ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిసరాలు ప్రత్యేక వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్లాంట్ స్థలంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి రహదారికి ఇరువైపులా ఉండే పరిసరాలను చూస్తే విశాఖ నగరంలో ఉన్నామా లేక మరెక్కడైనా ఉన్నామా అనే సందేహం కలుగుతుంది.
ఉక్కు ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే వేడిని చల్లార్చేలా వాతావరణ సమతుల్యత కోసం తీసుకుంటున్న చర్యల వల్ల నగరంంలో కంటే స్టీల్‌ప్లాంట్ ప్రాంతంలో 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించడంతో దేశంలోనే పర్యావరణ హిత ప్లాంట్‌గా ఖ్యాతి గాంచింది. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్టీల్ ప్లాంట్ గ్రీన్ ప్లాంట్‌గా ఎలా మారిందన్నదానిపై ప్రత్యేక కథనం..
ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో..
స్టీల్‌ప్లాంట్ ప్రారంభం నుంచి పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం స్టీల్‌ప్లాంట్ ఆగ్రో ఫారెస్ట్ విభాగం ఆధ్వర్యంలో మొదటి దశలో టన్ను స్టీల్ ఉత్పత్తికి ఒకటి చొప్పున మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని మూడు మిలియన్ చెట్లు నాటి ఆదర్శంగా నిలిచింది.
ప్లాంట్ మొదటి దశలో హరిత వనాల పెంపునకు రూ.360 కోట్లు వ్యయం చేయగా.. విస్తరణ యూనిట్లలో మొక్కల పెంపునకు రూ.1,150 కోట్లు వ్యయం చేస్తున్నారు. నిబంధనల మేరకు పరిశ్రమలోని 33 శాతం గ్రీన్ బెల్ట్‌కు వినియోగించాల్సి ఉండగా.. స్టీల్‌ప్లాంట్ ఆ రికార్డును అధిగమించి 2,600 హెక్టార్లలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసింది.
7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యం
ప్రస్తుతం జరుగుతున్న 7.2 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అనుగుణంగా 7.2 మిలియన్ మొక్కలు నాటే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్ ముందుకు సాగుతోంది. 2023 మే నెల నాటికి 5.51 మిలియన్ మొక్కలు నాటారు. తుపానులు, సునామి వంటి ఉప ద్రవాలను తట్టుకునేలా సుమారు 24 లక్షల కాజురీనా మొక్కలు నాటారు.
కాలుష్యాన్ని నివారించేందుకు 18 లక్షలు ఏఏ ఫోర్మిస్, మామిడి, కొబ్బరి, జీడి, జామ, వేప, సుబాబుల్, సపోటా, రావి, మర్రి, టేకు మొక్కలు నాటారు. అదేవిధంగా 2.50 లక్షల యూకలిప్టస్ మొక్కలు నాటారు. బయోడీజిల్‌ను ప్రోత్సహించేందుకు సుమారు 4.50 లక్షలు పాల్‌మైరా, పొంగామియా, జట్రోపా మొక్కలు నాటారు.
పర్యావరణంతో పాటు సంస్థకు ఆదాయం
స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. లక్షలాది మొక్కలను నాటడం ద్వారా నగరంలోని పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివిధ రకాల మొక్కలను పెంచడం ద్వారా సంస్థకు లక్షలాది రూపాయలు ఆదాయం కూడా లభిస్తోంది. సంస్థపై ఎటువంటి ఆర్థిక భారం లేకుండా ఆదాయం సమకూరుస్తున్నాం. – వీఎల్‌పీ లాల్, డీజీఎం, ఆగ్రో ఫారెస్ట్ విభాగం
నగర కాలుష్యాన్నీ తగ్గించేలా..
నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టిన గ్రీన్ విశాఖ ప్రాజెక్ట్‌లో 4.50 లక్షల మొక్కలు నాటేందుకు స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. 2012–19 మధ్యకాలంలో 4.50 లక్షలు మొక్కలు నాటి నగర పర్యావరణానికి సహకారం అందించారు.
కార్పొరేట్ ఎన్విరాన్‌మెంట్ రెస్పాన్సిబిలిటీ (సీఈఆర్) ప్రాజెక్ట్‌లో భాగంగా 2019–23 వ్యవధిలో వివిధ ఫల జాతులకు చెందిన 55 వేల మొక్కలు నాటారు. 2020లో నగరంలోని ఐఐఎం క్యాంపస్‌లో గ్రీనరీ పెంపునకు రూ.40 లక్షలు అందజేశారు. సీఈఆర్‌లో భాగంగా స్టీల్‌ప్లాంట్ పరిసర గ్రామాల్లోని రైతులకు సుమారు 75 వేల జామ, మామిడి, సపోటా, కొబ్బరి మొక్కలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment