ఇది అణచి వేయబడ్డ సమూహంలోనే అసమానతలకు సంబంధించిన అంశం. దీనికి మూలాలు హిందూ వర్ణ వ్యవస్థలో, దానిలో ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలోనే ఉన్నాయి. – వర్గీకరణపై గతంలోమానవ హక్కుల కార్యకర్త బాలగోపాల్
Comments
Please login to add a commentAdd a comment