దేవుళ్ల రథాలపై మరింత నిఘా..   | Special Measures To Preserve Chariots In Temples | Sakshi
Sakshi News home page

దేవుళ్ల రథాలపై మరింత నిఘా..  

Published Sat, Sep 12 2020 10:44 AM | Last Updated on Sat, Sep 12 2020 11:38 AM

Special Measures To Preserve Chariots In Temples - Sakshi

ద్వారకా తిరుమల: ప్రముఖ ఆలయాల్లోని దేవతామూర్తుల రథాలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆ కేసును సీబీఐకు అప్పగిస్తూ శుక్రవారం జీవోను జారీ చేసింది. దీంతోపాటు హిందూ ఆలయాల్లో ఉండే రథాలపై నిఘా మరింతగా పెంచాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని ప్రధాన ఆలయాలకు సంబంధించిన రథాలను, అవి ఉండే ప్రాంతాలను పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలపై ఆలయ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న రథాన్ని, అలాగే క్షేత్ర ఉపాలయాలైన శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి రథాన్ని, లక్ష్మీపురంలోని జగన్నాథ స్వామివారి రథాన్ని, వాటి రథ శాలలను భీమడోలు సీఐ ఎం.సుబ్బారావు, ద్వారకాతిరుమల ఇన్చార్జి ఎస్సై శ్రీహరిరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రథాల పరిరక్షణకు చేపడుతున్న చర్యలను శ్రీవారి దేవస్థానం ఎలక్ట్రికల్‌ డీఈ టి.సూర్యనారాయణ వారికి వివరించారు. (చదవండి: అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు కుట్ర: విజయసాయిరెడ్డి

పరిరక్షిస్తుంది ఇలా..  
శ్రీవారి పాత రథాన్ని భక్తుల సందర్శనార్థం ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఉంచి, కొత్త రథాన్ని ఏడాదికి రెండుసార్లు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వినియోగిస్తున్నారు. ఈ రథ సంరక్షణార్థం దేవస్థానం కొన్నేళ్ల క్రితమే ఆర్‌సీసీ రూఫ్‌ కలిగిన రథశాలను నిర్మించింది. ఉత్సవం పూర్తయిన వెంటనే రథాన్ని అందులో ఉంచి, ఇనుప డోరును వేసి, తాళాలు వేస్తారు. ఇదే తరహాలో లక్ష్మీపురం ఆలయం వద్ద ఉన్న రథశాలల్లో కుంకుళ్లమ్మ, జగన్నాథుని రథాలను పరిరక్షిస్తున్నారు. ఈ రథ శాలలు పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పాట్లు కలిగి ఉన్నాయి. ఇదిలా ఉంటే అంతర్వేది ఘటన తరువాత జిల్లాలో భీమవరంలోని సోమేశ్వర జనార్దన స్వామి రథం, ఆచంటలోని ఆచంటేశ్వర స్వామి రథం, అలాగే అత్తిలి మండలం బల్లిపాడులోని మధన వేణుగోపాల స్వామి రథం, దువ్వ వేణుగోపాలస్వామి రథం, కామవరపుకోటలోని వీరభద్ర స్వామి రథం ఇలా పలు ప్రముఖ దేవాలయాల్లోని రథాలపై పోలీసులు నిఘా పెంచారు. వాటి రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. (చదవండి: ‘అంతర్వేది’పై సీబీఐ..

శ్రీవారి దేవస్థానం రథాలకు ఇన్సూరెన్స్‌.. 
శ్రీవారి రథంతోపాటు, కుంకుళ్లమ్మ, జగన్నాథుని రథాలు ఉండే రథశాలల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ రథశాలల వద్ద ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో హోంగార్డులు, అలాగే సెక్యూరిటీ గార్డులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే చినవెంకన్న దేవస్థానం అధికారులు యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా మూడు రథాలకు సుమారు రూ.40వేలకు పైగా వెచ్చించి ఇన్సూరెన్స్‌ చేయించారు.   

ఏం ఢోకా లేదు  
శ్రీవారి దేవస్థానం రథాలకు ఏ ఢోకా లేదు. మూడు రథాలనూ ప్రత్యేకంగా నిర్మించిన ఆర్‌సీసీ రూఫ్‌ కలిగిన రథ శాలల్లోనే భద్రపరుస్తున్నాం. రాత్రి వేళల్లో రథ శాలల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తున్నాం. అలాగే రథాలకు ఇన్సూరెన్స్‌ కూడా చేయించాం. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం రథాల పరిరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం.  
– రావిపాటి ప్రభాకరరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement