చిన్నిని చంపిన గుండు (ప్రేమికుల గుండు)
కేవీపల్లె(చిత్తూరు జిల్లా): నీవే నాప్రాణం.. నీవే నా సర్వస్వం అనుకున్న ప్రియుడి గుండె బద్ధలైంది. తాను నమ్ముకున్న ప్రేయసిని పొరబాటున కాల్చి చంపాల్సి వచ్చింది. ఈ ఘటన కేవీపల్లె మండలం, మారేళ్ల పంచాయతీ పరిధిలోని గ్రామస్తులును నేటికీ కదిలిస్తోంది. అమర ప్రేమికుల ఆనవాళ్లను చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
చదవండి: Valentine's Day: ఇట్లు.. నీ ప్రేమ..
మారేళ్ల సమీపంలోని పాళెంలో వనం తిరుమలనాయునివారు, వనం తిమ్మయ్యనాయుని వారు, వనం గోపీ నాయునివారు, వనం యర్రమనాయునివారు అనే నలుగురు అన్నదమ్ములు ఉండేవారు. వీరిలో రెండోవాడు తిమ్మయ్యనాయునివారు (దొరవారు)కి తుపాకీతో అడవి జంతువులను వేటాడడం సరదా. ఈ క్రమంలో వేటాడుతూ వివిధ ప్రాంతాల్లో సంచరించేవాడు. ఈ నేపథ్యంలో మంచాలమందకు చెందిన చిన్ని అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది.
గుండు కింద ఏర్పరుచుకున్న ఆవాసం
ఏకాంతం కోసం ఆవాసం
మారేళ్ల పంచాయతీ పరిధిలో పెద్దకొండ, ఊరకొండ, ఎగువబోడు, నల్లేనుకొండలతో కూడిన సువిశాల అటవీ ప్రాంతం ఉంది. దొరవారు, చిన్ని ఏకాంతంగా కలుసుకోవడానికి మధ్యలో ఉన్న నల్లేనుకొండను ఎంచుకున్నారు. ఈ కొండ దిగువ ప్రాంతంలో పెద్ద రాతిగుండును ఆవాసంగా ఏర్పరచుకున్నారు. రాతి గుండు కింద నివాసం ఉండే విధంగా రాతి కట్టడం చేపట్టి ఇల్లుని తలపించేలా రూపొందించుకున్నారు. దొరవారికి ఈ ప్రాంతం కొంచెం దగ్గర కావడంతో ప్రతిసారీ ఆయనే ముందు వచ్చి సేద తీరుతుండేవాడు. ఓ రోజు దొరవారికంటే ముందే చిన్ని వచ్చింది. సుదూర ప్రాంతం నుంచి పయనించడంతో అలసిపోయిన ఆమె నిద్రిస్తూ ఉంటుంది.
అప్పటికే చీకటి అయిపోతుంది. దొరవారు రాతి గుండు వద్దకు చేరుకుంటాడు. లోనికి చూసేసరికి చిన్ని ధరించిన చీర పులిచారలు కలిగి ఉంటుంది. చీకటిలో సరిగ్గా కనబడకపోవడంతో తమ ఆవాసంలోకి పులివచ్చిందని భావించి తన వద్ద ఉన్న తుపాకీ తీసి కాల్చుతాడు. దీంతో చిన్ని అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తుంది. తరువాత విషయం తెలుసుకున్న దొరవారు చేజేతులా ప్రియురాలిని చంపుకున్నానని తీవ్ర ఆవేదన చెందుతారు. ఆపై తాను కూడా తుపాకీతో కాల్చుకుని చనిపోతాడు. వారి ప్రేమకు ప్రతిరూపంగా ఆ రాతిగుండు వద్దే వారిని ఖననం చేస్తారు. ఇప్పటికీ వారి సమాధి కట్టడాలు మనకు దర్శనమిస్తాయి.
గొప్ప చరిత్ర ఉంది
చిన్నిని చంపిన గుండుకు గొప్ప చరిత్ర ఉంది. గుండు కింద ఇప్పటికీ ప్రేమికులు ఏర్పరచుకున్న కట్టడాలు ఉన్నాయి. మృతి చెందిన అనంతరం ఇద్దరినీ అక్కడే ఖననం చేసినందుకు నిదర్శనంగా వారి సమాధులు ఉన్నాయి. వారి గాఢ ప్రేమకు నిదర్శనంగా ఈ గుండు నిలిచింది.
– వెంకటరమణ, మారేళ్ల
మా పెద్దోళ్లు కథలుగా చెబుతారు
మా పెద్దోళ్లు ప్రేమికుల గురించి కథలు కథలుగా చెబుతున్నారు. దట్టమైన అడవీ ప్రాంతం కావడంతో వారు ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవడానికి నల్లేనుకొండలోని గుండును ఇల్లులాగా రూపొందించుకున్నట్లు ఇప్పటికీ ఆనవాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇక్కడ గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపి కొన్ని కట్టడాలు తొలగించారు. – శ్రీనివాసులు, మారేళ్ల
Comments
Please login to add a commentAdd a comment