ప్రపంచ పర్యాటక పటంలో జిల్లాకు గొప్ప పేరు
ప్రతిష్టలు సాధించి పెట్టిన అద్భుతమైన చారిత్రక సాక్ష్యం గండికోట. భారతదేశపు గ్రాండ్ క్యానియన్‌గా పేరుగాంచి వేలాది మంది పర్యాటకులను ఆకర్శిస్తున్న మహాదుర్గం. దక్షిణ ప్రాంతంలోని భారీ కోటలలో ఒకటిగా పేరు గాంచిన వారసత్వ కట్టడం. దాదాపు వెయ్యి సంవత్సరాల చారిత్రక వైభవాన్ని నేటికీ చాటుతున్న విశిష్ట నిర్మాణం. జిల్లాకు గర్వకారణంగా దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో పయనిస్తున్న ప్రాంతం. గండికోట వారసత్వ ఉత్సవాల పేరిట నాలుగుసార్లు వేడుకలను నిర్వహించారు. వినూత్నమైన ఉత్సాహంతో అధికారులు ఈనెల 11, 12 తేదీల్లో మరోసారి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ సందర్భంగా కోటకు సంబంధించిన వివరాలు. – కడప కల్చరల్
కోట నిర్మాణం
త్రైలోక్య మల్లరాజు, కల్యాణి చాళుక్యుని ఆదేశంతో పెద్దముడియం పాలకుడిగా ఉన్న చిద్దన చోళ మహారాజు (కాకరాజ) ఈ కోట నిర్మాణానికి నడుం కట్టారు. ఆయన ఈ ప్రాంతం వాడే కావడంతో మొదట కొన్ని ప్రాంతాలను చూసినా కోట నిర్మాణానికి అనువుగా లేవని భావించాడు. తర్వాత గండికోట ప్రాంతంలో అన్వేషిస్తుండగా ఒక పొదరింటి నుంచి శ్వేత వరాహం రాజు వెంబడి ఉన్న వేట కుక్కలను తరిమి తిరిగి పొదలోకి వెళ్లిపోవడం గమనించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని కోట నిర్మాణానికి ఎంపిక చేశారు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఆదివరాహం రూపంలో సక్షాత్కరించి కోట నిర్మాణానికి అనువైన చోటును చూపాడని కాకరాజు విశ్వసించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని చదును చేయించి, వంకలు పూడిపించారు. పొలిమేర కాపు ఓబన్న ఆధ్వర్యంలో పొలిమేరలు నిర్ణయించారు.కోట నిర్మాణం ప్రారంభించారు. మొత్తంపై 1123 జనవరి 9న కోట ప్రారంభమైంది. ఈ చరిత్రను జిల్లాలో లభించిన పలు శాసనాలు «స్పష్టం చేస్తున్నాయి. కోటను నిర్మించిన చిద్దన చోళ మహారాజునే కాకరాజు అని వ్యవహరించేవారు.
విశిష్టత: ఈ ప్రాంతంలో పెన్నానది ఐదు కిలోమీటర్ల పాటు కొండను గండికొట్టి ప్రవహిస్తుండడంతో దీని గట్టుపై కట్టిన కోటను గండికోట అని వ్యవహరిస్తున్నారు. కోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడలను ఒక్కొక్కటి టన్ను బరువు ఉండే ఎర్రటి శానపురాళ్లతో నిర్మించారు. పునాదులు లేకుండా కేవలం కొండ బండలపై కోటను నిర్మించడం కష్టం. కోట తూర్పు నుంచి పడమరకు 1200 మీటర్ల పొడవు, వెడల్పు 800 మీటర్లుగా ఉంది. కోట చుట్టూ 101 బరుజులు ఉన్నాయి. కోట తూర్పు ప్రధాన ప్రవేశ ద్వారం 20 అడుగుల ఎత్తు ఉంది. ద్వారం తలుపులకు సూది మొన గల ఇనుప గుబ్బలు బిగించారు. వీటిని మూసి తెరిచేందుకు ఎనుగులను ఉపయోగించే వారని తెలుస్తోంది. కోట చుట్టూ సైనికులు గస్తీ తిరిగేందుకు ఐదు మీటర్ల వెడల్పుగల బాటను నిర్మించారు. శత్రువుల రాకను గమనించేందుకు కోట గోడలపై ఫిరంగులు ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రంద్రాలు ఉన్నాయి. పలుచోట్ల భారీ కొండరాళ్లే కోట గోడలుగా కనిపిస్తాయి. ఇంకొన్ని చోట్ల భారీ బండలపైనే కోట గోడల నిర్మాణం సాగింది.
గండికోట రహస్యం
గండికోట రహస్యం పేరుతో ఒక సినిమా రావడం తెలిసిందే. అది బాగా విజయవంతమైంది. ఈ సినిమాకు స్ఫూర్తిచ్చింది మన గండికోటలో జరిగిన సంఘటనలే. దానికి రచన సహకారం అందించిన కవి కొసరాజు రాఘవయ్య గండికోట చరిత్రను రాశారు. మీర్ జుమ్లా కుట్రలో ప్రాణాలు పోగొట్టుకున్న తిమ్మానాయుడు ప్రమాదాన్ని శంకించి బంధుమిత్రులను ఎక్కడికైనా వెళ్లిపోమ్మని సూచించాడు. రాణివాసం స్త్రీలు ఎండుమిరపకాయలను అగ్గిలో మండించి అందులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు. అప్పటికీ తిమ్మానాయుని కుమారుడు పసివాడు. చాకలి రమణక్క ఆ పసివాడ్ని రాజభవనం నుంచి తప్పించి రహస్యంగా కొన్నాళ్లపాటు పెంచింది. ఆ తర్వాత రాజబంధువులకు అప్పగించి ఆత్మార్పణ చేసుకుంది. ఆ తర్వాత పసివాడైన తిమ్మానాయుని కుమారుడు ఏమయ్యాడన్నదే రహస్యం. అదే గండికోట రహస్యంగా మారింది.
విదేశీయులను సైతం
గండికోట విదేశీయులను సైతం ఆకర్శించింది. ఒకప్పుడు ఇక్కడ లభించే వజ్రాల కోసం విదేశీ వ్యాపారులు ఈ ప్రాంతానికి ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. అలా వచ్చిన విదేశీయులలో ఎంబురే, ఫ్రేజర్‌లు గండికోట పెన్నాలోయ అందాలకు ముగ్దులై అద్భుతమైన పెయింటింగ్‌లను గీశారు. నేటికీ పలు విదేశీ గ్రంథాలయాల్లో ఈ పెయిటింగ్‌లు ప్రత్యేక విభాగంలో ఉన్నాయి.
కోటలో చూడాల్సినవి..
కోటలో అడుగు పెట్టగానే గవి ఆంజనేయుని ఆలయం కనిపిస్తుంది. ఆ తర్వాత మూడో మలుపులో వాచ్ టవర్ (ఢంకా టవర్) ఉంది. ప్రధాన ద్వారం 20 అడుగుల ఎత్తున భారీ తలుపులతో ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామంలోకి అడుగు పెట్టగానే వాచ్ టవర్ నాటి ముస్లింల నిర్మాణ చాతుర్యానికి నిదర్శనంగా నిలిచి ఉంది. దాని పక్కన ఎడమవైపుగా నాటి పద్ధతులకు నిదర్శనంగా కారాగారం విభిన్నశైలిలో కనిపిస్తోంది. ఆ తర్వాత శిథిల స్థితిలో ఉన్నా కూడా నేటికీ అద్భుతమైన శిల్పసంపద అలరారుతున్న శ్రీ మాధవరాయస్వామి ఆలయం ఉంది. కుడివైపున విశాలమైన మైదానంలో జుమ్మామసీదు అందాలు తప్పక చూడాలి. ఆ పక్కనే నాటి శైలికి ప్రతీకగా నిలిచిన ధాన్యాగారం, ఆ పక్కనే శిథిల స్థితివలో ఉన్న శ్రీ రంగనాథస్వామి ఆలయం ఉన్నాయి. కొద్దిదూరంలోనే పెన్నానది లోయ ఎంత సేపు చూసినా తనవితీరని అందాలతో విలసిల్లుతోంది.
పర్యాటక కేంద్రంగా..
గండికోటకు పర్యాటక కేంద్రంగా గొప్ప పేరుంది. ఒక దశలో ప్రపంచంలో పర్యాటకంగా ప్రథమస్థానంలో ఉన్న అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ స్థాయిలో ఉందని కూడా పేరు గాంచింది. అందుకే దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా కూడా అంటారు.ఇలాంటి అద్భుతమైన చారిత్రక కట్టడం మరెక్కడా లేదని, దక్షిణ ప్రాంత కోటలు అనే విదేశీయులు రాసిన పుస్తకంల కూడా ఉంది. ఈ కట్టడం జిల్లాకు మణిమకుటంలా భాసిస్తోంది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ గొప్ప పర్యాటక ప్రాంతంగా పేరు గాంచింది. జిల్లాలో మరికొన్ని కోటలు ఉన్నా గండికోటదే అగ్రస్థానం. ఈ కోట పర్యాటకంగా అభివృద్ధి అయితే లేదా యునెస్కో గుర్తింపు లభిస్తే జిల్లా ఆర్థిక స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది.
సినీ షూటింగ్‌లు
ఈ ప్రాంతాన్ని ఒకసారి చూసిన వారు మళ్లీమళ్లీ వెళ్లాలనుకుంటారు. మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల సినిమాలు కూడా తరుచూ షూటింగ్‌లు జరుపుకుంటూ ఉన్నాయి. ఎక్కువ శాతం గండికోటలో తీసిన రాజమౌళి ‘మర్యాద రామన్న’సినిమా అందరికీ తెలిసిందే. ఇవిగాక సాహసం, స్పైడర్‌తోపాటు పలు తమిళ, కన్నడ సినిమాలు గండికోటలో చిత్రీకరించారు.
ప్రస్తుతం కూడా ఇక్కడ ఓ తెలుగు సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. గండికోట అందాలను పూర్తి స్థాయిలో దేశంలోని అన్ని భాషల సినీ నిర్మాతలు, దర్శకులకు అందజేయగలిగితే ఈ ప్రాంతంలో షూటింగ్‌ల సందడి పెరుగుతుంది. షూటింగ్‌లు జరుపుకునేందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతులను కూడా సరళతరం చేయాల్సి ఉంది.
సాహస క్రీడల కేంద్రం
గండికోటలో శనివారం నుంచి వారసత్వ ఉత్సవాల్లో భాగంగా అడ్వెంచర్స్ స్పోర్ట్స్ క్లబ్‌ను ప్రారంభించనున్నారు. దీంతో సాహస క్రీడల శిక్షణ కేంద్రంగా మారనుంది. ఇలాంటి కేంద్రం దక్షిణ ప్రాంతంలో ఎక్కడా లేదు. ఉత్తర భారతదేశంలో కూడా కేవలం ఒక్కచోట మాత్రమే ఉంది. అక్కడ పర్వతారోహణకు మాత్రమే అవకాశం ఉండగా, గండికోటలో భూతల జల, వాయు, సాహస క్రీడలకు కూడా శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అన్ని అవకాశాలు ఉన్నాయి.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గండికోటను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రూ.1000 కోట్లు తొలి విడతగా మంజూరు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌లో టెండర్లను కూడా ఆహా్వనించారు. ఆయన అకాల మరణాంతరం అభివృద్ధి మందగించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ జిల్లావారే కావడం, పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పర్యాటకుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. గండికోట లోయలో అద్దాల వంతెన నిర్మించే ఆలోచన ఉన్నట్లు తెలిసి జిల్లా వాసులు ఎంతో ఆనందిస్తున్నారు. గండికోటను చూసేందుకు పండుగలు, రెండవ శనివారం, ఆదివారం, ఇతర సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. దీంతో గండికోటలో ఉన్న హరిత హోటల్ ఏమాత్రం సరిపోవడం లేదు. దీన్ని మరింత అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా పర్యాటక చిత్రపటంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించగలదు.
సంరంభం.. ప్రారంభం
ఉత్సవాల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ హరి కిరణ్ స్వయంగా ఏర్పాట్లను సమీక్షిస్తూ జేసీ గౌతమి, జేసీ–2 శివారెడ్డికి పర్యవేక్షణ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ప్రొద్దుటూరు, పులివెందులలో శోభాయాత్రలు తదితర కార్యక్రమాలు చేపట్టి జిల్లాకు సాహిత్య పరంగా ఉన్న విశిష్టతను గుర్తు చేశారు. విద్యార్థులకు గండికోట అంశంగా వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేసి ఉత్సవాల జోష్ పెంచారు.
ప్రొద్దుటూరులో శోభాయాత్ర
సంస్కృతి, సాహసం నినాదంతో
ఈ ఉత్సవాలను సంస్కృతి, సాహసం నినాదంతో నిర్వహించనున్నారు. అధికారులు ఈ మేరకు గండికోటలో ఈ రెండు రోజులపాటు పలు సాహస విన్యాసాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే కోటలో అడ్వెంచర్స్ స్పోర్ట్స్ క్లబ్ భవనాన్ని సి§ద్ధం చేశారు. తొలిరోజు ఉత్సవంలో భాగంగా అధికారులు, అమాత్యులు కలిసి ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పారాగ్‌లైడింగ్, ట్రెక్కింగ్, హాట్ బెలూన్ తదితర సాహస కృత్యాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. కోటలో లోయ వద్ద రక్షణ కోసం ఇనుప బారికేడ్స్ ఏర్పాటు చేశారు. పలుచోట్ల పర్యాటకుల కోసం బెంచీలు, మండపాలను ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల వారు సేద తీరేందుకు ఫ్రకౌట్ టెంట్లను కూడా సిద్ధం చేశారు. ఈ రెండు రోజులు కూడా రాత్రి సినీ గాయకుల ఆర్ర్‌కెస్టా, మరికొన్ని శాస్త్రీయ కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. స్థానిక కళాకారుల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.
ప్రదర్శనలు
ఈ సందర్భంగా పలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో సందర్శకులకు రెండు రకాల ఫుడ్‌కోర్టులు, ఇతర దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ పర్యాటక, సాంస్కృతిక సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక పుస్తకాల ప్రదర్శన, ప్రముఖ పర్యాటక ప్రాంతాల ఛాయచిత్రాల ప్రదర్శన నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment