జైత్రయాత్రను తలపించిన సీఎం జగన్‌ బస్సుయాత్ర | Special Story On CM Jagan Memantha Siddham Bus Yatra Journey | Sakshi
Sakshi News home page

జైత్రయాత్రను తలపించిన సీఎం జగన్‌ బస్సుయాత్ర

Published Thu, Apr 25 2024 4:57 PM | Last Updated on Thu, Apr 25 2024 5:06 PM

Special Story On CM Jagan Memantha Siddham Bus Yatra Jpurney - Sakshi

మేమంతా సిద్ధం యాత్రకు అపూర్వ ఆదరణ

సీఎం వైఎస్ జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు

అరచేతుల్లో హారతి కర్పూరాలతో స్వాగతాలు..

22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల బస్సుయాత్ర

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 

16 సభలు, 6 ప్రత్యేక సమావేశాలు, 9 భారీ రోడ్ షోలు

నేను కోరినట్లే నాకు అధికారం ఇచ్చారు. కానీ నేను దాన్ని అధికారం అనుకోలేదు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత అనుకున్నాను. ప్రతి ఇంట్లో, ప్రతివ్యక్తికి మంచి చేసే అవకాశం మీరు ఇచ్చారు అనుకున్నాను. నేనూ అలాగే నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ప్రతి ఇంటికి మేలు చేశాను. ఇది మీ ప్రభుత్వం. మీ తమ్ముడి ప్రభుత్వం.. మీ సోదరుడి ప్రభుత్వం గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించాను.

నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే, నేను నిజంగా మీకు మేలు చేశాను అనిపిస్తే నాకు ఓటు వేయండి. లేదులేదు నేను మీకేమీ చేయలేదనిపిస్తే నాకు ఓటేయవద్దు అని చెబుతూ.. తన ఐదేళ్ల పాలన మీద మార్కులు వేయించుకునేందుకు ప్రజా స్పందన తెలుసుకునే నిమిత్తం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగిసింది.

మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సుయాత్ర నేడు టెక్కలిలో ముగిసింది. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర ఒక  జైత్రయాత్రను తలపించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 బహిరంగ సభల్లో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. ఆరు ప్రత్యేక సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 86 నియోజకవర్గాలోని కోట్లమందికి స్పృశిస్తూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది.

ఎక్కడికక్కడ మహిళలు, వృద్ధులు.. రైతులు..యువత తమ అభిమాన నాయకున్ని చూసేందుకు నిప్పులుగక్కే ఎండను సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు. ఆయనవెంట ..ఆ బస్సు వెంట పరుగులు తీసిమరీ సెల్ఫీలు సంపాదించి దాన్ని అపురూపంగా దాచుకున్న యువతీయువకులు ఎంతోమంది. మా అన్నకు కష్టం చెప్పుకుని సాంత్వన పొందాలని భావించి ఆయన్ను కలిసి గోడువెళ్లబోసుకుని కన్నీళ్లు తుడుచుకుని భరోసాతో అన్నకు బైబై అంటూ సాగనంపిన ఆడబిడ్డలు ఎంతోమంది. మనవడా.. నువ్వు మళ్ళీ రావాలి మాకందరికీ మంచి చేయాలి అంటూ ఆశీర్వదించి పంపిన అవ్వాతాతల ఆశీర్వాదాలు ఆ బస్సులో మూటలు మూటలుగా పేరుకుపోయాయి.

మామయ్యా మళ్ళీ నువ్వొస్తావుగా అంటూ వీడ్కోలు పలికిన పిల్లల చిరునవ్వులు జగన్ మోములో ప్రతిబింబించాయి. ఇలా ఒకటా రెండా.. ఎన్నో గుండెలను, ఎంతోమంది మనసులను తడుముతూ ఈ యాత్ర సాగింది. తాను గతంలో ప్రతిపక్ష నేతగా నడిచి వెళ్లిన మార్గంలో మళ్ళీ ఇప్పుడిలా, అప్పుడు ఎలా ఉండే స్కూళ్ళు ఇప్పుడెలా మారాయి అప్పుడు కష్టాలతో కన్నీళ్లు ఇంకిన కళ్ళు ఇప్పుడు తనను ఆనందం నింపిన ప్రేమతో దగ్గరకు పిలుస్తుంటే ఏ నాయకుడికి మాత్రం ఆనందం కాదు.

ఈ యాత్ర మొత్తం రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని,  ప్రజల మూడ్‌ను మార్చేసింది. ఎక్కడికక్కడ జగన్ మావాడే . నేను సైతం జగన్ వెంట అంటూ వేర్వేరు పార్టీల నుంచి వచ్చి చేరుతున్నవాళ్ళతో జిల్లాల్లో పార్టీ విభాగం కిక్కిరిసిపోతోంది. రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం.. మళ్ళీ వస్తాను..మీకు మరింత మంచి చేస్తాను..అని చెబుతూ జగన్ వెళుతున్న దారిని చూస్తూ ప్రజలు అరచేతుల్లోనే హారతి కర్పూరాలు వెలిగించి విజయీ భావ అంటూ ఆశీర్వదించి పంపించారు.
-సిమ్మాదిరప్పన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement