వేటలో మృతి చెందిన పులితో కాకర్లపూడి రామచంద్రరాజు
ప్రత్తిపాడు రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రత్తిపాడు మండలంలోని పులి సంచారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అటువంటి ఈ ప్రాంతంలో స్వతంత్రానికి పూర్వం పులులు విస్తారంగా సంచరించేవన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్పటి తరం వారికి మాత్రం పులుల సంచారం, స్థానిక వేటగాళ్ల ధైర్య సాహసాల గురించి బాగా తెలుసు. తమ సైనికులకు రక్షణ కల్పించాలంటూ అప్పటి వేటగాళ్లను బ్రిటిష్ ప్రభుత్వం అర్థించింది. ప్రత్తిపాడు పరిసరాలు, నాగులకొండ ప్రాంతాల్లో పులులు, చిరుత పులులు విస్తారంగా సంచరించేవట. అనుకోని అతిథిలా ప్రత్తిపాడు ప్రాంతానికి వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ తూర్పుకనుమల్లో కనిపించడం ఇదే ప్రథమం. అయితే ఈ ప్రాంతంలో పులులు లేవా, ఉంటే ఏమయ్యాయి అన్నదానిపై సమాచారం సేకరిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
20 పులులను సంహరించిన చిట్టిరాజు
జగ్గంపేట మండలం రాయవరానికి చెందిన చిట్టిరాజు ప్రపంచంలోనే ప్రముఖ వేటగాడు జిమ్ కార్బెట్ సమకాలికుడు. 1918 – 1926 మధ్య నరమాంస భక్షకిగా హడలెత్తించిన రుద్ర ప్రయోగ చిరుతపులిని చంపడానికి అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న వేటగాళ్ల కోసం గాలించింది. అందులో జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన చిట్టిరాజు ఒకరు. సరిగ్గా అదే సమయంలో ప్రత్తిపాడు అటవీ ప్రాంతంలో గుర్రాల మీద వెళ్లే బ్రిటిష్ సైనికులను పులులు చంపి తినేస్తుండటంతో బ్రిటిష్ అధికారులు కొట్టాం సంస్థానం, తుని రాజా వారికి పులులను సంహరించే బాధ్యతలను అప్పగించారు.
రామచంద్రరాజు వేటాడిన బెంగాల్ టైగర్
ఆ పనిని తుని రాజా వారు చిట్టిరాజుకి అప్పగించారు. మనం చేయాల్సిన పనిని పులులు చేస్తున్నాయి. అటువంటి పులులను తాను సంహరించలేనని దేశభక్తి భావంతో ఆయన నిరాకరించారట. అయితే బ్రిటిష్ సైనికులతో పాటు స్థానిక ప్రజలు పులి దాడిలో మృతి చెందటంతో రాజాజ్ఞ ప్రకారం పులులను సంహరించే బాధ్యతను స్వీకరించారు. పులిని సంహరించిన తర్వాత ఏ తెల్లదొర తనతో కరచాలనం చేయరాదని షరతుతో పులిని వేటాడినట్టు తెలిసింది. ఆయన జీవిత కాలంలో మనుషులకు హాని కలిగించే 20 పులులను సంహరించినట్లు భోగట్టా. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు రుద్రయాగ చిరుత పులి సంహారానికి రమ్మని చిట్టిరాజుకు కూడా వర్తమానం పంపారట. జిమ్ కార్బెట్ అప్పటికే అక్కడ పులి వేటలోకి దిగిపోయారు. ఐదు వందల చదరపు మైళ్లు తిరిగి, రెండున్నర నెలలు పాటు మాటు వేశారు. అధికారిక లెక్కల ప్రకారం రుద్రప్రయోగ పులి 125 మందిని చంపిందని చెబుతున్నా అనధికారికంగా రెండు వేలకు పైనే చనిపోయి ఉంటారు.
రాజుబాబు వేటాడిన చిరుత
ఆంధ్ర జిమ్ కార్బెట్.. రాజబాబు
చిట్టిరాజు తర్వాత రామచంద్రపురానికి చెందిన శ్రీరాజా కాకర్లపూడి రామచంద్రరాజు బహుదూర్ (రాజబాబు)ను ప్రధానంగా చెబుతారు. ఈయన రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పట్లో కొందరికి వేటాడ్డానికి అనుమతులు ఉండేవి. ఆంధ్ర జిమ్ కార్బెట్‌గా చెప్పుకునే రామచంద్రపురం రాజబాబు వేటాడిన వాటిలో 5 బెంగాల్ టైగర్లు ఉండగా 20 వరకూ చిరుత పులులు ఉన్నాయట. ఇప్పటికీ రామచంద్రపురంలో రాజబాబు వధించిన పులుల కళేబరాలు గోడలకు అలంకరించి ఉన్నాయి.
చిరుత నోటిలో చేయి పెట్టిన కృష్ణమూర్తిరాజు
జగ్గంపేట మండలం మల్లిసాలకి చెందిన వత్సవాయి కృష్ణమూర్తిరాజు పదికి పైగా చిరుత పులులను వేటాడినట్టు చెబుతారు. ఈయన చిట్టిబాబురాజు మనువడు. చిరుతపులి వేటలో కృష్ణమూర్తిరాజు ధైర్యసాహసాలు, శక్తి యుక్తులను ప్రదర్శించి చిరుత నోటిలోనే తన చేతిని నెట్టి త్రుటిలో ప్రాణాలను కాపాడుకున్నారట. అయితే అప్పటికే పులికి కృష్ణమూర్తిరాజు తూటా దెబ్బ తగిలి ఉంది. దెబ్బ తిన్న పులి నుంచి ప్రాణాలు కాపాడుకోవడం చిన్నవిషయం కాదు. చిరుత నోటిలో పెట్టిన చేతిని చిరుత చప్పరించేసిందట. అనంతరం వేటలో ఉండగా పరుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు.
పులికి ఎదురెళ్లిన సూరిబాబురాజు
ఇంకొకరు రాజోలు మండలం చింతపల్లికి చెందిన అల్లూరి సూరిబాబురాజు దేశం నలుమూలలా తెలిసిన వేటగాడు. ఈయన చిరుత పులులతో పాటు, బెంగాల్ టైగర్స్‌ను కూడా వేటాడారు. మారేడుమిల్లి అడవిలో రోడ్డు మీద ఎదురుపడ్డ పులికి ఎదురెళ్లిన వేటగాడు సూరిబాబుని పాతతరం వారు చెబుతుంటారు. సూరిబాబు ఇటీవల కాకినాడలో మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment