విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సిద్ధమైన ‘జయహో బీసీ మహా సభ’ ప్రాంగణం
నాడు బాబు హయాంలో...
తమ హక్కులను పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తాత్కాలిక సచివాలయం సాక్షిగా తోకలు కత్తిరిస్తానంటూ అధికార దర్పంతో చంద్రబాబు బెదిరించారు. హామీలను నెరవేర్చాలని విన్నవించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ హూంకరించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ అవహేళన చేశారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ దళితులను, కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ మహిళలను కించపరిచి తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారు.
నేడు జగన్ పాలనలో...
బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఆచరించి చూపుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో బీసీల ఖాతాల్లోకి రూ.85,915.06 కోట్లు జమ చేశారు. అమ్మఒడి నుంచి విద్యాదీవెన వరకూ వివిధ పథకాల ద్వారా బీసీ విద్యార్థులకు సింహభాగం మేలు చేస్తూ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ అత్యధిక పదవులను బీసీలకే కేటాయించారు.
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూత.. రాజ్యాధికారంలో సింహభాగం వాటా.. బీసీ బిడ్డల చదువులకు అండగా నిలిచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీ సామాజిక వర్గాలను సీఎం వైఎస్ జగన్ సమాజానికి వెన్నెముకలా నిలబెడుతున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మూడున్నరేళ్లలో పేదలకు రూ.1,77,585.51 కోట్లను పారదర్శకంగా అందించగా బీసీ వర్గాలకే రూ.85,915.06 కోట్ల మేర ప్రయోజనం చేకూరటాన్ని ప్రస్తావిసు్తన్నారు. నగదు బదిలీ, నగదేతర బదిలీతో పేదలకు మొత్తం రూ.3,19,227.86 కోట్ల మేర లబ్ధి చేకూరగా బీసీ వర్గాలకే రూ.1,63,344.10 కోట్ల మేర మేలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టి అమ్మఒడి, విద్యాకానుక అందచేసి పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించడంతోపాటు విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా బీసీ బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు.
అధికారంగా వాటా..
ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న వైఎస్సార్‌సీపీ ఏలూరులో బీసీ గర్జన సభను నిర్వహించింది. తాము అధికారంలోకి రాగానే బీసీలకు చేసే మేలును బీసీ డిక్లరేషన్ రూపంలో ఈ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక అందులో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా వారికి ప్రయోజనం చేకూర్చారు. అవి ఏమిటంటే...
► 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 50% ఓట్లతో 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్‌సభ స్థానాలతో చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న తాజా కేబినెట్‌లో 11 మంది బీసీలకు స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజాద్ బాషాతో పాటు బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, లాంటి కీలక శాఖలను ఆ వర్గాలకే అప్పగించారు.
► స్పీకర్‌గా బీసీ వ్యక్తి అయిన తమ్మినేనికు అవకాశం కల్పించారు. శాసన మండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది సభ్యులుండగా అందులో బీసీలే అత్యధికం కావడం గమనార్హం.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా నలుగురు బీసీలను జగన్ రాజ్యసభకు పంపారు.
► స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా టీడీపీ నేతలను చంద్రబాబు ఉసిగొల్పారు. హైకోర్టు తీర్పుతో బీసీల రిజర్వేషన్లు 24%కి తగ్గిపోయాయి. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువగా బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చి మాటను నిలబెట్టుకున్నారు.
► 13 జిల్లా పరిషత్‌ల్లో 9 జడ్పీ చైర్‌పర్సన్ పదవులను (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ఇందులో బీసీలకే పెద్దపీట వేశారు.
► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగాను వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా అందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి.
► 13 కార్పొరేషన్లనూ వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ చేయగా ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే దక్కాయి. ఇందులోనూ బీసీలకే అగ్రతాంబూలం కల్పించారు.
► 87 మున్సిపాలిటీల్లో 84 వైఎస్సార్‌సీపీ కైవశం చేసుకోగా చైర్‌పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73% ఇచ్చారు. ఇందులోనూ బీసీలదే అధిక శాతం వాటా ఉంది.
చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు..
► దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 % రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం చట్టం తెచ్చారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76(39%) బీసీలకే ఇచ్చారు.
► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు కేటాయించారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42%) ఇచ్చారు.
పెద్దల సభకు ఒక్కరినీ పంపలేదు
బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఆ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చాక వారికి వెన్నుపోటు పొడిచారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టాక మంత్రివర్గంలో ఆరుగురు బీసీలకే బాబు అవకాశం కల్పించగా 11 మంది ఓసీలకు ఛాన్స్ ఇచ్చారు. 2014–19 మధ్య రాజ్యసభకు ఒక్క బీసీని కూడా బాబు పంపలేదు. నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ, మత్స్యకారులను తాట తీస్తానంటూ బెదిరించారు. అడుగడుగునా బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు.
వైఎస్సార్‌సీపీ వెంటే బీసీలు..
జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టింది. అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తుండటంతో ఆ వర్గాలు వైఎస్సార్‌సీపీ వెంటే నడుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.
చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాటం చేస్తూ బీసీల అభ్యున్నతి కోసం శాశ్వత కమిషన్‌ను సీఎం నియమించడంతో ఆయా వర్గాలు వైఎస్సార్‌సీపీకి వెన్నెముకలా నిలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయాలు ఇందుకు నిదర్శనమని ప్రస్తావిస్తున్నారు. బీసీల జనాభా అధికంగా ఉండే కుప్పంలో టీడీపీ కోట కుప్ప కూలటానికి ఇదే కారణమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment