
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ సవాంగ్,తదితరులు
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పునరుద్ఘాటించారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాన్ఫరెన్స్ వివరాలపై కమిషన్ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ఏవైనా అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వస్తే సంబంధిత ఆర్వో, ఏఆర్వోలపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అంకితభావంతో నిర్వహించాలన్నారు.
రాజ్యాంగ పరిధికి లోబడి ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని, కమిషన్ విశేషాధికారాలను దుర్వినియోగం కానివ్వబోమని చెప్పారు. ‘గతం చూడొద్దు.. నేనూ చూడను.. ఎన్నికలు సజావుగా నడపడమే ధ్యేయంగా అందరూ పనిచేయాలి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహశీల్దార్లు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించినా, ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించం. అలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తాం’ అని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై తీవ్ర పదజాలంతో మాట్లాడినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు.
ప్రత్యేక యాప్‌తో పోలింగ్ పర్యవేక్షణ..
ఎన్నికల రోజు వెబ్‌కాస్టింగ్‌కు బదులుగా ప్రత్యేక యాప్ ద్వారా పోలింగ్ బూత్ బయట, లోపల జరిగే అంశాలపై దృష్టి సారిస్తామని ఎస్‌ఈసీ తెలిపారు. ఇందుకోసం కొత్త యాప్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లను, ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చని, వీటిని పరిశీలించేందుకు కమిషన్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు. పంచాయతీ ఎన్నికలలో వలంటీర్లను వినియోగించరాదని, వారు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే తీవ్ర చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
సమన్వయంతో నిర్వహించుకుందాం: సీఎస్
ఎన్నికల ప్రక్రియను సమన్వయంతో సమర్ధంగా నిర్వహించుకుందామని కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు పోలీసు బృందాలను పోలింగ్‌కు రెండు రోజుల ముందే సిద్ధం చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. తొలివిడత పోలింగ్ 9వ తేదీన జరగనుండగా 7వ తేదీకల్లా విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి వ్యాక్సినేషన్ అందేలా ప్రణాళిక రూపొందించుకుంటామన్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ సమావేశంలో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పోలింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
పోలింగ్ మెటీరియల్, ఎన్నికల ఫారాలను సిద్ధం చేయడం, బ్యాలెట్ బాక్స్‌లు బూత్‌లకు తరలింపు ప్రక్రియలో కలెక్టర్లకు పూర్తి స్థాయి అధికారాలుంటాయన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కలెక్టర్లు పంపే ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి తదనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, పోలింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి శానిటైజర్లు, మాసు్కలు, గ్లౌజులు అందుబాటులో ఉంచుతామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె.భాస్కర్ తెలిపారు. మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి, తదుపరి పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బందికి, అధికారులకు వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, అడిషనల్ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, ఏడీజీ సంజయ్ పాల్గొన్నారు. జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవోలు, డీపీవోలు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆదిత్యనాథ్ దాస్, గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ దాదాపు పావుగంట పాటు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌తో ఆయన చాంబర్‌లో సమావేశమై చర్చలు జరిపారు.
నేనే జిల్లాల్లో పర్యటిస్తా..
ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలను రాష్ట్ర ఎన్నికల అథారిటీ హోదాలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ చూసుకుంటారని.. స్వేచ్ఛ, పారదర్శకంగా నిర్వహించే క్రమంలో తనకు అనేక ఇతర పనులు ఉంటాయని నిమ్మగడ్డ చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్లు ఎవరూ తనతో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని, వాటిని పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టికి తేవాలన్నారు. ఎన్నికల సమయంలో తాను స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. కోడ్, నిబంధనల అమలులో అధికారులెవరూ నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
మూడు జిల్లాల్లో షెడ్యూల్ మార్చాలని వినతి
విజయనగరం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విడతల వారీగా ఎన్నికలు జరిపే మండలాలలో మార్పులు చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు కోరినట్లు తెలిసింది. అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించిన ప్రాంతాలలో చివరి విడతలో ఎన్నికలు జరిపేలా ఏర్పాట్లు చేశామని, అయితే నోటిఫికేషన్ రీషెడ్యూల్‌లో తొలి విడత ఎన్నికలను ఆఖరి విడతకు మార్చడం వల్ల సమస్య ఉత్పన్నమైనట్లు కలెక్టర్లు నిమ్మగడ్డ దృష్టికి తెచ్చారు. విజయనగరం కలెక్టర్ ప్రతిపాదన పట్ల నిమ్మగడ్డ సానుకూలంగా స్పందించారని, అందుకు సంబంధించిన ప్రతిపాదనను పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా పంపాలని సూచించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment