ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు అంతిమ యాత్రకు నలుగురు మనుషులైనా లేని పరిస్థితుల్లో సాధుసుబ్రహ్మణ్యం గుడివాడకు చెందిన ఘంటసాలను పిలిచాడు. ఆయన వచ్చి శ్రీరాములు శవాన్ని చూసి ఆవేశంతో మద్రాసు వీధుల్లో ఎలుగెత్తి పాటందుకోగానే క్షణాల్లో వేలాది మంది పోగయ్యారు.
సాక్షి, కృష్ణా: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఉద్యుక్తుడై బయలుదేరి వెళ్లింది కృష్ణాజిల్లా గుడివాడ నుంచే. మద్రాసులో తెలుగువారికి అవమానాలు చూసి భరించలేక గుంటూరుకు చెందిన గాంధేయవాది స్వామి సీతారాం(ఈయన అసలు పేరు గొల్లపూడి సీతారామశాస్త్రి) గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే రాజాజీ దానిని భగ్నం చేశాడు. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని హేళన చేశారు. ఈ విషయం తెలిసి అప్పుడు గుడివాడలో తన మిత్రుడు యెర్నేని సాధుసుబ్రహ్మణ్యం(ఈయన గుడివాడ సమీపంలోని కొమరవోలు గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు) వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు వెంటనే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి మద్రాసు చేరుకున్నారు.
అక్కడ బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రాజాజీకి భయపడి కాంగ్రెస్ వారు ఎవరూ పొట్టి శ్రీరాములు దీక్షను పట్టించుకోలేదు. శ్రీరాములు వద్ద గుడివాడకు చెందిన సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఎవరూ లేరు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తనను ఎవరూ పట్టించుకోకపోవడం గురించి పొట్టి శ్రీరాములు తన ఆవేదన అంతా తన మిత్రులైన గుడివాడకు చెందిన సాధు సుబ్రహ్మణ్యం అల్లుడు ముసునూరి భాస్కరరావు, (ఈయన భార్య, సాధు సుబ్రహ్మణ్యం కుమార్తె ముసునూరి కస్తూరీదేవి 1967లో కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.) మరో స్వాతంత్య్ర సమరయోధుడు కూరాళ్ల భుజంగ భూషణరావులకు లేఖల్లో రాశారు.
వారాల తరబడి ఆహారం లేకుండా పోవడంతో పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట, కళ్ల వెంట, చెవుల వెంట వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం నోటి వెంట వచ్చేది. ఎట్టకేలకు దీక్ష 58వ రోజు అంటే 1952 డిసెంబరు 15 రాత్రి 11.30 గంటల సమయంలో పొట్టి శ్రీరాములు ప్రాణం అనంత వాయువుల్లో కలసిపోయింది. శవం దగ్గర సాధు సుబ్రహ్మణ్యం ఒక్కడే ఉన్నాడు. కనీసం గుడివాడ వాళ్లనయినా నలుగురిని పోగేసుకువచ్చి ఎలాగోలా అంత్యక్రియలు ముగిద్దామనుకున్నాడు. మద్రాసులో ఉన్న గాయకుడు ఘంటసాలది గుడివాడ పక్కనే చౌటపల్లి కాబట్టి ఆయన వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఆ సమయంలో ఆయన పక్కన గుడివాడ సమీపంలోని మోపర్రుకు చెందిన హరికథకుడు మోపర్రు దాసు ఉన్నాడు. ఆయన నేను కూడా గుడివాడ వాడినే కదా నేనూ వస్తాను అని బయలుదేరాడు. ఇద్దరూ కలసి సాధుసుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు వచ్చారు. అక్కడ తాటాకులు కప్పి ఉన్న శ్రీరాములు శవాన్ని చూసి వారికి వాంతులు అయ్యాయి.
తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు శవయాత్ర ఎవరికీ తెలియకుండా చేయడం సమంజసం కాదని, తెలుగు వాళ్ల కళ్లు తెరిపించేలా ఈ శవయాత్ర సాగాలని ఘంటసాల తలచాడు. అప్పటికప్పుడు అశువుగా ‘చీము, నెత్తురు లేని తెలుగు జాతి కోసం అసువులు బాసిన ఓ అమరజీవి పొట్టి శ్రీరాములూ....’ అంటూ తన గంభీర స్వరంతో ఎలుగెత్తి పాడడం ప్రారంభించాడు. ఒక ఎద్దుల బండి మాట్లాడి అందులో శవాన్ని ఉంచి శవయాత్ర ప్రారంభించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల ముందుగా శవయాత్ర వెళుతుండగా కాలేజీలో తెలుగు విద్యార్థులు ఘంటసాల గద్గద స్వరంతో, ఆవేశంతో పాడుతున్న పాట విని బయటకు వచ్చి శవయాత్ర వెంట నడవడం ప్రారంభించారు.
ఈలోగా పొట్టి శ్రీరాములు మరణ వార్త తెలిసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెయిల్‌లో మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ స్టేషన్‌కు చేరింది. శ్రీరాములు శవాన్ని చూసిన ప్రకాశం పంతులుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనదైన భాషలో తెలుగుజాతి చేతకానితనాన్ని చీల్చి చెండాడాడు. దాంతో కొద్ది సేపట్లోనే వేలాది మంది పోగయ్యారు. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లలో 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. తత్ఫలితంగా 1953 అక్టోబరు ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది.
Comments
Please login to add a commentAdd a comment