amarajeevi potti sreeramulu
-
గుడివాడతో అమరజీవి అనుబంధం
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు అంతిమ యాత్రకు నలుగురు మనుషులైనా లేని పరిస్థితుల్లో సాధుసుబ్రహ్మణ్యం గుడివాడకు చెందిన ఘంటసాలను పిలిచాడు. ఆయన వచ్చి శ్రీరాములు శవాన్ని చూసి ఆవేశంతో మద్రాసు వీధుల్లో ఎలుగెత్తి పాటందుకోగానే క్షణాల్లో వేలాది మంది పోగయ్యారు. సాక్షి, కృష్ణా: ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు ఉద్యుక్తుడై బయలుదేరి వెళ్లింది కృష్ణాజిల్లా గుడివాడ నుంచే. మద్రాసులో తెలుగువారికి అవమానాలు చూసి భరించలేక గుంటూరుకు చెందిన గాంధేయవాది స్వామి సీతారాం(ఈయన అసలు పేరు గొల్లపూడి సీతారామశాస్త్రి) గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే రాజాజీ దానిని భగ్నం చేశాడు. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని హేళన చేశారు. ఈ విషయం తెలిసి అప్పుడు గుడివాడలో తన మిత్రుడు యెర్నేని సాధుసుబ్రహ్మణ్యం(ఈయన గుడివాడ సమీపంలోని కొమరవోలు గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు) వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు వెంటనే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. అక్కడ బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. రాజాజీకి భయపడి కాంగ్రెస్ వారు ఎవరూ పొట్టి శ్రీరాములు దీక్షను పట్టించుకోలేదు. శ్రీరాములు వద్ద గుడివాడకు చెందిన సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఎవరూ లేరు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తనను ఎవరూ పట్టించుకోకపోవడం గురించి పొట్టి శ్రీరాములు తన ఆవేదన అంతా తన మిత్రులైన గుడివాడకు చెందిన సాధు సుబ్రహ్మణ్యం అల్లుడు ముసునూరి భాస్కరరావు, (ఈయన భార్య, సాధు సుబ్రహ్మణ్యం కుమార్తె ముసునూరి కస్తూరీదేవి 1967లో కాంగ్రెస్ పార్టీ తరఫున గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.) మరో స్వాతంత్య్ర సమరయోధుడు కూరాళ్ల భుజంగ భూషణరావులకు లేఖల్లో రాశారు. వారాల తరబడి ఆహారం లేకుండా పోవడంతో పేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట, కళ్ల వెంట, చెవుల వెంట వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం నోటి వెంట వచ్చేది. ఎట్టకేలకు దీక్ష 58వ రోజు అంటే 1952 డిసెంబరు 15 రాత్రి 11.30 గంటల సమయంలో పొట్టి శ్రీరాములు ప్రాణం అనంత వాయువుల్లో కలసిపోయింది. శవం దగ్గర సాధు సుబ్రహ్మణ్యం ఒక్కడే ఉన్నాడు. కనీసం గుడివాడ వాళ్లనయినా నలుగురిని పోగేసుకువచ్చి ఎలాగోలా అంత్యక్రియలు ముగిద్దామనుకున్నాడు. మద్రాసులో ఉన్న గాయకుడు ఘంటసాలది గుడివాడ పక్కనే చౌటపల్లి కాబట్టి ఆయన వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. ఆ సమయంలో ఆయన పక్కన గుడివాడ సమీపంలోని మోపర్రుకు చెందిన హరికథకుడు మోపర్రు దాసు ఉన్నాడు. ఆయన నేను కూడా గుడివాడ వాడినే కదా నేనూ వస్తాను అని బయలుదేరాడు. ఇద్దరూ కలసి సాధుసుబ్రహ్మణ్యం ఇంటి వద్దకు వచ్చారు. అక్కడ తాటాకులు కప్పి ఉన్న శ్రీరాములు శవాన్ని చూసి వారికి వాంతులు అయ్యాయి. తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు శవయాత్ర ఎవరికీ తెలియకుండా చేయడం సమంజసం కాదని, తెలుగు వాళ్ల కళ్లు తెరిపించేలా ఈ శవయాత్ర సాగాలని ఘంటసాల తలచాడు. అప్పటికప్పుడు అశువుగా ‘చీము, నెత్తురు లేని తెలుగు జాతి కోసం అసువులు బాసిన ఓ అమరజీవి పొట్టి శ్రీరాములూ....’ అంటూ తన గంభీర స్వరంతో ఎలుగెత్తి పాడడం ప్రారంభించాడు. ఒక ఎద్దుల బండి మాట్లాడి అందులో శవాన్ని ఉంచి శవయాత్ర ప్రారంభించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల ముందుగా శవయాత్ర వెళుతుండగా కాలేజీలో తెలుగు విద్యార్థులు ఘంటసాల గద్గద స్వరంతో, ఆవేశంతో పాడుతున్న పాట విని బయటకు వచ్చి శవయాత్ర వెంట నడవడం ప్రారంభించారు. ఈలోగా పొట్టి శ్రీరాములు మరణ వార్త తెలిసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెయిల్లో మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ స్టేషన్‌కు చేరింది. శ్రీరాములు శవాన్ని చూసిన ప్రకాశం పంతులుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనదైన భాషలో తెలుగుజాతి చేతకానితనాన్ని చీల్చి చెండాడాడు. దాంతో కొద్ది సేపట్లోనే వేలాది మంది పోగయ్యారు. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లలో 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. తత్ఫలితంగా 1953 అక్టోబరు ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించింది. -
వల్లభాయ్ పటేల్, పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భారతరత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు. చదవండి: (రాష్ట్రానికి విశాఖే భవిష్యత్.. త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన) -
పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్వాతంత్ర్య సమరయోధులు, భారత తొలి హోం మంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్, ఆంధ్ర రాష్ట్ర సాధనలో అమరుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పాల్గొన్నారు. చదవండి: (వైఎస్సార్ పంటల బీమాను ప్రారంభించిన సీఎం జగన్) -
చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు
ఆంధ్రరాష్ట్ర అవతరణకు ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయుడు. 1953, అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా నవంబర్ 1, 1956న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ రాష్ట్ర అవతరణకు జరిగిన రాజకీయ పోరాట నేప«థ్యాన్ని తలంచుకున్నప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం గుర్తుకు రాక మానదు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ తన బ్రాండ్ ఇమేజ్ను కోల్పోకుండా వుండాలంటే గతంలో లాగానే నవంబర్ 1నాడే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. అయితే నాడు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబునాయుడు తెలుగు ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కాడు. సంప్రదాయంగా వస్తున్న మన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చరిత్రతో పనే లేదని చంద్రబాబు పక్కన పెట్టేశాడు. తెలంగాణ ఏర్పడిన జూన్ 2ను ఏపీ చరిత్రలో చీకటిరోజుగా అభివర్ణిస్తూ నవనిర్మాణ దీక్షల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పాటు తేదీని ఆ రాష్ట్రం అవతరణ దినోత్సవంగా జరుపుకుంటోంది. అయితే, 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిదేళ్ల పాటు నిర్వహించలేదు. ఎంతో చరిత్ర ఉన్న ఏపీకి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపాలని అనేక మంది ప్రముఖులు, సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. (నేడు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు) అయినా స్పందన లేదు. ఇక, ఏపీలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత దీనిపై కేంద్ర ప్రభుత్వంతో కసరత్తు చేసింది. కేంద్రం సైతం తాము గతంలోనే సూచనలు చేసామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం ఇచ్చింది. ఫలితంగా అయిదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవం లేని ఏపీ 2019 నుండి నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నది. ఆంధ్ర అవతరణ దినోత్సవం అంటే ఒక సంస్కృతి. అది మన పూర్వీకులకు మనం ఇచ్చే గౌరవం. తెలుగు ప్రముఖులను గౌరవించుకోవడానికి, ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోయే కాలంలో దిశానిర్దేశాలు ఎంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దాదాపు 58 సంవత్సరాల తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు రెండు తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ 2014 జూన్ 2 నుండి మూడు సంవత్సరాల వరకు కొనసాగింది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23న శంకుస్థాపన జరిగింది. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభమై పరిపాలన మొదలైంది. సమీకృత అభివృద్ధి. పరిపాలన వికేంద్రీకరణ కొరకు, అమరావతిని కేవలం శాసనరాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా వైఎస్ జగన్ ప్రభుత్వం మార్పులు చేసిన చట్టానికి 2020 జూలై 31 న గవర్నర్ ఆమోదముద్ర పడింది. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు, ఆంధ్రులకు ప్రాతఃస్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకోసం జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. మద్రాసు రాజధానిగా వుండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములుకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చెయ్యలేదు. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. ఈ మహనీయుని జ్ఞాపకార్థం రాష్ట్రప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. తెలుగు ప్రజల, వాసవి సంఘాల ఆకాంక్షల ఫలితంగా నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ అవతరణ రెండో ఏడాది జయప్రదంగా జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి అభినందనలు. (నేడు రాష్ట్రావతరణ దినోత్సవం) దింటకుర్తి వీర రాఘవ ఉదయ్ కుమార్ అధ్యక్షులు, వాసవీ విద్యార్థ్ధి ఫెడరేషన్ -
అమరజీవి విగ్రహం ధ్వంసం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల రోజుల్లో రెండోసారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్నాయి. అలాగే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. -
అమరం... అమరం...
చెన్నై సెంట్రల్ : తెలుగువారి కబుర్లు రేపు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి అవి... మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న రోజులు... తెలుగువారంతా ఏకమై ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం గొంతు విప్పిన ఉద్రిక్త వాతావరణం... తెలుగు నాయకులంతా ముక్త కంఠంతో తెలుగు రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న రోజులు... మైలాపూర్‌లోని రెండు భవంతులు ఈ ప్రక్రియలో ప్రధానపాత్ర వహించాయి. మొదటిది శ్రీబాగ్... అమృతాంజనం వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావుగారికి చేరింది... రెండవది లజ్ చర్చ్ రోడ్డులో ఉన్న గార్డెన్ హౌస్... 19వ శతాబ్దం ప్రారంభంలో దివంగత పి.ఆర్.సుందర్ అయ్యర్ నిర్మించిన భవంతి... పొట్టి శ్రీరాములు అమరులయిన భవంతి... ఆ వీధిలోకి అడుగు పెడితే అమరజీవి మనకు అజరామరంగా కనిపిస్తారు. ఆయనను కన్నులారా వీక్షించని వారు సైతం ఒకసారి ఆయన మనలను పలకరించిన అనుభూతి చెందుతాం. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం నిస్వార్థంగా, ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు ఇక్కడ అమరుడయ్యాడా అని ఒక్కసారి గుండె తడి కాక మానదు. చిన్న సందులో ఆఖరున ఉన్న ఆ భవంతి నేడు ఎన్నో మార్పులకు లోనయినప్పటికీ, ఆయన కూర్చున్న ప్రదేశాన్ని వీక్షించగానే 1952 నాటి ఘటన మన ఎద లోతులను తడమక మానదు. ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని కచ్చితంగా ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, రాయలసీమకు గుండెకాయ వంటి కర్నూలుని రాజధానిగా ఏర్పాటు చేయడం... వంటి విషయాల గురించి తెలుగు నాయకులంతా విస్తృతంగా, తీవ్రంగా చర్చించుకుంటున్న రోజులు అవి. అయితే, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక, ఈ విషయం వెనకబడిపోయింది. 1949లో ఒకసారి, 1952లో ఒకసారి ఈ అంశం తెర మీదకు వచ్చినా, అధికారులెవ్వరూ ఈ విషయం మీద పూర్తి శ్రద్ధ వహించలేదు. ప్రముఖ గాంధేయవాది అయిన పొట్టి శ్రీరాములు సరిగ్గా ఆ సమయంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం నిరశన దీక్ష ప్రారంభిస్తానన్నారు. ఆ నిరశన వ్రతం ప్రారంభించడానికి స్థలం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. పొట్టి శ్రీరాములు పట్టుదల మనిషి. ‘ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే నా దీక్ష ఏ మాత్రం ఆగదు. ముందూ వెనుకా అట్టలు కట్టుకుని వీధులలో తిరుగుతూ ప్రాణాలు విడుస్తాను’ అని ప్రకటించిన పట్టుదల మనిషి శ్రీరాములు. బులుసు సాంబమూర్తి ఆయన వ్రతానికి ఆశ్రయం ఇచ్చాడు. గాంధీజీతో మన చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైతే, శ్రీరాములు ఆత్మబలిదానంతో మన చరిత్ర మరొక కొత్త మలుపు తిరిగింది. అక్టోబరు 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి, డిసెంబరు 16వ తేదీ మంగళవారం, 58 రోజుల ఉపవాస దీక్షతో పొట్టి శ్రీరాములు అమరులయ్యారు. ఆయన మరణంలో తెలుగు వారు ఒక్కసారిగా హింసామార్గంలో ప్రవేశించారు. మైలాపుర్ లజ్ కార్నర్ సమీపంలో నెం. 89, రాయపేట్ హైరోడ్, ఇల్లు సాంబమూర్తి గారి నివాసగృహం. అక్కడే పొట్టి శ్రీరాములు కృశించిన, జీవం లేని దేహమున్న పవిత్ర స్థానం. ఆ గృహం ముందరి ప్రదేశంలోనే కర్రలతో, కొబ్బరి ఆకులతో నిర్మించిన వేదికపై శ్రీరాములు పార్థివదేహాన్ని ఉంచారు. శ్రీరాములు మరణవార్త దావానలంలా దేశమంతటా వ్యాపించింది. ఈలోగానే తండోపతండాలుగా వచ్చే జనంతో వీధివీధంతా కిక్కిరిసిపోయింది. వచ్చినవారు అమరజీవిని అంతిమ దర్శనం చేసుకొని ఆయన శరీరం మీద పుష్పమాలలు వుంచి అశ్రునేత్రాలతో మరలుతున్నారు. ఆ నాటి మధ్యాహ్నం రెండు గంటలకు ఆ ఇంటి వద్ద నుంచి పొట్టి శ్రీరాములు అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర సాగుతున్నంతసేపు ఘంటసాల, మోపర్రుదాసు... అందరి హృదయాలు ద్రవించేలా జాతీయగీతాలను ఆలపించారు. మేడలపై నుంచి పౌరులు పూలవానలు కురిపిస్తూ, ‘పొట్టి శ్రీరాములు అమర్ రహే, మద్రాసు నగరం రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలి’ వంటి నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలా చేశారు. ‘‘శ్రీరాములు చనిపోలేదు. అతడు అమరజీవి అయ్యాడు’’ అని పెద్దలందరూ కన్నీటితో నిండిన గుండె బరువుతో ఆక్రోశించారు. ఊరేగింపులో పాల్గొన్నవారిలో తెలుగు వారే కాదు, తమిళులు తదితరులు కూడా ఉన్నారు. మద్రాసు తెలుగువారి పట్ల తమిళులు ఎప్పుడూ ఆదరభావాన్నే ప్రదర్శిస్తూ వచ్చారు. సాంబమూర్తి గారి ప్రైవేట్ కార్యదర్శి శ్రీరామదేశికర్ తమిళుడు! అయినా ఆ ఊరేగింపు ఏర్పాట్లలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. శ్రీరాముల ఆత్మబలిదాన ఫలితంగా ఎన్నడూ అనుకోని విధంగా మదరాసు నగరంలోనూ, ఆంధ్రరాష్ట్రంలోనూ మాత్రమే కాక దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా చెలరేగిన సంక్షోభం ఒక్కసారిగా నెహ్రూ కూర్చున్న సింహాసనాన్ని కుదిపేసింది. మరో ఆలోచన లేకుండా డిసెంబరు 19న, భాషా ప్రాతిపదికన, నెహ్రూ ప్రత్యేక తెలుగు రాష్ట్రం ప్రకటించారు. ఇందులో కోస్తా ప్రాంతం, కర్నూలు రాజధానిగా రాయలసీమ, ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా... 1953, అక్టోబరు 1 న ప్రత్యేక తెలుగు రాష్ట్ర ప్రకటన జరిగింది. మూడు సంవత్సరాల తర్వాత నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా ఇందులో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. శ్రీబాగ్ అనేది అమృతాంజనం ప్రాంగణంలో పురాతనంగా నిలిచిపోయింది. బులుసు సాంబమూర్తి గారి నివాసం పొట్టి శ్రీరాములు స్మారకంగా చరిత్రకెక్కింది. నాటి భవనం శిథిలం కావడంతో, వై.ఎస్. శాస్త్రి అవిశ్రాంతంగా తపస్సు చేసి, ప్రస్తుతం ఉన్న భవంతిని పూర్తి చేసి, అక్కడ శ్రీరాములు జయంతి, వర్థంతులను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఈ మహానుభావుని త్యాగఫలంగా నిర్వహించుకుంటున్నాం. కాని చెన్నైలో జన్మించి, చెన్నైలో దీక్ష చేసి, చెన్నైలో తనువు చాలించిన ‘అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం’ ఏటా తెలుగు రాష్ట్రం నుంచి వచ్చే నిధుల కోసం నిరీక్షిస్తూ ఉండటం తెలుగువారు బాధపడాల్సిన విషయంగా పలువురు పెద్దలు అంటున్నారు. - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై (ఇన్పుట్స్: వై రామకృష్ణ, వై.యస్.శాస్త్రి రచించిన ‘అమరజీవి సమరగాథ’ పుస్తకం ఆధారంగా)