గండికోట పిలుస్తోంది.. | Special Story On Tourism Development In Gandikota | Sakshi
Sakshi News home page

గండికోట పిలుస్తోంది..

Published Sat, Oct 3 2020 12:05 PM | Last Updated on Sat, Oct 3 2020 12:05 PM

Special Story On Tourism Development In Gandikota - Sakshi

గండికోటలో ట్రెక్కింగ్‌ చేస్తున్న యువకుడు (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, కడప: గండికోటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని శ్రీకారం చుట్టింది. భారీగా నిధులు వెచ్చించి సొబగులు అద్దనుంది. అమెరికాలోని గ్రాండ్‌ క్యానియన్‌ తర్వాత సుందరమైన ప్రాంతంగా దీనికి ప్రాచుర్యం కల్పించాలని భావిస్తోంది. వైఎస్సార్‌ పర్యాటక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటాలటీ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌ తరహాలో గండికోటలో కూడా రూపుదిద్దాలని యోచిస్తోంది. ఇందుకోసం సుమారు రూ.100 కోట్లు వ్యయమవుందని అంచనా. దీంతోపాటు రూ.7.50 కోట్లతో ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న రోప్‌వే నిర్మాణాన్ని కూడా పూర్తి చేయనుంది. అత్యాధునిక వసతులతో రిసార్ట్‌ రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం ప్రభుత్వం 13 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అత్యాధునిక సౌకర్యాలతో హోటల్‌ నిర్మాణంతోపాటు ప్రకృతి వైద్యశాల, స్విమ్మింగ్‌ఫూల్‌ తదితర అన్ని వసతులతో ఈ రిసార్ట్స్‌ ఏర్పాటు కానుంది.   

సాహసం శ్వాసగా.. 
ఇప్పటికే సాహసకృత్యాల అకాడమీ (అడ్వంచర్స్‌)కి రూ.3 కోట్లతో అన్ని వసతులు సమకూర్చుతున్నారు. ఐదెకరాలలో తరగతులతోపాటు హాస్టల్‌ వసతి కల్పించనున్నారు. హిమాలయ పర్వతాలలో మాత్రమే ఇలాంటి అకాడమీ ఉంది. అది కూడా అక్కడ పర్వతారోహణపై శిక్షణ మాత్రమే ఇస్తారు. గండికోటలో వాయు, జల, పర్వతారోహణలపై శిక్షణ ఇవ్వనున్నారు. కోటలో ఆర్కియాలజీ విభాగం అనుమతులతో దాల్మియా కంపెనీ దెబ్బతిన్న చారిత్రక కట్టడాలను పునరుద్ధరించే పనులను చేపట్టింది. టాయిలెట్ల నిర్మాణంతోపాటు కోట పరిసరాల శుభ్రత పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రూ. 2 కోట్లతో హరిత హోటల్‌ నిర్మాణం చేట్టారు.  మరో 15 వసతి గృహాలు (టెంట్లు) నిర్మించి ఫ్రీకౌట్‌ కంపెనీకి లీజుకు ఇచ్చింది. రూ.50 లక్షల ఖర్చుతో బోటింగ్‌ సౌకర్యం కలి్పంచారు. పచ్చదనం కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. కోట ముందు నుంచి టెంట్ల వరకు సిమెంటు రోడ్డు నిర్మించారు. రూ.30 లక్షలతో సోలార్‌ లైట్లను ఏర్పాటు చేశారు. పర్యాటకులకు పడిపోకుండా రూ.5 లక్షలతో కోట వారగా రెయిలింగ్‌ ఏర్పాటు చేశారు. రూ. 20 కోట్లతో జమ్మలమడుగు క్రాస్‌ నుంచి గండికోట వరకు డబుల్‌రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.   

పెట్టుబడికి అనుకూలం.. ప్రభుత్వ ప్రోత్సాహం 
గండికోట పరిధిలో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. తగినంతగా నీరుంది. రోడ్డు వసతి ఉంది. 80 కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్‌పోర్టు ఉంది. సమీపంలోని జమ్మలమడుగులో రైల్వేస్టేషన్‌ ఉంది. 35 కిలోమీటర్ల దూరంలో ప్రొద్దుటూరు పట్టణముంది. పెట్టుబడిదారులకు అనుకూలమైన ప్రాంతం. గండికోట పర్యాటకంగా అభివృద్ధి చెందితే చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చదువుకున్న యువత సరైన ప్రతిపాదనలతో ముందుకు వస్తే గండికోటలో వివిధ రకాల అభివృద్ధి పనులలో అవకాశం కల్పించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.   

గండికోటలో పర్యాటకాభివృద్ధి   
గండికోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. రూ. వందల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. అమెరికాలోని గ్రాండ్‌ కేనియన్‌ తర్వాత గండికోట పర్యాటక కేంద్రంగా ఉంటోంది. అత్యాధునిక వసతులు కల్పించి జాతీయ స్థాయిలో మరింత పేరు వచ్చేలా తీర్చిదిద్దుతాం. ఆ దిశగా పనులు వేగవంతం చేశాం. ఇప్పటికే గండికోట ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తున్నాం.
–సి.హరి కిరణ్, జిల్లా కలెక్టర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement